Pooja Hegde: బుట్టబొమ్మ బ్యూటీ సీక్రెట్స్ ఇవేనట!
‘బుట్టబొమ్మా.. బుట్టబొమ్మా.. నన్ను సుట్టూకుంటివే!’ అంటూ కుర్రకారు మనసుల్ని చుట్టేసుకుంది టాలీవుడ్ అందాల తార పూజా హెగ్డే. తన అందం, అభినయంతో తెలుగు వారి మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న....
(Photos: Instagram)
‘బుట్టబొమ్మా.. బుట్టబొమ్మా.. నన్ను సుట్టూకుంటివే!’ అంటూ కుర్రకారు మనసుల్ని చుట్టేసుకుంది టాలీవుడ్ అందాల తార పూజా హెగ్డే. తన అందం, అభినయంతో తెలుగు వారి మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ బ్యూటీ.. తన వృత్తిపరమైన విషయాలే కాదు.. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్‌తో పంచుకుంటుంటుంది. ఈ క్రమంలో తన బ్యూటీ సీక్రెట్స్‌నీ ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తుంటుంది. అలా ఇటీవలే తాను పాటించే ఓ సౌందర్య రహస్యాన్ని బయటపెట్టింది పూజ. మరి, ఈ బుట్ట బొమ్మ బ్యూటీ సీక్రెట్సేంటో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం రండి..!
‘మీగడ’లాంటి అందానికి..!
ఓ నటిగా తెరపై మేకప్‌తో కనిపించక తప్పదు. అయితే వాటిలోని రసాయనాల ప్రభావం చర్మంపై పడకుండా ఉండడానికి సహజసిద్ధమైన పదార్థాలతో తయారుచేసిన ఫేస్‌ప్యాక్‌లు వేసుకుంటా. పసుపు, పాల మీగడ కలిపి తయారుచేసిన పేస్ట్‌ను ముఖానికి, మెడకు పట్టించి.. అరగంటయ్యాక చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకుంటా. ఈ ఫేస్‌ప్యాక్ ముఖాన్ని తాజాగా మార్చుతుంది.. ప్రకాశవంతమైన మెరుపును అందిస్తుంది. మేని మెరుపుకి రోజూ టీస్పూన్ నెయ్యి తినమని అమ్మ ఎప్పుడూ చెబుతుంటుంది. అలాగే కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే పండ్లు, కాయగూరలు, పాలు-పాల పదార్థాలు, కాయధాన్యాలు.. వంటివి ఆహారంలో భాగం చేసుకుంటా.
‘ట్యాన్’ రాకుండా..!
నాకు ఎగ్జిమా సమస్య ఉంది. దాంతో చర్మం ఎక్కువగా పొడిబారుతుంటుంది. అందుకే ఎప్పుడూ దీన్ని తేమగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుంటా. ఉదయం లేవగానే ముఖం శుభ్రం చేసుకొని మాయిశ్చరైజర్ రాసుకుంటా. నీళ్లు ఎక్కువగా తాగుతా. నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లు, కాయగూరలు తీసుకుంటా. ఎండ వల్ల చర్మం కందిపోకుండా (ట్యాన్) ఉండడానికి రోజూ సన్‌స్క్రీన్ లోషన్ అప్లై చేసుకుంటా. చాలామంది వేసవిలోనే ఈ సమస్య వస్తుందనుకుంటారు. కానీ ఇతర కాలాల్లోనూ ట్యాన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్నుంచి కాపాడుకోవడానికి సన్‌స్క్రీన్ లోషన్ తప్పనిసరి!
షూటింగ్స్ లేనప్పుడు!
మేకప్‌లోని రసాయనాల కారణంగా చర్మ ఆరోగ్యం దెబ్బతింటుంది. కానీ షూటింగ్స్ ఉన్నప్పుడు వేసుకోక తప్పదు. అందుకే షూటింగ్స్ లేనప్పుడు మేకప్‌కు వీలైనంత దూరంగా ఉంటా. ఒకవేళ వేసుకున్నా రాత్రి పడుకునే ముందు తొలగించుకొని మాయిశ్చరైజర్ రాసుకుంటా. ఇక ఎక్కడికెళ్లినా నా అందాన్ని కాపాడుకోవడానికి.. సన్‌స్క్రీన్, మాయిశ్చరైజర్, లిప్‌స్టిక్, సన్‌గ్లాసెస్.. నా హ్యాండ్‌బ్యాగ్‌లో ఉండాల్సిందే! సమయం దొరికినప్పుడల్లా స్పాకు వెళ్లడానికి ప్రాధాన్యమిస్తా. అందులోనూ డీప్-టిష్యూ మసాజ్ చేయించుకోవడమంటే ఇష్టం.
తలస్నానానికి ముందు!
జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే దానికి తగిన పోషణ అందాలి. కొబ్బరి నూనెలో ఆ గుణాలున్నాయి. అందుకే తలస్నానం చేయడానికి ముందు కొబ్బరి నూనెతో కుదుళ్లు, జుట్టును మర్దన చేసుకుంటా. అలాగే ఉదయం లేవగానే టీస్పూన్ కొబ్బరి నూనె తీసుకుంటా. తద్వారా అటు ఆరోగ్యపరంగా, ఇటు జుట్టు పోషణ విషయంలోనూ పలు సానుకూల మార్పులు రావడం గమనించాను.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.