ఈ పెళ్లి కూతురి యుద్ధ విన్యాసాలు చూశారా?

‘పోలీసులు, చట్టాలున్నా ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు తమను తాము రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. అందుకోసం మార్షల్ ఆర్ట్స్‌ లాంటి ఆత్మరక్షణ విద్యల్లో ఆరితేరడం అవసరం. అప్పుడే అనుకోకుండా వచ్చిన ఆపదను అమ్మాయిలు ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు..’ అంటోంది ఓ యువతి. ఆత్మరక్షణ విద్యల ప్రాధాన్యం తెలియజేసేందుకు తన వివాహ వేడుకనే వేదికగా చేసుకుంది.

Published : 04 Jul 2021 15:38 IST

Photo: Screengrab

‘పోలీసులు, చట్టాలున్నా ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు తమను తాము రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. అందుకోసం మార్షల్ ఆర్ట్స్‌ లాంటి ఆత్మరక్షణ విద్యల్లో ఆరితేరడం అవసరం. అప్పుడే అనుకోకుండా వచ్చిన ఆపదను అమ్మాయిలు ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు..’ అంటోంది ఓ యువతి. ఆత్మరక్షణ విద్యల ప్రాధాన్యం తెలియజేసేందుకు తన వివాహ వేడుకనే వేదికగా చేసుకుంది. ఇందులో భాగంగా పెళ్లి దుస్తుల్లోనే కత్తిసాము, కర్రసాము వంటి ప్రదర్శనలు నిర్వహించి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

పెళ్లి దుస్తుల్లో మార్షల్‌ ఆర్ట్స్!

సాధారణంగా పెళ్లంటే ఆటలు, పాటలు, బంధువులు, స్నేహితుల సందడి, విందు భోజనాలు, ఫొటోషూట్లు.. ఇలా ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. అయితే తమిళనాడులోని తిరుకోళూరు గ్రామానికి చెందిన 22 ఏళ్ల నిషా మాత్రం తన పెళ్లితో సమాజానికి ఓ సందేశం ఇవ్వాలనుకుంది. ఈ క్రమంలో తనకు తెలిసిన ‘సిలంబం’, ‘సురుల్‌ వాల్‌ వీచు’, ‘ఆది మురై’, ‘కలరిపయట్టు’.. వంటి సంప్రదాయ యుద్ధ విద్యలన్నింటినీ పెళ్లి వేడుకలో భాగంగా ప్రదర్శించింది. సంప్రదాయ చీరకట్టులో నిషా ప్రదర్శించిన విన్యాసాలకు అతిథులందరూ ఈలలు వేస్తూ, చప్పట్లు కొడుతూ ఆమెను అభినందించారు. వధువు ఉత్సాహాన్ని చూసి ఆమె స్నేహితులు కూడా ఈ ప్రదర్శనలో పాలుపంచుకోవడం విశేషం.

పదునైన కత్తులు తిప్పుతూ..

పెళ్లికూతురుగా ముస్తాబవ్వడమంటే.. హెయిర్‌ స్టైల్స్‌, మేకప్‌, వస్త్రధారణ, ఆభరణాలు, పూలు.. ఇలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు వధువులు. అదేవిధంగా పెళ్లి తంతు పూర్తయ్యే వరకు తాజాగా, అందంగా కనిపించాలని కూడా కోరుకుంటారు. కానీ ఇవేవీ ఆలోచించలేదు నిషా. సంప్రదాయ సిల్కు చీర, మెడలో భారీ పూలదండలు, ఒంటినిండా ఆభరణాలతోనే మార్షల్‌ ఆర్ట్స్‌ విన్యాసాలు చేసింది. ముఖ్యంగా ‘సురుల్‌ వాల్‌ వీచు’ అనే యుద్ధ విద్యలో భాగంగా పదునైన కత్తులతో ఆమె చేసిన ప్రదర్శన అక్కడున్న వారందరినీ కట్టిపడేసింది.

అవగాహన కోసమే!

బీకాంలో డిగ్రీ పూర్తి చేసిన నిషా ఎప్పటికైనా పోలీస్‌ అవ్వాలనుకుంటోందట! అందుకోసమే మూడేళ్ల క్రితం నుంచే మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ కూడా తీసుకుంటోంది. తల్లి మణి, తండ్రి పెరుమాల్‌ కూడా ఆమెను ఈ దిశగా ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి మార్షల్‌ ఆర్ట్స్‌ పోటీల్లోనూ సత్తా చాటి బహుమతులు కూడా గెలుచుకుందీ నవ వధువు. ‘నేను ఎప్పుడైనా టీషర్ట్‌, ట్రాక్‌ సూట్‌ ధరించే మార్షల్‌ ఆర్ట్స్‌ చేసేదాన్ని. అయితే ఇలా పెళ్లికూతురు అలంకరణలో వీటిని చేయడం ఎంతో కష్టంతో కూడుకున్న పని. మహిళలకు ఆత్మరక్షణ విద్యలపై అవగాహన కల్పించడానికే ఈ ప్రదర్శన నిర్వహించాను.’

అమ్మ ప్రోత్సాహంతోనే!

‘మా అమ్మ అందించిన ప్రోత్సాహంతోనే నేను మార్షల్‌ ఆర్ట్స్‌లో నైపుణ్యం సాధించాను. ఆమె ఇప్పుడు తన స్టూడెంట్స్‌కు కూడా యుద్ధ విద్యల్లో శిక్షణ ఇస్తోంది. పెళ్లి వేడుకలో నాతో పాటు ప్రదర్శనలో పాల్గొన్న వారిలో ఆమె దగ్గర శిక్షణ పొందుతోన్న విద్యార్థులు కూడా ఉన్నారు. ఇక నాతో పాటు మరో 80 మందికి యుద్ధ విద్యల్లో ఉచితంగా శిక్షణ అందిస్తోన్న నా కోచ్‌కి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. గతేడాది జిల్లా స్థాయి సిలంబం పోటీల్లో మొదటి బహుమతి, రాష్ట్రస్థాయి పోటీల్లో మూడో స్థానంలో నిలిచాను..’ అని చెప్పుకొచ్చిందీ కొత్త పెళ్లి కూతురు.

అలాంటివి మళ్లీ జరగకూడదనే!

ఇక నిషా భర్త రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ‘పొల్లాచ్చి లాంటి హత్యాచార ఘటనలు మళ్లీ జరగకూడదని కోరుకుంటున్నాను. అమ్మాయిలు ఆత్మరక్షణ విద్యలు నేర్చుకోవాల్సిన అవసరాన్ని ఈ ఘటన చాటి చెప్పింది. అందుకే మా వివాహ వేడుకలో సాంస్కృతిక కార్యక్రమాలకు బదులు ఏదైనా సందేశమిచ్చే ప్రోగ్రాంలకు చోటిద్దామనుకున్నాం. అందులోనూ నా సతీమణి మార్షల్‌ ఆర్ట్స్‌లో నిష్ణాతురాలు కావడంతో ఆత్మరక్షణ విద్యలకు అవగాహన కల్పిద్దామని ఇద్దరం అనుకున్నాం. విజయవంతంగా అమలు చేశాం’ అంటూ తన భార్యామణిలో ఉన్న నైపుణ్యాల్ని ప్రశంసించాడాయన!

ఈ సందర్భంగా పెళ్లికూతురు అలంకరణలో నిషా చేసిన విన్యాసాలు సోషల్‌ మీడియాలో వైరలవడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మంచి ఉద్దేశంతో ఆమె చేసిన మార్షల్‌ ఆర్ట్స్‌ ప్రదర్శనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్