వీటిని తొక్కతోనే తినాలట!

కొన్ని పండ్లు, కాయగూరల తొక్క తొలగించి తినడం మనలో చాలామందికి అలవాటే! ఇక ప్రస్తుతం కరోనా భయం, ఆరోగ్యంపై అతిశ్రద్ధ కారణంగా ఇది మితిమీరిపోయింది. అయితే ఈ అలవాటు సంపూర్ణ పోషకాలను మన శరీరానికి అందకుండా చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. నిజానికి పండ్లు/కాయగూరల్లో ఉండే పోషకాల్లో సుమారు 25-30 శాతం దాకా ఈ తొక్కలోనే ఉంటాయట! అందుకే చేజేతులా ఈ పోషకాల్ని పడేయకుండా కనీసం ఇప్పట్నుంచైనా ఆయా పండ్లు/కాయగూరల్ని తొక్కతోనే తినమంటున్నారు. మరి, ఇంతకీ ఏయే పండ్లు/కాయగూరల్ని తొక్కతో తినాలి? అలా తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి? తెలుసుకుందాం రండి..

Published : 16 Jul 2021 17:20 IST

యాపిల్‌ తినేముందు దాని తొక్కపై మైనం ఉంటుందని పొట్టు తొలగిస్తాం..

జామకాయ తొక్క వగరుగా ఉంటుందని లోపలి గుజ్జు మాత్రమే తింటాం..

కమలాపండుని కచ్చాపచ్చాగా నమిలేసి తొక్క ఊసేస్తాం..

ఇలా కొన్ని పండ్లు, కాయగూరల తొక్క తొలగించి తినడం మనలో చాలామందికి అలవాటే! ఇక ప్రస్తుతం కరోనా భయం, ఆరోగ్యంపై అతిశ్రద్ధ కారణంగా ఇది మితిమీరిపోయింది. అయితే ఈ అలవాటు సంపూర్ణ పోషకాలను మన శరీరానికి అందకుండా చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. నిజానికి పండ్లు/కాయగూరల్లో ఉండే పోషకాల్లో సుమారు 25-30 శాతం దాకా ఈ తొక్కలోనే ఉంటాయట! అందుకే చేజేతులా ఈ పోషకాల్ని పడేయకుండా కనీసం ఇప్పట్నుంచైనా ఆయా పండ్లు/కాయగూరల్ని తొక్కతోనే తినమంటున్నారు. మరి, ఇంతకీ ఏయే పండ్లు/కాయగూరల్ని తొక్కతో తినాలి? అలా తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి? తెలుసుకుందాం రండి..

పొట్టుతోనే ఎందుకు..?!

తొక్క తొలగించిన పండ్లు, కాయగూరలతో పోల్చితే తొలగించని వాటిలో విటమిన్లు, ఖనిజాలు, మొక్కల ఆధారిత సమ్మేళనాలు పుష్కలంగా లభిస్తాయంటున్నారు నిపుణులు. ఉదాహరణకు.. తొక్క చెక్కేసిన యాపిల్‌ కంటే తొక్కతో కూడిన యాపిల్‌లో విటమిన్‌ ‘కె’ - 332 శాతం, విటమిన్‌ ‘ఎ’ - 142 శాతం, విటమిన్‌ ‘సి’ - 115 శాతం, క్యాల్షియం - 20 శాతం, పొటాషియం - 19 శాతం అధికంగా ఉంటాయట! అదే బంగాళాదుంపను తొక్కతో సహా ఉడికించడం వల్ల విటమిన్‌ ‘సి’ - 175 శాతం, పొటాషియం - 115 శాతం, ఫోలేట్‌ - 111 శాతం, మెగ్నీషియం-ఫాస్ఫరస్‌ 110 శాతం ఎక్కువగా శరీరానికి అందుతాయట! అంతేకాదు.. వీటి తొక్కలో పీచు, యాంటీ ఆక్సిడెంట్లు సైతం అధికంగానే ఉంటాయంటున్నారు నిపుణులు. పీచు కడుపు నిండిన భావన కలిగేలా చేసి ఆకలిని అదుపులో ఉంచుతుంది.. తద్వారా బరువు తగ్గచ్చు.

ఇక యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీరాడికల్స్‌తో పోరాడి వివిధ అనారోగ్యాలు/ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా మనల్ని కాపాడతాయి. అందుకే ఇలా శరీరానికి సంపూర్ణ పోషకాలు అందాలన్నా, ఆరోగ్య ప్రయోజనాలు పొందాలన్నా పండ్లు/కాయగూరల్ని తొక్కతో పాటే తీసుకోవాలని చెబుతున్నారు.

 

ఏవేవి తొక్కతో తినాలి?!

* యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియంట్స్‌ నిండి ఉన్న యాపిల్స్‌ని తొక్కతో పాటే తీసుకోవడం వల్ల అల్జీమర్స్‌ సమస్యతో పోరాడే శక్తిని శరీరానికి అందించచ్చు. ముఖ్యంగా యాపిల్‌ తొక్కలో ఉండే Triterpenoids అనే సమ్మేళనాలు క్యాన్సర్‌ ముప్పును చాలా వరకు తగ్గిస్తాయని పలు అధ్యయనాల్లో తేలింది.

* పియర్‌ పండ్ల (బేరి పండ్లు)లో ఉండే ఫైబర్‌లో సగానికి సగం దాని తొక్కలోనే ఉంటుందంటున్నారు నిపుణులు. అలాగే ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫైటోన్యూట్రియంట్లు శరీరానికి అందాలంటే తొక్కతో పాటే ఈ పండును తినాల్సి ఉంటుంది.

* మానసిక ఒత్తిళ్లను దూరం చేసే పండ్లలో ప్లమ్స్‌ ముందుంటాయి. వీటి తొక్కలో క్లోరోజెనికామ్లం అనే యాంటీ ఆక్సిడెంట్‌, విటమిన్‌ ‘సి’ పుష్కలంగా ఉంటాయి. ఇవి మలబద్ధకం, ఇతర జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

* కేవలం కివీ పండ్ల గుజ్జును తినడం కంటే వీటిని తొక్కతో పాటే తీసుకుంటే మూడు రెట్లు ఫైబర్‌ని అధికంగా శరీరానికి అందించినట్లే అని చెబుతున్నారు నిపుణులు. ఇక ఈ తొక్కలో విటమిన్‌ ‘సి’ కూడా పుష్కలంగా లభిస్తుంది.

* కొవ్వు కణాల ఉత్పత్తిని అణచివేయడానికి, శరీరంలో పేరుకుపోయిన అనవసర కొవ్వు నిల్వల్ని కరిగించడానికి మామిడి పండు తొక్కలో ప్రత్యేక గుణాలుంటాయట! ఇక దీని తొక్కలో ఉండే కెరోటినాయిడ్స్‌, పాలీఫినోల్స్‌, ఒమేగా- 3, 6తో పాటు పాలీఅన్‌శ్యాచురేటెడ్‌ ఫ్యాటీ ఆమ్లాలు.. క్యాన్సర్‌, డయాబెటిస్‌, గుండె సంబంధిత సమస్యలన్నింటితో పోరాడతాయి. కాబట్టి పండ్లైనా, పచ్చి మామిడికాయ అయినా, ఆవకాయ తయారీలోనైనా.. పొట్టుతోనే దీన్ని తీసుకోవడం అత్యుత్తమం అంటున్నారు నిపుణులు.

* టొమాటోలను ఉడికించిన తర్వాత దాని తొక్కను వేరు చేసి గుజ్జును మాత్రమే తీసుకోవడం మనలో చాలామందికి అలవాటు. కానీ దాని తొక్కలో Naringenin అనే ఫ్లేవనాయిడ్‌ ఉంటుందట! ఇది శరీరంలో వాపును తగ్గించి వివిధ రకాల అనారోగ్యాల బారిన పడకుండా మనల్ని కాపాడుతుందని ఓ అధ్యయనంలో తేలింది.

* బంగాళాదుంపలు, చిలగడ దుంప, క్యారట్‌, బీట్‌రూట్‌.. వంటి దుంపల తొక్కలో ఫైబర్‌, ఐరన్‌, విటమిన్‌ ‘సి’, పొటాషియం, ఫోలేట్‌.. అధికంగా ఉంటాయి. ఇవన్నీ శరీరానికి అవసరమే కాబట్టి వీటిని తొక్కతో పాటే వండుకొని తీసుకోవాల్సి ఉంటుంది.

*చర్మ ఆరోగ్యానికి ఉపయోగపడే సిలికా, జీర్ణక్రియను మెరుగుపరిచే ఫైబర్‌ కీరాదోసె పొట్టులో పుష్కలంగా ఉంటాయట! అందుకే దీన్ని పొట్టుతో తీసుకోవడమే మేలంటున్నారు నిపుణులు.

 

వీటి తొక్క చెక్కేయాలి.. కానీ..!

నిమ్మ, బత్తాయి, కమలాఫలం.. వంటి పండ్ల తొక్కల్లో యాంటీ ఆక్సిడెంట్లు నిండి ఉంటాయి. అయితే వీటి తొక్క దళసరిగా ఉంటుంది కాబట్టి నేరుగా తినలేం.. త్వరగా జీర్ణమవదు కూడా! అలాగని ఈ తొక్కల్ని వృథాగా పడేయకుండా వాటిని ఎండబెట్టుకొని పొడి చేసుకొని వంటకాల్లో ఉపయోగించడం వల్ల పోషకాలు పూర్తిగా శరీరానికి అందుతాయి. అలాగే పుచ్చకాయ, తర్బూజా, గుమ్మడి.. తొక్కల్ని ఉడికించుకొని జామ్‌ తయారుచేసుకోవచ్చు.

అయితే ఆయా పండ్లు, కాయగూరల్ని తొక్కతో తీసుకునే ముందు వాటిని బాగా శుభ్రం చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ క్రమంలో సబ్బునీటితో రుద్ది.. కుళాయి నుంచి నేరుగా వచ్చే నీటితో వాటిని శుభ్రం చేయచ్చు.. లేదంటే మార్కెట్లో దొరికే వెజిటబుల్‌/ఫ్రూట్‌ క్లీనర్స్‌ని సైతం ఉపయోగించచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్