Happiness Day: అందుకే అక్కడ వాళ్లెంతో హ్యాపీగా ఉంటారట!

‘సంతోషం సగం బలం’ అన్నారు పెద్దలు. అయితే వ్యక్తిగతంగా, వ్యవస్థ పరంగా ఎదురయ్యే పలు సమస్యలు మనల్ని సంతోషానికి దూరం చేస్తుంటాయి. ఆ సమస్యల్ని పసిగట్టి వాటిని దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాయి పలు దేశాల ప్రభుత్వాలు.

Updated : 21 Mar 2024 13:15 IST

‘సంతోషం సగం బలం’ అన్నారు పెద్దలు. అయితే వ్యక్తిగతంగా, వ్యవస్థ పరంగా ఎదురయ్యే పలు సమస్యలు మనల్ని సంతోషానికి దూరం చేస్తుంటాయి. ఆ సమస్యల్ని పసిగట్టి వాటిని దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాయి పలు దేశాల ప్రభుత్వాలు. అందుకే ‘ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాలు’గా కితాబునందుకున్నాయి. తాజాగా విడుదలైన ‘వరల్డ్‌ హ్యాపీనెస్‌ ఇండెక్స్‌ - 2024’ జాబితాలో మొత్తం 143 దేశాలుంటే.. అందులో ఫిన్లాండ్‌ మొదటి స్థానంలో నిలిచింది. ఈసారే కాదు.. గత కొన్నేళ్లుగా ఈ దేశం తొలి స్థానాన్ని ఆక్రమిస్తూ వస్తోంది. ఇందుకు ప్రధాన కారణం.. అక్కడి ప్రజలకు ఆ దేశ ప్రభుత్వం సకల సదుపాయాలు సమకూర్చడమే! వారి సంతోషానికి, సౌకర్యానికి పెద్ద పీట వేయడమే! ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న కొన్ని దేశాలకు మహిళలే సారధ్యం వహించడం విశేషం. మరి ‘అంతర్జాతీయ సంతోష దినోత్సవం’ సందర్భంగా.. ఆ దేశాలు, అక్కడి ప్రజల సంతోషం కోసం పాలకులు తీసుకుంటోన్న కొన్ని చర్యల గురించి తెలుసుకుందాం రండి..

సంతోషమనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉండదు. వ్యవస్థ మనకు కల్పించే  సౌకర్యాలు, అందించే వనరులు కూడా పరోక్షంగా మన ఆనందానికి కారణమవుతుంటాయి. అలా ఆయా దేశాల్లో ప్రభుత్వాలు ప్రజలకు కల్పిస్తోన్న కొన్ని ప్రమాణాల్ని ఆధారంగా చేసుకొని తాజాగా ‘వరల్డ్‌ హ్యాపీనెస్‌ ఇండెక్స్‌ - 2024’ జాబితా విడుదలైంది. ఆదాయం, ఆరోగ్యం, ప్రోత్సాహక వ్యవస్థ, నిర్ణాయక స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతి లేని సమాజం.. వంటి ప్రమాణాల ఆధారంగా విడుదలైన ఈ లిస్టులో 143కి పైగా దేశాలు చోటు దక్కించుకున్నాయి. ఇందులో అగ్రస్థానంలో నిలిచిన కొన్ని దేశాలు, అక్కడి ప్రజల సంతోషానికి గల కారణాలేంటో తెలుసుకుందాం..!

ఒత్తిడిని చిత్తు చేసేందుకు..!

ఫిన్లాండ్‌లో ప్రజల సంతోషం, సంక్షేమం కోసం పలు చర్యలు తీసుకుంటున్నారు. ఒత్తిడి లేకుండా సౌకర్యవంతమైన జీవితం గడిపేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో చాలామంది పిల్లలకు ఉచిత విద్యను అందించడం, ఉద్యోగులకు కచ్చితమైన-సౌకర్యవంతమైన పనివేళలు.. తద్వారా వారి వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌ను పెంచడం, ప్రతి ఒక్కరికీ ఆరోగ్య సంరక్షణ కవరేజీ కల్పించడం.. వంటివి అమలు చేస్తున్నారు.

ఇలా ప్రభుత్వమే కాదు.. అక్కడి ప్రజలూ తమ సంతోషానికి అధిక ప్రాధాన్యమిస్తుంటారు. ఈ క్రమంలో ఇతరులతో పోల్చుకోకపోవడం, ఆరోగ్యకరమైన అలవాట్లు, ప్రశాంతత కోసం ప్రకృతితో గడపడం, కొత్త విషయాలు-నైపుణ్యాలు నేర్చుకోవాలనుకునే వారిని వెన్నుతట్టడం.. ఇలాంటివన్నీ ఫిన్లాండ్‌ ప్రజల అమితానందానికి కారణమవుతున్నాయట! ఇవే ఏటా విడుదల చేసే ‘ప్రపంచ సంతోషకరమైన దేశాల’ జాబితాలో ఫిన్లాండ్‌ను మొదటి స్థానంలో నిలుపుతున్నాయి. గత ఏడాది జూన్ వరకు ఫిన్లాండ్‌కు ఒక మహిళ (సనా మారిన్) ప్రధానిగా వ్యవహరించిన విషయం తెలిసిందే.


‘Hygge’ - వాళ్ల హ్యాపీనెస్‌ సీక్రెట్‌!

‘సంతోషకరమైన దేశాల’ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది డెన్మార్క్. ఈ దేశ పాలకురాలు ఓ మహిళ కావడం విశేషం. 2019 నుంచి ఆ దేశ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు మెట్ ఫ్రెడరిక్సన్. డ్యానిష్‌ చరిత్రలోనే అతి పిన్న ప్రధానిగా పేరు తెచ్చుకున్న మెట్ తన ప్రజల సంతోషం, వారి అభ్యున్నతి కోసం పలు చర్యలు తీసుకుంటున్నారు. ఏ పనైనా నమ్మకం, నిజాయతీతో పూర్తిచేస్తే.. దానివల్ల కలిగే ఆనందం, సంతృప్తి మరెందులోనూ దొరకదు. తమ పాలనా వ్యవస్థలో ఈ రెండు సూత్రాల్నే అమలు చేస్తున్నారు మెట్. అక్కడి ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఆఫీసర్ల దగ్గర్నుంచి సిబ్బంది దాకా.. ఎలాంటి అవినీతికి పాల్పడకుండా, నిజాయతీగా పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నారామె. తద్వారా ప్రజల్లో ప్రభుత్వంపై పూర్తి విశ్వాసాన్ని నింపుతున్నారు. ఇలా ఏ సమస్య వచ్చినా తామున్నామన్న భరోసా ప్రజలకు కల్పిస్తున్నారు. అలాగే పిల్లల దగ్గర్నుంచి వృద్ధుల దాకా.. ప్రతి ఒక్కరి రక్షణకూ ప్రాధాన్యమిస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడ 10 ఏళ్ల లోపు పిల్లలు కూడా ఒంటరిగా ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకొని నిర్భయంగా ప్రయాణిస్తారట!

ఇక మరోవైపు అక్కడి ప్రజలు తమ సంతోషం కోసం ‘Hygge’ అనే పద్ధతిని పాటిస్తున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు.. ఇలా నచ్చిన వ్యక్తులతో కలిసి తమ కోసం తాము కాస్త సమయం గడపడమే దీని ముఖ్యోద్దేశం. ఫలితంగా పని ఒత్తిళ్లు దూరమై.. ఆనందాన్ని, అనుబంధాల్ని పెంచుకోవచ్చన్నది డ్యానిష్‌ ప్రజల నమ్మకం.


‘జడ్జ్‌’ చేయరు!

డిప్రెషన్‌.. ఈ రోజుల్లో చాలామందిని కుంగదీస్తోందీ సమస్య. ఇందుకు సమాజ వ్యవస్థ దగ్గర్నుంచి వ్యక్తిగత-వృత్తిపరమైన అంశాలు కారణమవుతున్నాయి. అదే ఐస్‌ల్యాండ్‌ దేశానికి వెళ్తే.. ఈ గణాంకాలు పూర్తి భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే అక్కడ ప్రతి 10 మందిలో ఒకరు.. అది కూడా అత్యంత అరుదుగా డిప్రెషన్‌ బారిన పడుతుంటారట! పైగా తమ వైవాహిక జీవితంలో సంతోషంగా లేక విడాకులు తీసుకున్నా సమాజం నుంచి వేధింపులు, సూటిపోటి మాటలు.. వంటివేవీ ఉండవని చెబుతున్నారు ఐస్‌ల్యాండ్‌ మహిళలు. ఈ ఒక్క విషయమనే కాదు.. ప్రతి విషయంలోనూ తమకు నచ్చినట్లుగా స్వేచ్ఛగా, సంతోషంగా జీవించే హక్కు కల్పిస్తోంది అక్కడి సమాజం.

ఇక ఈ దేశం విద్యకు అధిక ప్రాధాన్యమిస్తోంది. అందుకే అక్కడ అక్షరాస్యత 99 శాతం కాగా, నిరుద్యోగుల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుందట! నేరాల రేటు అత్యంత తక్కువగా నమోదవడం, తప్పు చేసిన వారికి తారతమ్యాల్లేకుండా శిక్షలు విధించడం, చిన్నారుల రక్షణ విషయంలో ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం.. వంటి విషయాల్లో కచ్చితంగా వ్యవహరిస్తున్నారు ఐస్‌ల్యాండ్‌ ప్రధాని కత్రిన్‌. 2017 నుంచి ఈ దేశానికి ప్రధానిగా ఉన్నారామె.


కాఫీ బ్రేక్‌తో.. హ్యాపీగా!

కార్యాలయాల్లో ఎడతెరపి లేని పనుల వల్ల చాలామంది ఒత్తిడికి గురవుతుంటారు.. ఇలా వృత్తిపరమైన ఒత్తిళ్ల వల్ల వ్యక్తిగత జీవితాన్నీ ఆస్వాదించలేకపోతుంటారు. ‘Fika Paus’ అనే పద్ధతితో ఈ మానసిక సమస్యలకు చెక్‌ పెడుతున్నారు స్వీడన్ వాసులు. తాజాగా విడుదల చేసిన ‘హ్యాపీనెస్‌ ఇండెక్స్‌ - 2024’ జాబితాలో ఈ దేశం నాలుగో స్థానంలో కొనసాగడానికి ఇదీ ఓ కారణమే అంటున్నారు అక్కడి ప్రజలు. ఆఫీస్‌ వేళల్లో మధ్యమధ్యలో అధికారికంగా తీసుకొనే కాఫీ విరామాలే ‘Fika Paus’ పద్ధతి ముఖ్యోద్దేశం. ఈ క్రమంలో ఉద్యోగులంతా ఒక్కచోట చేరి కాసేపు సరదాగా మాట్లాడుకోవడం వల్ల వారి మధ్య సత్సంబంధాలు రెట్టింపవుతాయి. అలాగే ఇలాంటి విరామాల వల్ల పని ఒత్తిడి తగ్గుతుంది.. పరోక్షంగా ఇది వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌కూ సహకరిస్తుంది. అంతేకాదు.. ఇక్కడి ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యమివ్వడం, అందరికీ ఉచితంగా విద్యనందించడం.. వంటివి కూడా ఈ దేశ ప్రజల సంతోషానికి కారణాలే అంటున్నారు అక్కడి వారు.


‘నైట్‌షిఫ్టులు’ ఉండవట!

ఆరోగ్యాన్ని, ఆనందాన్ని దెబ్బతీసే అంశాల్లో అసౌకర్యమైన పనివేళలు కూడా ఒకటి. ముఖ్యంగా నైట్‌షిఫ్టుల్లో పనిచేసే వారిలో గుండె, నరాల సంబంధిత సమస్యలు వస్తుంటాయి. అందుకే లిథువేనియా దేశం ఈ పనివేళలకు చెక్‌ పెట్టింది. అక్కడ దాదాపు 92 శాతం మంది ఉద్యోగులు పగటి పూటే పనిచేస్తారట! తప్పనిసరిగా రాత్రివేళల్లో పనిచేసే అవసరం ఉన్న కొన్ని ఫ్యాక్టరీల్లో ఎక్కువమంది ఉద్యోగుల్ని నియమించుకొని.. పని ముగిశాక వాళ్ల విశ్రాంతికీ అధిక ప్రాధాన్యమిస్తోందీ దేశం. ఇక అక్కడ నేరాలు, గృహహింస, అత్యాచారాలు.. వంటివీ తక్కువేనట! ఇలా ప్రతి విషయంలో ప్రజల రక్షణ, సంతోషమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నారు ఇంగ్రిడా సిమోనైట్‌. 2020 నుంచి ఆ దేశ ప్రధానిగా కొనసాగుతున్నారామె.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్