అలాంటి బంధాలకు దూరమైతేనే మంచిది!

‘బ్రేకప్’, ‘విడాకులు’.. పదమేదైనా భాగస్వామితో బంధాన్ని తెంచుకున్నామని తెలియజేసే పదాలివి! ఇష్టంతో అయినా, అయిష్టంతోనైనా ఒక బంధం నుంచి బయటికొచ్చినప్పుడు ఒకింత భావోద్వేగాలకు లోనవడం సహజం. అయితే మనకు వేదనను మిగిల్చి, మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే....

Published : 31 Mar 2022 18:44 IST

‘బ్రేకప్’, ‘విడాకులు’.. పదమేదైనా భాగస్వామితో బంధాన్ని తెంచుకున్నామని తెలియజేసే పదాలివి! ఇష్టంతో అయినా, అయిష్టంతోనైనా ఒక బంధం నుంచి బయటికొచ్చినప్పుడు ఒకింత భావోద్వేగాలకు లోనవడం సహజం. అయితే మనకు వేదనను మిగిల్చి, మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే బంధాల నుంచి బయటికొచ్చాక ఇలా బాధపడాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. పైగా ఇలాంటి బంధాలను తెంచుకోవడం వల్ల పలు ప్రయోజనాలూ చేకూరతాయంటున్నారు. అవేంటో తెలుసుకుందాం రండి..

తప్పు లేకపోయినా ఎందుకు మాట పడాలి?

‘నీకు ఏ పనీ చేతకాదు’, ‘చేసే పనైనా సరిగ్గా చేయవు’.. ఇలాంటి నిరుత్సాహపూరిత మాటలు చాలామంది దంపతులు/జంటలు అనుకున్నప్పుడు వింటుంటాం. కాకపోతే కొందరు అప్పటికి అలా మాట్లాడినా.. తర్వాత తమ తప్పు తెలుసుకొని భాగస్వామికి క్షమాపణ చెబుతారు. ఇంకొందరు మాత్రం అదేపనిగా భాగస్వామిని విమర్శిస్తూనే ఉంటారు. ఒక్కోసారి ఈ విమర్శల వల్ల మనం ఆత్మన్యూనతకు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి అలాంటి వ్యక్తులకు దూరమవడం వల్ల తప్పు లేకపోయినా పదే పదే మాటలు పడాల్సిన అవసరం ఉండదు. తద్వారా కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పెంపొందించుకోవచ్చు.

అసూయ పడుతున్నారా?

మీరు ఉన్నత స్థానాలను అధిరోహించే కొద్దీ మీ భాగస్వామి మీపై అసూయ పడచ్చు. తద్వారా తమనెక్కడ వదిలి వెళ్తారోనని అతను ప్రతిక్షణం అభద్రతకు లోనై మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు. దీనివల్ల మీరు కెరీర్‌తో పాటు వ్యక్తిగతంగానూ పలు సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అతడిని మార్చుకోగలిగితే సరే సరి.. లేదంటే అలాంటి వారికి దూరంగా ఉంటేనే మంచిదంటున్నారు నిపుణులు.

అనుమానం.. పెనుభూతం!

ప్రతి చిన్న విషయానికి భార్యను అనుమానించే భర్తలు కొంతమంది ఉంటారు. దీనివల్ల సంసారంలో కలతలు తప్ప సంతోషాలకు చోటుండదు. కాబట్టి అలాంటి వాళ్లతో ఉంటూ ఆత్మాభిమానాన్ని చంపుకోనవసరం లేదంటున్నారు నిపుణులు. అలాంటి అనుబంధం నుంచి బయటికొచ్చి మిమ్మల్ని మీరు నిరూపించుకోగలిగితే.. ఏదో ఒక రోజు వాళ్లే తమ తప్పు తెలుసుకొని మిమ్మల్ని క్షమాపణ కోరచ్చు.

ఆ హక్కు వారికి లేదు!

కొంతమంది విషయంలో.. చేసే పని, వేసుకునే దుస్తులు, తయారయ్యే విధానం.. వంటి విషయాల్లోనూ నిబంధనలుంటాయి. ఇలాంటి భాగస్వామిని ఎదుర్కోవడం ప్రతి క్షణం సవాలే అని చెప్పాలి. అదే ఆ బంధం నుంచి తప్పుకుంటే మీకు నచ్చినట్లుగా మీరు నడుచుకోవచ్చు. చక్కటి కెరీర్‌కూ బాటలు వేసుకోవచ్చు. ఏ విషయంలోనైనా మీ స్వేచ్ఛను హరించే హక్కు, మీపై కట్టుబాట్లు విధించే అధికారం ఎవరికీ లేదని గుర్తుపెట్టుకోండి.

రెండోసారి.. తప్పు కాదు!

ఒకసారి అనుబంధంలో దెబ్బతిన్నాక.. దానిపై నమ్మకం కోల్పోవడం మానవ సహజం. అయితే ఈ సమయంలో మిమ్మల్ని మీరుగా గుర్తించి, మీకు గౌరవమిచ్చే వ్యక్తి తారసపడితే.. అతనితో జీవితాన్ని పంచుకోవడంలో తప్పు లేదంటున్నారు నిపుణులు. ఇలా రెండోసారి కొత్త జీవితం మొదలుపెట్టాక గత అనుభవాలను గుర్తుచేసుకొని బాధపడడం అస్సలు సరికాదు. దీన్నుంచి బయటపడి భవిష్యత్తుపై దృష్టి పెడితే ఇటు వ్యక్తిగతంగా, అటు వృత్తిపరంగా ఉన్నతి సాధించచ్చు.

వీటితో పాటు స్వీయ ప్రేమను పెంచుకుంటే జీవితంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సులభంగా అధిగమించచ్చు. అలాగే గత అనుభవాల నుంచి బయటపడే క్రమంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా మానసిక నిపుణుల సహాయం తీసుకోవడం మర్చిపోకండి..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్