Updated : 05 Dec 2021 06:48 IST

రూ.ఆరు కోట్లు పెట్టి బడి కట్టించాడు!

‘నాన్నా, నిజంగా శ్రీమంతుడు సినిమాలోలా ఉన్నదాంట్లోంచి ఊరికి సాయం చేసేవాళ్లుంటారా’ అన్న కొడుకు ప్రశ్నకు ‘అవును’ అంటూ బదులిస్తూనే ఆ పని చేసి చూపించారాయన. దాదాపు ఆరు కోట్లరూపాయలు ఖర్చు పెట్టి ఆధునిక సౌకర్యాలతో ప్రభుత్వ పాఠశాల కట్టించారు. పూర్వవిద్యార్థులతో కలిసి డబ్బులు సేకరించి స్కూలు బాగోగులూ చూసుకుంటున్నారు... కామారెడ్డి జనగామ గ్రామానికి చెందిన తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి.

సుభాష్‌రెడ్డిది బీబీపేట మండలంలోని జనగామ గ్రామం. మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. ప్రస్తుతం బిల్డర్‌గా చేస్తూ హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. మూడేళ్లకిందట కుటుంబంతో కలిసి ఓసారి సొంతూరుకు బయలుదేరారు. దారిలో తండ్రీకొడుకులు సరదాగా కబుర్లు చెప్పుకుంటుంటే మధ్యలో ‘శ్రీమంతుడు’ సినిమా టాపిక్‌ వచ్చింది. ‘ఆ సినిమాలోని హీరోలా ఎంత డబ్బులున్నా నిజ జీవితంలో ఎవరు సాయం చేస్తారు నాన్నా’ అన్నాడు కొడుకు నిహాంత్‌. ఆ మాటలు సుభాష్‌రెడ్డిని ఆలోచనలో పడేశాయి. ‘ఎవరో ఎందుకు ఆ పని నేనే చేయొచ్చుగా’ అనుకున్నారు. అప్పుడే ఓరోజు చిన్ననాటి స్నేహితులతో కలిసి తను చదువుకున్న బీబీపేట ప్రభుత్వ పాఠశాలకు వెళ్లారు. బడి గోడలు పాడుబడి దాదాపుగా శిథిలావస్థకు చేరడం చూశారు. ‘అరె మనం చదువుకొనేటప్పుడు పచ్చని చెట్లతో కళకళలాడుతూ ఉండే స్కూలు ఇలా అయ్యిందే. విద్యార్థులకు ఎంత ఇబ్బందో’ అని బాధపడ్డారు. చేయాలనుకున్న సాయమేదో తాను చదివిన స్కూలుకే అందించాలని నిర్ణయించుకున్నారు. కొత్త పాఠశాల నిర్మాణానికి దాదాపు మూడు కోట్ల రూపాయల వరకు బడ్జెట్‌ వేసుకున్నారు. కానీ అత్యాధునిక సౌకర్యాలూ, కార్పొరేట్‌ హంగులతో స్కూలు మొత్తాన్ని ఏర్పాటు చేసేసరికి దాదాపు ఆరుకోట్ల రూపాయలు ఖర్చు అయ్యిందట. అలా 2020లో పాఠశాల నిర్మాణం మొదలుపెట్టి ఈ ఏడాదే పూర్తి చేశారు. తెలంగాణ మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డిల చేతుల మీదుగా పాఠశాల భవనాన్ని మొన్నీమధ్యే ప్రారంభించారు కూడా. ఆ కార్యక్రమం అయ్యాక ప్రభుత్వ పాఠశాలను కట్టించిన సుభాష్‌ రెడ్డిని మెచ్చుకుంటూ ఆ వేడుకకు సంబంధించిన వీడియోని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. అది చూసిన హీరో మహేష్‌బాబు ‘ఈ స్కూలు వెనక శ్రీమంతుడు సినిమా ప్రేరణ ఉందని తెలిసి ఏం చెప్పాలో తెలియనంతగా కదిలిపోయాను. సుభాష్‌ రెడ్డిగారూ... మీరే నిజమైన హీరో. మీలాంటి వ్యక్తుల అవసరం మనకెంతో ఉంది’ అంటూ రీట్వీట్‌ చేశారు.

స్కూలు ఎలా ఉంటుందంటే...

‘ప్రభుత్వ జిల్లా పరిషత్‌ పాఠశాల’ అన్న బోర్డు తప్పిస్తే అచ్చంగా ఇంటర్నేషనల్‌ స్కూల్‌లానే ఉంటుందీ బడి. పాత స్కూలు మొత్తాన్ని పడగొట్టి సరికొత్తగా నిర్మించారు. దాదాపు మూడు ఎకరాల విస్తీర్ణంలో 32 విశాలమైన గదులతో ఉంటుంది. చక్కని ఫర్నిచర్‌ ఉన్న తరగతి గదులతో పాటు నాలుగు ప్రయోగశాలలు, కంప్యూటర్‌ ల్యాబ్‌, మీటింగ్‌ హాల్‌, భోజనశాల, గ్రంథాలయం, విద్యార్థులకు ఇబ్బంది లేకుండా మరుగుదొడ్లు, మంచి నీటి వసతులు... ఇలా అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయిందులో. మొత్తం 661 మంది విద్యార్థులుండే ఈ బడిలో పిల్లలు హాయిగా చదువుకోవడానికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లూ చేశారు.

ఇదీ లక్ష్యం!

తాను పెద్ద చదువులు చదువుకోక పోయినా ఆసక్తి ఉన్న పిల్లలకు సాయం అందించాలనే ఉద్దేశంతో సుభాష్‌ రెడ్డి ఇదివరకే ఊళ్లో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. స్కూలు నిర్మాణం చేసి వదిలిపెట్టకుండా నిర్వహణ బాధ్యతలు చేపట్టేందుకు పూర్వవిద్యార్థులను భాగస్వాములను చేస్తూ కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటుచేశారు. ఇప్పటి వరకూ దాదాపు రూ.కోటిన్నర సేకరించారు. ఆ నిధులను బ్యాంకులో స్కూలుపేరుతో జమ చేసి వచ్చే వడ్డీని పాఠశాల బాగోగులకు వెచ్చిస్తారట. నిరుపేద విద్యార్థుల చదువులకూ వీలైనంత సాయం అందించడానికి మేం ఎప్పుడూ సిద్ధమే అంటున్నారు సుభాష్‌రెడ్డి.

లాక్‌డౌన్‌ తర్వాత ఇటీవల ఈ స్కూలుకొచ్చిన విద్యార్థుల ఆనందానికి అవధుల్లేవు. ఏడాదిక్రితం పాడుబడిన స్థితిలో ఉన్న తమ పాఠశాల ఇంత కొత్తగా మారిపోవడం చూసి ఆశ్చర్యపోయారు. ఇరుగూపొరుగూ అందరూ మారిపోయిన తమ స్కూలు గురించి మాట్లాడుకుంటుంటే చాలా గర్వంగా ఫీలవుతున్నామంటున్నారు ఈ బడి పిల్లలూ, ఉపాధ్యాయులూ.

- పులి అనిల్‌కుమార్‌, ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని