Updated : 20 Jun 2021 07:54 IST

Unacademy: నెట్‌ఫ్లిక్స్‌ను దాటాలన్నదే లక్ష్యం!

భారత్‌లో పోటీ పరీక్షల సంసిద్ధత తీరుని మార్చేస్తున్నాయి కొన్ని ఎడ్‌టెక్‌ కంపెనీలు. వాటిలో అన్‌అకాడమీ ఒకటి. విలువ పరంగా బైజూస్‌ తర్వాత రెండో స్థానంలో ఉన్నప్పటికీ, ఉపాధ్యాయులూ విద్యార్థుల సంఖ్యనుబట్టి దేశంలో అతిపెద్ద ఎడ్‌టెక్‌ కంపెనీ ఇదే! ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ని దేశంలో అతిపెద్ద టెక్‌ కంపెనీగా మార్చిన ఘనత గౌరవ్‌ ముంజల్‌, రోమన్‌ సైనీ, హిమేశ్‌ సింగ్‌... మిత్ర త్రయానిది. ఆ దిశగా వారి ప్రయాణమిది...

యూట్యూబ్‌లో ‘అన్‌అకాడమీ’ ఛానెల్‌ పెట్టిన సంవత్సరం... 2010. దీన్ని ప్రారంభించిన గౌరవ్‌ ముంజల్‌ అప్పటికి ముంబయిలోని నార్సీ మాంజీ ఇంజినీరింగ్‌ కాలేజీలో కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతున్నాడు. ఆ సమయంలో సరదాగా జావా కోడింగ్‌ను వివరించే వీడియోలు తీసి పెట్టేవాడు. ఇంజినీరింగ్‌ తర్వాత బెంగళూరు వచ్చి ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌ (ఎన్‌ఐటీ- అలహాబాద్‌) అయిన హిమేష్‌ సింగ్‌తో కలిసి ఫ్లాట్‌షేరింగ్‌కు సంబంధించిన స్టార్టప్‌ ఫ్లాట్‌చాట్‌ని ప్రారంభించాడు. దానికి మంచి ఆదరణ వచ్చింది. కేవలం ఆరు నెలల్లో 50వేల డౌన్‌లోడ్లు వచ్చాయి. బ్యాచిలర్లు రూమ్మేట్స్‌ని వెతుక్కోవడానికీ, ఓనర్లు ఇళ్లను అద్దెకు ఇవ్వడానికీ ఉపయోగపడే చాటింగ్‌ ఆప్‌ అది. దాన్లో కామన్‌ఫ్లోర్‌ అనే సంస్థ పెట్టుబడి పెట్టింది కూడా. అంకుర సంస్థకు పనిచేస్తూనే వీడియోలూ పెట్టేవాడు. గౌరవ్‌ సొంతూరు రాజస్థాన్‌లోని జైపుర్‌. రోమన్‌ సైనీ తన చిన్ననాటి స్నేహితుడు. 23 ఏళ్లకే ఐ.ఎ.ఎస్‌.కు ఎంపికయ్యాడు రోమన్‌. తను ఎయిమ్స్‌ నుంచి వైద్య విద్యని అభ్యసించాడు కూడా. మెడిసిన్‌, సివిల్స్‌... దేశంలో రెండు ప్రతిష్ఠాత్మకమైన పోటీ పరీక్షలు రాసి విజయవంతమైన అనుభవం రోమన్‌ది. అతడి అనుభవాల్నీ, కొన్ని పాఠ్యాంశాల్నీ వీడియోలుగా తీస్తే బావుంటందని రోమన్‌కు చెప్పాడు గౌరవ్‌. స్నేహితుడి ఆలోచన నచ్చి వీడియోల్ని చేస్తూ వాటిని అన్‌అకాడమీ ఛానెల్‌లో పెడుతూ వచ్చాడు రోమన్‌. ఓ ఐఏఎస్‌ అధికారి పాఠాలూ, అనుభవ పాఠాలూ చెప్పడంతో యూట్యూబ్‌లో అన్‌అకాడమీని చూసేవాళ్ల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. కొద్ది నెలల్లోనే సబ్‌స్క్రైబర్లు పదివేల నుంచి లక్షకుపైనే పెరిగారు.

ఐఏఎస్‌కు రాజీనామా...
2015లో హిమేశ్‌, రోమన్‌ల ముందు ఓ ప్రతిపాదన పెట్టాడు గౌరవ్‌. అదేంటంటే తాము చేస్తున్న పనుల్ని వదిలేసి పూర్తిగా అన్‌అకాడమీని అభివృద్ధిచేయడం. గౌరవ్‌, హిమేశ్‌ ఎలాగూ అంకుర సంస్థని నడుపు తున్నారు. కాబట్టి వారికీ మార్పు పెద్ద కష్టం కాదు. కానీ రోమన్‌ అప్పటికి జబలపుర్‌ అసిస్టెంట్‌ కలెక్టర్‌. అయితే, ఉద్దేశం మంచిదైతే ఎలాంటి పనికైనా సిద్ధమయ్యే వ్యక్తి రోమన్‌. వైద్య విద్యను అభ్యసిస్తున్నపుడు ఓసారి గ్రామాల పర్యటనకు వెళ్లాడు. అప్పుడే అక్కడ అతడికి విద్య, వైద్యం... ఇలా అన్నింటా వెనకబాటుతనం కనిపించింది. గ్రామాల్లో మార్పు తేవడానికి ఐఏఎస్‌ అవ్వాలనుకున్నాడు. వైద్య విద్యను అభ్యసిస్తూనే సివిల్స్‌కు సిద్ధమై 2013లో జాతీయస్థాయిలో 18వ ర్యాంకు సంపాదించాడు. అన్‌అకాడమీతో ఎంతో ముఖ్యమైన విద్యారంగంలో మార్పు తేవొచ్చని బలమైన నమ్మకం ఏర్పడింది రోమన్‌కి. ఎందుకంటే సివిల్స్‌ ప్రవేశ పరీక్షని తనతోపాటు ఆరున్నర లక్షల మంది రాయగా వారిలో కేవలం లక్ష మంది మాత్రమే శిక్షణ తీసుకుని ఉంటారు. వివిధ కారణాలవల్ల శిక్షణ తీసుకోలేకపోయారు తక్కినవాళ్లంతా. ఏటా అలా ఎందరో, ఎన్నో పరీక్షలకు హాజరవుతున్నా వారికి సరైన మార్గనిర్దేశం, శిక్షణ అందుబాటులో ఉండటంలేదు. అన్‌అకాడమీద్వారా అలాంటి వారిని చేరుకోవచ్చని నిశ్చయించుకున్నాడు. రోమన్‌ సరేననడంతో ఫ్లాట్‌చాట్‌ని కామన్‌ఫ్లోర్‌కు అమ్మేశారు గౌరవ్‌, హిమేశ్‌. అలా అన్‌అకాడమీ యూట్యూబ్‌ ఛానెల్‌ కాస్తా ఓ నమోదిత కంపెనీ అయింది. గౌరవ్‌ సీఈఓగా, హిమేశ్‌ సీటీఓగా, రోమన్‌ ప్రిన్సిపల్‌ కంటెంట్‌ క్రియేటర్‌గా బాధ్యతలు పంచుకుని 2015 చివర్లో అన్‌అకాడమీ వెబ్‌సైట్‌నీ, ఆప్‌నీ తెచ్చారు. కొద్ది నెలలకే మూడు కోట్ల రూపాయల పెట్టుబడిని సంపాదించారు. అప్పటి గూగుల్‌ ఇండియా హెడ్‌ రాజన్‌ ఆనంద్‌ తన బ్లూమ్‌ వెంచర్స్‌ ద్వారా, కామన్‌ఫ్లోర్‌ వ్యవస్థాపకుడు సుమిత్‌ జైన్‌, రెడ్‌బస్‌ వ్యవస్థాపకుడు ఫణీంద్ర సామ, ఫ్లిప్‌కార్ట్‌ యాజమాన్యం, పేటీఎమ్‌ విజయ్‌శేఖర్‌ శర్మ... మొదలైనవారు పెట్టుబడి పెట్టారు. అప్పటికే అన్‌అకాడమీ యూట్యూబ్‌ ఛానెల్‌లో రెండు లక్షల మంది సబ్‌స్క్రైబర్లని సంపాదించింది. ప్రారంభంలో సివిల్స్‌ కోచింగ్‌, స్పోకన్‌ ఇంగ్లిష్‌, కోడింగ్‌పైన దృష్టి పెట్టారు.

లైవ్‌ క్లాసులు ప్రత్యేకం...
ఆన్‌లైన్‌ అయినా, ఆఫ్‌లైన్‌ అయినా చదువులో ఉపాధ్యాయుడి ప్రాధాన్యత ఎక్కువనేది అన్‌అకాడమీ వ్యవస్థాపకుల విశ్వాసం. అందుకే ప్రత్యేకంగా టీచర్లకోసం మేకింగ్‌ ఆప్‌ తెచ్చి తమకు అనుబంధంగా ఉంటూ పాఠాలు చెప్పవచ్చన్నారు. ఆ ఆప్‌లో ఎక్కడివారైనా సులభంగా పాఠాలు చెప్పే వెసులుబాటు ఉండటంతో చాలామంది బోధకుల్ని ఆకట్టుకుంది. అప్పటికే యూట్యూబ్‌లో, వివిధ శిక్షణ సంస్థల్లో పాఠాలు చెప్పేవాళ్లు అన్‌అకాడమీలో చేరారు. ఇలా వేలమంది నాణ్యమైన ఉపాధ్యాయుల్ని తమ వేదికమీదకు తీసుకొచ్చి ఒకే దెబ్బకు ఎన్నో పిట్టల్ని కొట్టారు. బోధకుల్లో అనుభవజ్ఞులతోపాటు అప్పుడప్పుడే ఉద్యోగాలు సంపాదించినవాళ్లూ, ప్రఖ్యాత విద్యాసంస్థల్లో చదువుకుంటున్నవాళ్లూ ఉన్నారు. క్రమంగా రికార్డెడ్‌ పాఠాలకంటే లైవ్‌ పాఠాలకు ప్రాధాన్యం ఇస్తూ ఆన్‌లైన్లోనే క్లాస్‌రూమ్‌ వాతావరణాన్ని సృష్టించారు. యూట్యూబ్‌లో, ఆప్‌లో, వెబ్‌సైట్లో ప్రత్యక్ష పాఠాలు వినే సౌకర్యాన్ని ఇవ్వడంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఆసక్తి చూపారు. లైవ్‌లో వినలేని వారికి వాటి రికార్డెడ్‌ వీడియోలూ ఉండేవి. 2017లో ఐఐఎమ్‌ ప్రవేశ పరీక్ష అయిన క్యాట్‌ శిక్షణను మొదలుపెట్టాక అధిక సంఖ్యలో చందాదారుల్ని ఆకట్టుకుంది అన్‌అకాడమీ. ఎందుకంటే, అదే పరీక్ష మోడల్‌తో అనేక బి-స్కూల్స్‌ ప్రవేశ పరీక్షలూ, బ్యాంకింగ్‌ పరీక్షలూ ఉంటాయి. ఇలా ఒకే రకమైన కంటెంట్‌ని వేర్వేరు వర్గాలకు ఉపయోగించుకునే వీలుండటం పెట్టుబడిదారులకూ నచ్చింది. సిరీస్‌ ‘బి’ ఫండింగ్‌లో సికోయా, సైఫ్‌ పార్ట్‌నర్స్‌ ద్వారా రూ.60 కోట్ల పెట్టుబడి వచ్చింది. ఈ మొత్తాన్ని ఉపయోగించుకుని కోట, దిల్లీ, ముంబయిలాంటి నగరాలకు చెందిన ప్రఖ్యాత టీచర్లకు మంచి జీతాలిచ్చి నియమించుకుంది. ఈ సమయానికి యూట్యూబ్‌ ద్వారా వచ్చే ఆదాయం తప్ప అన్‌అకాడమీ వినియోగదారుల నుంచి నేరుగా రూపాయి కూడా వసూలు చేయకపోవడం గమనార్హం. దాదాపు అదే సమయానికి తమ యూట్యూబ్‌ ఛానెల్‌ సబ్‌స్క్రైబర్లు పదిలక్షలకు చేరారు. తర్వాత యూపీఎస్‌ఈ, జేఈఈ, నీట్‌... ఇలా భిన్నమైన ఛానెళ్లు ఏర్పాటుచేశారు. అన్‌అకాడమీ బ్రాండ్‌ బాగా జనాల్లోకి వెళ్లాక 2019 ప్రారంభంలో ‘అన్‌అకాడమీ ప్లస్‌’ పేరుతో పెయిడ్‌ సేవల్ని అందించడం మొదలుపెట్టారు. మరోవైపు యూట్యూబ్‌లో ఉచిత క్లాసుల్ని అలాగే కొనసాగిస్తూ వచ్చారు. డబ్బులు చెల్లించే విద్యార్థులు ఆప్‌లో తమ సందేహాల్ని నివృత్తి చేసుకోవచ్చు. అక్కడ నాలుగు క్లాసుల్లో ఒకటి సందేహాల కోసమే కేటాయిస్తారు. ప్రతివారం మాక్‌ టెస్టులు ఉంటాయి. సివిల్స్‌, బి-స్కూల్‌, బ్యాంకింగ్‌, జేఈఈ, నీట్‌ సహా మొత్తం 35 రకాల ప్రవేశ పరీక్షలకు అన్‌అకాడమీలో శిక్షణ లభిస్తోంది. ‘దేశంలోని పెద్ద నగరాల్లో పేరున్న లెక్చరర్ల క్లాసులు వినాలంటే ఇదివరకు ఆ నగరాలకు వెళ్లి లక్షల్లో ఫీజులు కట్టాలి. ఇప్పుడా పరిస్థితి లేదు. ఎక్కడివాళ్లు అక్కడ ఉంటూనే నగరాల్లో చెల్లించే ఫీజులో అయిదో వంతుకే ఆ లెక్చరర్ల క్లాసులు అన్‌అకాడమీద్వారా వినొచ్చు’ అని చెబుతారు గౌరవ్‌.

యూనికార్న్‌ అయ్యిందిలా...
పెయిడ్‌ సేవల్ని మొదలుపెట్టాక ఫేస్‌బుక్‌లాంటి సంస్థలూ పెట్టుబడి పెట్టాయి. కొవిడ్‌ నేపథ్యంలో చదువులు ఆన్‌లైన్‌ బాట పట్టడంతో అన్‌అకాడమీకి ఒక్కసారిగా ఆదరణ పెరిగింది. 2019 ఫిబ్రవరిలో కంపెనీ ఆదాయం నెలకు రెండు కోట్లు ఉంటే ఇప్పుడది రూ.100 కోట్లపైనే. ‘కోచింగ్‌ సెంటర్లలో కొన్ని పరిమితుల కారణంగా ఉత్తమ లెక్చరర్లు ఎప్పుడూ ఉత్తమ విద్యార్థులకే పాఠాలు చెబుతారు. ఇక్కడ అలా కాదు, అలాంటి లెక్చరర్ల లైవ్‌ క్లాసులని కొన్ని వేలమంది ఒకేసారి వింటున్నారు’ అని చెబుతారు రోమన్‌. 2019 ఫిబ్రవరిలో రూ.3500 వేల కోట్లున్న అన్‌అకాడమీ విలువ గతేడాది చివరకు రూ.14వేల కోట్లకు పెరిగింది. జనరల్‌ అట్లాంటిక్‌, సాఫ్ట్‌బ్యాంక్‌ లాంటి సంస్థలు పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టాయి. ‘ప్రారంభంలో పెట్టుబడిదారులు తిరస్కరించినా పెద్దగా పట్టించుకునేవాణ్ని కాదు. ఎన్నిసార్లు నో చెప్పినా మళ్లీమళ్లీ ప్రయత్నించేవాణ్ని. ఎవరినైనా కలిసేటపుడు తిరస్కారాలకూ సిద్ధపడాలని ముందే అనుకునేవాణ్ని’ అంటారు గౌరవ్‌. సికోయా క్యాపిటల్‌కు చెందిన సైలేంద్ర సింగ్‌, ఉడాన్‌ సుజీత్‌ కుమార్‌, డైరెక్టీ వ్యవస్థాపకుడు భవీన్‌... మొదలైనవాళ్లు గౌరవ్‌కు ప్రస్తుతం మెంటార్లుగా ఉన్నారు.

యూట్యూబ్‌లో 30 శాతం...
50 వేలమంది టీచర్లు ప్రస్తుతం అన్‌అకాడమీతో కలిసి పనిచేస్తున్నారు. దేశంలోని 5000 నగరాలూ, పట్టణాలకు చెందిన విద్యార్థులు పాఠాలు వింటున్నారు. 14 భాషాల్లో ఈ పాఠాలు అందుబాటులో ఉండగా, జాతీయస్థాయి పరీక్షలతోపాటు పశ్చిమ బెంగాల్‌, కేరళ లాంటి రాష్ట్రాల పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఉద్యోగాలకూ శిక్షణ ఇస్తున్నారు. నెలలో 1.5లక్షల లైవ్‌ క్లాసులు నిర్వహిస్తారు. ఇప్పటికీ తమ పాఠాల్లో 30 శాతం యూట్యూబ్‌ ఛానెళ్లలో ఉచితంగా అందిస్తున్నారు. అది ఎప్పటికీ కొనసాగుతుందంటారు. యూపీఎస్‌సీ ఛానెల్‌కి సుమారు 50లక్షల మంది సబ్‌స్క్రైబర్లూ, జేఈఈ ఛానెల్‌కు 17లక్షల సబ్‌స్క్రైబర్లూ, నీట్‌ ఛానెల్‌కు 11 లక్షల సబ్‌స్క్రైబర్లూ ఉండటం విశేషం. వీరు కాకుండా ఆప్‌లో 50 లక్షల రిజిస్టర్డ్‌ యూజర్లూ, అయిదు లక్షల పెయిడ్‌ యూజర్లూ ఉన్నారు. వీరిలో 70 శాతం ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి వచ్చేవాళ్లే. గత 12 నెలల్లో ఆదాయం, వినియోగదారుల సంఖ్య... ఇలా ప్రతి అంశం లోనూ కంపెనీ అభివృద్ధి పది రెట్లు ఉంది.

‘ఏటా దేశంలో 5-6 కోట్ల మంది వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంటారు. వారిని లక్ష్యంగా చేసుకుని ప్రస్తుతం మేం పనిచేస్తున్నాం. ఐటీ కంపెనీలూ మున్ముందు ప్రవేశ పరీక్షలద్వారా ఉద్యోగుల్ని నియమించుకోవాలని చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అది నిజమైతే మా మార్కెట్‌ మరింత పెరగనుంది. ఇండియా నుంచి అతి పెద్ద ఇంటర్నెట్‌ ఆధారిత సేవల కంపెనీ కచ్చితంగా ఎడ్‌టెక్‌ రంగం నుంచే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ విద్యకు ఇచ్చే ప్రాధాన్యం, ఖర్చు చేసే మొత్తం చాలా ఎక్కువ’ అని చెబుతాడు గౌరవ్‌. కేవలం చదువు మాత్రమే కాదు, నైపుణ్యాల శిక్షణవైపూ అన్‌అకాడమీని తీసుకువెళ్లే యోచనలో ఉన్నారు. చెస్‌, వంటలకు సంబంధించిన శిక్షణనీ అందిస్తున్నారు. ‘నెట్‌ఫ్లిక్స్‌ని కొట్టడమే మా లక్ష్యం. నెట్‌ఫ్లిక్స్‌ 200 బిలియన్‌ డాలర్ల కంపెనీ. ఇది రిలయన్స్‌కంటే పెద్దది. ఎడ్‌టెక్‌లో మార్కెట్‌ చాలా పెద్దది. ఇండియాతోపాటు విదేశాల్లోనూ ఉంది. కాబట్టి మా లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమే కానీ, అసాధ్యం కాదు’ అనేది ఈ ముగ్గురి మాట.

తొమ్మిది కంపెనీలు కొన్నారు...

కంపెనీని విస్తరించే క్రమంలో మూడేళ్లలో తొమ్మిది సంస్థల్ని చేజిక్కించుకున్నారు. వైఫైస్టడీ(ఎస్‌ఎస్‌సీ, బ్యాంకింగ్‌ శిక్షణ ఇచ్చే యూట్యూబ్‌ ఛానెల్‌), క్రీట్‌రిక్స్‌(గేట్‌, ఈఎస్‌ఈ శిక్షణ) కోడ్‌షెఫ్‌(కోడింగ్‌ శిక్షణ సంస్థ) ప్రిప్‌లేడర్‌(మెడికల్‌ పీజీ ప్రవేశ పరీక్షల శిక్షణ) మాస్ట్రీ(స్కూల్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు), కోర్సావే(సివిల్స్‌ శిక్షణ), నియోస్టెన్సిల్‌(ప్రభుత్వ పరీక్షలకు శిక్షణ ఇచ్చే సంస్థ) టేప్‌ చీఫ్‌(ప్రొఫెషనల్స్‌ పార్ట్‌టైమ్‌ జాబ్స్‌), హండా కా ఫండా (క్యాట్‌ శిక్షణ) లాంటి సంస్థలను కొనుగోలుచేశారు.


Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని