మిసెస్‌ మహదేవన్‌.. ఆమే ఆయన విజయ రహస్యం!

అర్ధాంగి అంటే భర్తలో సగం. భర్త చేసే ప్రతి పనిలోనూ సగ భాగం పంచుకుంటూ.. ఆయన వెన్నంటి నిలిచే ఓ ప్రోత్సాహం. ప్రతికూల పరిస్థితుల్లోనూ భర్తకు ధైర్యం నూరిపోసే ఓ శక్తి. ఇందుకు తన భార్యనే ప్రత్యక్ష ఉదాహరణగా చూపిస్తున్నారు ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు శంకర్‌ మహదేవన్‌.

Published : 06 Feb 2024 13:01 IST

(Photos: Instagram)

అర్ధాంగి అంటే భర్తలో సగం. భర్త చేసే ప్రతి పనిలోనూ సగ భాగం పంచుకుంటూ.. ఆయన వెన్నంటి నిలిచే ఓ ప్రోత్సాహం. ప్రతికూల పరిస్థితుల్లోనూ భర్తకు ధైర్యం నూరిపోసే ఓ శక్తి. ఇందుకు తన భార్యనే ప్రత్యక్ష ఉదాహరణగా చూపిస్తున్నారు ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు శంకర్‌ మహదేవన్‌. తన సుదీర్ఘ సంగీత ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లు అందుకున్న ఆయన.. తాజాగా గ్రామీ అవార్డునూ తన కీర్తి కిరీటంలో చేర్చుకున్నారు. ‘ఇప్పటికే నా సంగీతంలోని సప్త స్వరాల్నీ నా భార్యకు అంకితం చేశాను.. ఇప్పుడీ పురస్కారం కూడా!’ అంటూ గ్రామీ వేదిక పైనే తన అర్ధాంగిని ఆకాశానికెత్తేశాడీ మ్యూజిక్‌ లెజెండ్‌. ఇప్పుడే కాదు.. తమ 30 ఏళ్ల వైవాహిక బంధంలో అటు వ్యక్తిగతంగా, ఇటు కెరీర్‌ పరంగా ప్రతి అడుగులోనూ తన భర్తకు తోడూనీడై నిలిచారు సంగీత. ఈ క్రమంలో తన కెరీర్‌నూ వదులుకున్నారు. ప్రస్తుతం తన భర్త విజయాన్ని చూసి మురిసిపోతోన్న ఆమె.. ఆయనతో తనకున్న అనురాగాన్ని, అనుబంధాన్ని పలు సందర్భాల్లో ఇలా నెమరువేసుకున్నారు.

శంకర్‌ మహదేవన్‌, సంగీతల పెళ్లై 31 ఏళ్లు దాటింది. అయినా ఇన్నేళ్ల తమ వైవాహిక జీవితంలో ఒకరికొకరు ప్రోత్సహించుకోవడమే తప్ప.. పొరచ్ఛాలకు తావివ్వలేదు. వ్యక్తిగత పరీక్షలే కాదు.. కెరీర్‌ సవాళ్లనూ కలిసే ఎదుర్కొన్నారు. ఈ ఓపిక, సహనం, అన్యోన్యత, త్యాగాలే తమ అనుబంధానికి మూలస్తంభాలంటారు సంగీత. ‘ఆమె ప్రోత్సాహమే నన్ను అడుగడుగునా నడిపించిందం’టారు శంకర్.

బ్యాడ్మింటన్‌ కలిపింది!

ప్రేమలో ఉన్నప్పుడు, పెళ్లయ్యాకా అనుక్షణం తన భర్త వెన్నంటే ఉంటూ ఆయన ఎదుగుదలలో కీలక పాత్ర పోషించారు సంగీత. ఆయన కెరీర్‌ కోసం తన కెరీర్‌ను వదులుకున్నారామె. అయితే తామిద్దరిలో ఉన్న కొన్ని ఉమ్మడి అలవాట్లు, అభిరుచులే తమను ఒక్కటయ్యేలా చేసిందంటున్నారామె.

‘అప్పుడు నాకు 14 ఏళ్లుంటాయనుకుంటా.. నేను, శంకర్‌ మహారాష్ట్రలోని చెంబూరులో ఎదురెదురు ఇళ్లలో ఉండేవాళ్లం. నాకంటే శంకర్‌ రెండున్నరేళ్లు పెద్ద. సాయంత్రం అయ్యిందంటే చాలు.. ఆ కాలనీలోని పిల్లలందరం బ్యాడ్మింటన్‌ గ్రౌండ్‌కు చేరుకునే వాళ్లం. అక్కడే నేను, శంకర్‌ తొలిసారి కలుసుకున్నాం. పొరుగిళ్లే అయినా ఆయన కుటుంబ నేపథ్యం గురించి కానీ, ఆయనకు సంగీతంపై ఉన్న ఆసక్తి గురించి కానీ నాకు తెలియదు. అయితే ఓ రోజు కిశోర్‌ కుమార్‌ పాట ఒకటి హమ్‌ చేస్తుంటే విన్నా. తన గొంతులో ఏదో తెలియని మాధుర్యం దాగుందని అప్పుడు నాకు అర్థమైంది. ‘నీ గొంతు అద్భుతంగా ఉంది.. ఏదో ఒక రోజు గొప్ప గాయకుడివి అవుతావు..’ అన్నా. బ్యాడ్మింటన్‌ ఆడే క్రమంలో బ్రేక్‌ దొరికితే చాలు.. ఇలా ఇద్దరం కలిసి బోలెడన్ని విషయాలు మాట్లాడుకునే వాళ్లం. ఇదే మా మధ్య క్రమంగా స్నేహాన్ని, ఆపై ప్రేమను పెంచింది..’ అంటున్నారు సంగీత.

సీక్రెట్‌గా కలుసుకునేవాళ్లం!

అయితే వయసుతో పాటే ప్రేమను పెంచుకుంటూ పోయిందీ జంట. ఓరోజు సంగీత అన్నయ్యకు వీళ్ల ప్రేమ విషయం తెలిసిపోయింది. నిజానికి వీళ్లిద్దరి కుటుంబ నేపథ్యాలు వేరు.. ప్రాంతాలు వేరు. శంకర్‌ది కేరళలోని పాలక్కడ్‌ అయితే.. సంగీత మహారాష్ట్రకు చెందిన అమ్మాయి. ఇలా తామిద్దరివీ సంప్రదాయాలకు విలువిచ్చే కుటుంబాలు కావడంతో పెళ్లికి ముందే ఒకరినొకరు కలుసుకోకుండా ఇంట్లో పలు ఆంక్షలు పెట్టారంటున్నారు సంగీత.

‘మా ప్రేమను మా ఇరు కుటుంబాలూ వ్యతిరేకించలేదు. అయితే పెళ్లికి ముందే కలుసుకోవడానికి మాత్రం అంగీకరించలేదు.. అయినా సీక్రెట్‌గా కలుసుకునేవాళ్లం. ఇంజినీరింగ్‌ పూర్తి కాగానే శంకర్‌కి మంచి ఉద్యోగం వచ్చింది. సంగీతంపై తనకున్న ఆసక్తితో అప్పటికే కర్ణాటక సంగీతం నేర్చుకుంటోన్న ఆయన.. మా పెళ్లికి కొన్ని నెలల ముందు ఉద్యోగం మానేసి పూర్తి దృష్టి సంగీతం పైనే పెట్టారు. ఇక ఇరువైపులా పెద్దల అంగీకారంతో 1992లో మా పెళ్లైంది. ఏడాదికే మా పెద్దబ్బాయి పుట్టాడు. వివాహం తర్వాత శంకర్‌ సంగీత రంగంలోనే కెరీర్‌ని కొనసాగిస్తానన్నప్పుడు మా ఇరు కుటుంబాలు అందుకు మద్దతుగా నిలిచాయి.. నేనూ పెళ్లై గర్భం ధరించాక నా ఉద్యోగానికి రాజీనామా చేసి నా భర్తకు వెన్నుదన్నుగా నిలిచా..’ అంటున్నారు మిసెస్‌ మహదేవన్.

ఆయన్ని బాగా మిస్సయ్యేదాన్ని!

నిజానికి పెళ్లైన కొత్తలో భార్యాభర్తలిద్దరూ ఎక్కువ సమయం గడపాలనుకోవడం సహజమే! అయితే తన భర్త కెరీర్‌ రీత్యా తమకు అంత సమయం కూడా దొరకలేదంటున్నారు సంగీత.
‘మా అత్తగారు చాలా మృదు స్వభావి. ‘ఇది నీ జీవితం.. నీకు నచ్చినట్లు ఉండచ్చు..’ అనే స్వేచ్ఛనిచ్చారు. దాంతో ఇంట్లో ఒత్తిడేమీ ఉండకపోయేది. కానీ పెళ్లైన కొత్తలో శంకర్‌ కెరీర్‌ దృష్ట్యా గంటల తరబడి స్టూడియోలోనే గడిపేవారు. ఆ సమయంలో ఆయన్ని మిస్సవుతున్నానన్న భావన కలిగేది. అయినా వీలు కుదుర్చుకొని నాకూ తగిన సమయం కేటాయించేవారు. మాకో ఫార్మ్‌హౌస్‌ ఉండేది. కొన్నిసార్లు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఇద్దరమే అక్కడ గడిపేవాళ్లం. ఆ మధుర క్షణాలు ఎప్పటికీ నాకు జ్ఞాపకమే! శంకర్‌లో సంగీత నైపుణ్యాలే కాదు.. పాకశాస్త్ర నైపుణ్యాలూ దాగున్నాయి. తనెంత బాగా వండుతారంటే.. ఒకవేళ సంగీత రంగంలోకి రాకపోయుంటే మంచి చెఫ్‌ అయ్యేవారేమో! దక్షిణ భారతదేశపు రుచులతో పాటు థాయ్‌ వంటకాలు, సూప్స్‌, సలాడ్స్‌.. బాగా చేయగలరాయన. ఖాళీ సమయాల్లో మాకు తన స్వహస్తాలతో వండి పెట్టడానికి తెగ ఇష్టపడుతుంటారు..’ అంటూ తన బెటర్‌హాఫ్‌లో దాగున్న అభిరుచుల్ని బయటపెట్టారామె.


అర్ధాంగి.. సంగీత సహచరి!

ఇలా తమ వైవాహిక జీవితంలోని ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తూ.. అనుబంధాన్ని నిత్యనూతనం చేసుకుంటూ ముందుకు సాగుతోన్న శంకర్‌-సంగీతల ప్రేమకు గుర్తుగా ఇద్దరబ్బాయిలు పుట్టారు. పెద్దబ్బాయి సిద్ధార్థ్‌ ఇప్పటికే సంగీత రంగంలోకి అడుగుపెట్టగా.. చిన్నబ్బాయి శివమ్‌ శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటున్నాడు. ఓ అర్ధాంగిగా తన కెరీర్‌ కంటే.. ఇంటి బాధ్యతలు, తమ బాగోగులకే తన ఇష్టసఖి ప్రాధాన్యమిచ్చిందంటూ, అనుక్షణం తన వెన్నంటే నిలిచిందంటూ పలు సందర్భాల్లో సంగీత గురించి చెప్పుకొచ్చారు శంకర్‌. ఇక తాజాగా గ్రామీ పురస్కారం గెలవడంలోనూ ఆమె పాత్ర కీలకం అంటూ ఆ వేదిక పైనే తన ముద్దుల భార్యను ఆకాశానికెత్తేశారీ లెజెండరీ సింగర్.

‘ప్రతి మగాడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుందంటారు. అలా నా ప్రతి విజయం వెనుక నా భార్యదే కీలక పాత్ర. అందుకే నా సంగీతంలోని సప్త స్వరాల్నీ ఆమెకు అంకితం చేశాను. ఇప్పుడీ గ్రామీ అవార్డునూ ఆమెకే అంకితమిస్తున్నా.. తను నా జీవిత భాగస్వామే కాదు.. సంగీత సహచరి కూడా!’ అంటూ మరోసారి తన భార్యపై తనకున్న ప్రేమను చాటుకున్నారీ సంగీత రారాజు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్