అందాన్ని పెంచే ‘గువా షా’!

గువా షా.. ఇది పుట్టింది చైనాలోనే అయినా.. ప్రపంచమంతా పాపులర్‌గా మారిందని చెప్పచ్చు. జేడ్‌ స్టోన్‌గా పిలిచే ఈ రాయితో ముఖానికి మర్దన చేసుకుంటే మొటిమలు, మచ్చలు వంటివి దూరమవుతాయి.

Published : 04 Jan 2024 12:52 IST

గువా షా.. ఇది పుట్టింది చైనాలోనే అయినా.. ప్రపంచమంతా పాపులర్‌గా మారిందని చెప్పచ్చు. జేడ్‌ స్టోన్‌గా పిలిచే ఈ రాయితో ముఖానికి మర్దన చేసుకుంటే మొటిమలు, మచ్చలు వంటివి దూరమవుతాయి. చర్మంపై ఏర్పడిన ఎర్రటి దద్దుర్లను కూడా ఈ టూల్‌తో తగ్గించుకోవచ్చు. ఇవే కాదు.. ఈ బ్యూటీ టూల్‌తో ఇంకా చాలా ప్రయోజనాలే ఉన్నాయంటున్నారు నిపుణులు.

ముఖ కాంతికి..!

Concave, Double Curved, Cleft, Teeth Edge.. ఇలా వివిధ ఆకృతుల్లో ఉండే ఈ టూల్స్‌తో ముఖంపై మర్దన చేసుకోవడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. తద్వారా ముఖ భాగాల్లో వాపు, కళ్ల కింద నల్లటి వలయాలు.. వంటివి తగ్గి ముఖమంతా ఒకే రంగులోకి వస్తుంది. కాంతివంతంగా కనిపిస్తుంది. అలాగే దీన్ని తరచూ వాడడం వల్ల సాగిన చర్మం తిరిగి బిగుతుగా మారుతుంది. అందుకే దీన్ని న్యాచురల్‌ ఫేస్‌లిఫ్ట్‌ టూల్‌గా పరిగణిస్తుంటారు సౌందర్య నిపుణులు.

మొటిమలు, మచ్చలకు మందు!

ముఖంపై ఏర్పడే మొటిమలు, మచ్చల్ని తగ్గించడానికి గువా షా స్టోన్‌ ఉపయోగపడుతుందని చెబుతున్నారు నిపుణులు. దీంతో ముఖంపై మర్దన చేసుకోవడం వల్ల ముఖ భాగాలకు రక్తప్రసరణ మెరుగుపడడంతో పాటు చర్మ రంధ్రాల్లో ఉన్న దుమ్ము-ధూళి.. వంటివి తొలగిపోతాయి.. తద్వారా మొటిమలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. ఇక ఈ టూల్‌తో మర్దన చేసుకోవడం వల్ల డ్యామేజ్‌ అయిన చర్మ కణాలు తొలగిపోయి.. కొత్త కణాలు పుట్టుకొస్తాయి. ఫలితంగా మచ్చలూ మటుమాయమవుతాయి.

వయసును దాచేస్తుంది!

ముఖంపై ఏర్పడే ముడతలు, గీతలు మనల్ని వయసు పైబడిన వారిలా కనిపించేలా చేస్తాయి. ఈ సమస్యను దూరం చేసుకోవడానికీ గువా షా టూల్‌ చక్కగా పని చేస్తుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఈ రాయితో మర్దన చేసుకోవడం వల్ల ముఖ కండరాలు దృఢమవుతాయి. కొత్త చర్మ కణాలు పుట్టుకు రావడానికి ఈ మసాజ్‌ ప్రక్రియ చక్కగా ఉపయోగపడుతుంది. తద్వారా ముఖంపై గీతలు, ముడతలు క్రమంగా తగ్గుముఖం పట్టి నవయవ్వనంగా కనిపించేలా చేస్తుందీ టూల్‌.

అక్కడ వాపు తగ్గుతుంది!

కొంతమందికి నుదురు భాగం సన్నగా ఉండి.. బుగ్గలు, గడ్డం.. వంటివి ఉబ్బినట్లుగా కనిపిస్తాయి. దీనివల్ల కూడా ముఖ సౌందర్యం దెబ్బతింటుంది. ఇలాంటప్పుడు బుగ్గలు, గడ్డం దగ్గర ఈ జేడ్‌ స్టోన్‌తో కింది నుంచి పైవైపుగా మసాజ్‌ చేసుకోవడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. ఇలా తరచూ చేయడం వల్ల కొన్ని రోజులకు ఆయా భాగాల చర్మం కింద పేరుకున్న కొవ్వులు కరిగిపోతాయి.. తద్వారా వాపు కూడా తగ్గుముఖం పడుతుంది.

వక్షోజాల్లో వాపా?!

బాలింతలు ఒక్క పూట బిడ్డకు పాలివ్వకపోయినా పాలగడ్డలు ఏర్పడి వక్షోజాల్లో వాపు, భరించలేని నొప్పి రావడం సహజమే! అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి కూడా గువా షా ఉపయోగపడుతుందని ఓ అధ్యయనంలో తేలింది. ఈ క్రమంలో ఈ టూల్‌తో రొమ్ములపై మర్దన చేసుకోవడం వల్ల పాల గడ్డలు ఏర్పడకుండా జాగ్రత్తపడచ్చట! ఆపై బిడ్డకు పాలిచ్చేటప్పుడు కూడా ఎలాంటి అసౌకర్యం కలగదంటున్నారు నిపుణులు.

వాడడమూ సులభమే!

ఎన్నో సౌందర్య ప్రయోజనాల్ని అందించే ఈ టూల్‌ను వాడడమూ ఎంతో సులువు అంటున్నారు నిపుణులు.

ముందుగా గువా షా టూల్‌ని సబ్బు నీటితో శుభ్రం చేసి కాసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి.

ఇప్పుడు ముఖాన్ని శుభ్రం చేసుకొని సీరమ్‌/ఫేస్‌ ఆయిల్‌/మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. దీనివల్ల మర్దన చేసుకోవడం సులభమవుతుంది.. చర్మంపై టూల్‌ వల్ల రాపిడి జరగకుండానూ జాగ్రత్తపడచ్చు.

టూల్‌పై ఫ్లాట్‌గా ఉండే భాగాన్ని ముఖ చర్మంపై, కర్వీగా ఉండే భాగాన్ని గడ్డం, ముక్కు.. వంటి వంపులు తిరిగిన భాగాల వద్ద ఉపయోగించాలి.

దీంతో మెడ, గడ్డం, బుగ్గల నుంచి పైవైపుగా, బయటి నుంచి లోపలి వైపుగా నెమ్మదిగా మర్దన చేయాల్సి ఉంటుంది. ఇలా వాడినప్పుడల్లా ఐదు నిమిషాల పాటు మసాజ్‌ చేయాలి. రోజూ ఇలా చేయడం వల్ల కొన్ని రోజుల్లోనే ఫలితం కనిపిస్తుందంటున్నారు నిపుణులు.

అయితే దీన్ని వాడే క్రమంలో మీకేమైనా సందేహాలున్నా, అసౌకర్యంగా అనిపించినా, ఎలా వాడాలో తెలియకపోయినా.. ఓసారి సౌందర్య నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్