నైవేద్యాలలో పోషకాలు!

నవరాత్రుల్లో తొమ్మిది రోజులపాటు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు చేయడం ఆనవాయితీ.. కేవలం పూజే కాదు.. ప్రసాదంగా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను ఏరోజుకారోజు చేసి ప్రత్యేకంగా సమర్పించడం కూడా సహజమే.

Published : 18 Oct 2023 12:32 IST

నవరాత్రుల్లో తొమ్మిది రోజులపాటు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు చేయడం ఆనవాయితీ.. కేవలం పూజే కాదు.. ప్రసాదంగా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను ఏరోజుకారోజు చేసి ప్రత్యేకంగా సమర్పించడం కూడా సహజమే.. విభిన్న అవతారాల్లో దర్శనమిచ్చే ఆ శక్తిస్వరూపిణికి ఇష్టమైన వంటకాలేంటో అందరికీ తెలుసు.. అయితే ఆ ప్రసాదాల్లో తక్షణ శక్తినిచ్చే, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గుణాలు కూడా ఉండడం విశేషం. మరి అవేంటో తెలుసుకుందాం రండి..

పొంగలి

అమ్మవారికి ఇష్టమైన వంటకాల్లో పొంగలి నైవేద్యం కూడా ఒకటి. ఎలాంటి వయసు వారికైనా ఇట్టే అరిగే ఆహారం ఇది. అంతేకాదు.. దీనిని చేయడం కూడా సులభం.

బియ్యంలో మన శరీరానికి శక్తిని అందించే కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే పెసర పప్పులో ప్రొటీన్లు ఎక్కువగా ఉండడం వల్ల ఇవి బియ్యంతో కలిసి బ్యాలన్స్‌డ్ మీల్స్‌గా ఉపయోగపడతాయి. దీన్ని తినడం వల్ల అజీర్తి, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు తగ్గుతాయి.

పొంగలిలో వేసే మిరియాలు జీర్ణ ప్రక్రియలో కీలకపాత్ర పోషిస్తాయి. మనం తీసుకున్న ఆహారంలో ఉండే పోషకాల్ని శరీరానికి అందించడంలో ఇవి ముఖ్యపాత్ర వహిస్తాయి.

దగ్గు, జలుబు, గొంతు నొప్పి లాంటి సమస్యలకి మిరియాల్లోని ఖనిజాలు చక్కటి పరిష్కారాన్ని చూపిస్తాయి.

రక్తహీనత, కండరాల నొప్పులు, మలబద్ధకం లాంటి వాటిని తగ్గించడానికి ఈ వంటకం ఉపయోగపడుతుంది.


దధ్యోజనం

అమ్మవారికి ఇష్టమైన వాటిలో దధ్యోజనం కూడా ఒకటి.. నవరాత్రుల్లో దీన్ని తప్పకుండా అమ్మవారికి నివేదిస్తుంటారు. ఇందులో మన ఆరోగ్యానికి ఉపయోగపడే చాలా పోషకాలున్నాయి..

కడుపులో మంట, అజీర్తికి దధ్యోజనం మంచి మందులా పని చేస్తుంది. పెరుగులోని పోషకాలు మంటని చల్లబరుస్తాయి.

బయట ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు లేక శరీర ఉష్ణోగ్రత అధికంగా ఉన్నప్పుడు దధ్యోజనం ప్రయత్నించండి. ఇది లోపల వేడిని తగ్గించి, శరీరాన్ని చల్లగా చేస్తుంది. అలసట లేకుండా హాయిగా అనిపిస్తుంది.

పెరుగులో ప్రొబయోటిక్స్, యాంటీఆక్సిడెంట్స్, మంచి కొవ్వులు ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

దధ్యోజనం తక్కువగా తిన్నా సరే కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. అందుకే లావు తగ్గాలనుకునేవారు దీన్ని ప్రయత్నించవచ్చు.

అంతేకాదు.. ఇది త్వరగా జీర్ణమవడం, ఇందులో మంచి పోషకాలుండడంతో వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది.


పులగం

పులగం తయారీలో ఉపయోగించే పెసరపప్పు, పచ్చి మిర్చి, ఎండు మిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, బెల్లం, పుదీనా, మిరియాలు, నెయ్యి లాంటివి జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు సహకరిస్తాయి.

పెసరపప్పులోని కాపర్ చర్మం ముడతలు పడకుండా మృదువుగా ఉండేలా చేస్తుంది. వయసుతోపాటు వచ్చే మచ్చలను దూరం చేస్తుంది. మన చర్మానికి కావాల్సిన నిగారింపునివ్వడంలో పెసరది ప్రత్యేక స్థానం.

ఈ వంటకంలో కాపర్, ఐరన్‌లు ఎక్కువగా లభిస్తాయి. ఇవి శరీరానికి కావాల్సిన పోషకాల్ని అందిస్తాయి. వీటివల్ల మన రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది.

పెసరలో ఉండే క్యాల్షియం ఎముకల పటుత్వానికి ఉపయోగపడుతుంది.

ఉబ్బరంలాంటి సమస్యలు పులగం వల్ల తగ్గుతాయి. ఇది తేలికపాటి ఆహారం కావడం వల్ల శరీరం దీన్ని సులభంగా అరిగించుకోగలుగుతుంది.


పాయసం

పాయసంలో వాడే సగ్గుబియ్యం, సేమియా, కిస్‌మిస్‌లూ శరీరానికి కావాల్సిన అదనపు శక్తినిస్తాయి. ద్రాక్ష, జీడిపప్పు, బాదం లాంటి ఎండు ఫలాలు రక్తహీనతని తగ్గిస్తాయి. శరీరానికి ప్రొటీన్లు కూడా అందిస్తాయి.

ఇందులోని పీచు జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.

రక్తంలోని అదనపు కొవ్వుల్ని నియంత్రించడంలో ఎండు ఫలాలు బాగా ఉపయోగపడతాయి.


బెల్లం పొంగలి

బెల్లం పొంగలంటే ఇష్టపడనివారు ఎవరూ ఉండరేమో.. అమ్మవారికి ప్రీతిపాత్రమైన వంటకమైన పొంగలి కేవలం రుచిలోనే కాదు పోషకాల్లోనూ గొప్పగానే ఉంటుంది.

బియ్యంలో కార్బోహైడ్రేట్లు మన శరీరానికి కావాల్సిన బలాన్నిస్తాయి.

బెల్లంలోని పోషకాలు జీర్ణవ్యవస్థకి కావాల్సిన ఎంజైముల్ని విడుదల చేసి, ఆహారాన్ని త్వరగా అరిగించడంలో సహాయపడతాయి. అవి అధిక బరువుని తగ్గించడంలోనూ సహకరిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్