Updated : 10/06/2021 18:59 IST

వండేటప్పుడు, తినేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?

ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉండాలంటే పోషకాహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో.. ఆ పదార్థాల పరిశుభ్రత కూడా అంతే ముఖ్యమంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో). ఇక ప్రస్తుత కరోనా పరిస్థితులు మనందరికీ ఈ విషయాన్ని మరోసారి తెలియజేశాయంటోంది. అయితే ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేసి ఏటా పదిలో ఒకరు కలుషితమైన ఆహారం తీసుకుంటూ జబ్బు పడుతున్నారని చెబుతోంది. ఇలా మొత్తంగా ఒక సంవత్సర కాలంలో నాలుగు లక్షలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయని, అందులోనూ 1.25 లక్షల మంది ఐదేళ్ల లోపు చిన్నారులే అని ఆందోళన వ్యక్తం చేస్తోంది. అందుకే రేపటి ఆరోగ్యానికి నేడు తీసుకునే పరిశుభ్రమైన ఆహారమే కీలకమని నొక్కి వక్కాణిస్తోంది. ఈ క్రమంలో ఆహారం కలుషితం కాకుండా ఉండడానికి వంటగదిలో పాటించాల్సిన చిట్కాల గురించి సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) కొన్ని చిట్కాలను సూచిస్తోంది. మరి, అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..
‘Safe food today for a healthy tomorrow’ అనే థీమ్‌తో ఈ ఏడాది అంతర్జాతీయ ఆహార భద్రత దినోత్సవం జరుపుకొంటున్నాం. అంటే.. రేపు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ రోజు తీసుకునే ఆహారం పూర్తి పరిశుభ్రంగా ఉండాలని తెలియజెప్పడమే ఈ ఏటి ముఖ్యోద్దేశం. ఇక కలుషితమైన ఆహారంలో మనకు కనిపించని క్రిములు, బ్యాక్టీరియా, వైరస్‌లు, విషతుల్యాలు ఎన్నో ఉంటాయి. కిచెన్‌లో ఆహారం వండుకునే క్రమంలోనూ ఇవి ఆయా పదార్థాల్లోకి చేరి మనకు పలు అనారోగ్యాల్ని తెచ్చిపెడతాయి. అందుకే ఈ సమస్య తలెత్తకూడదంటే వంటగదిలో సరైన నాణ్యతా ప్రమాణాలను పాటించడం ఎంతో అవసరమని చెబుతోంది సీడీసీ సంస్థ. ఈ క్రమంలో శుచి-శుభ్రత, పదార్థాల్ని వేరు చేయడం, వండడం, ఫ్రిజ్‌లో నిల్వ చేయడం.. వంటి విషయాల్లో కొన్ని చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.

శుచి-శుభ్రత ముఖ్యం!
* మన చుట్టూ ఉండే ఉపరితలాలపై ఎన్నో సూక్ష్మ క్రిములుంటాయి.. ఫుడ్‌ పాయిజనింగ్‌కి ఇవే ప్రధాన కారణం. కాబట్టి కాస్త కష్టమైన పనైనా.. కిచెన్‌ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం.
* వంట చేసే ముందు-తర్వాత-మధ్యమధ్యలో, తినే ముందు.. చేతుల్ని సబ్బు నీటితో 20 సెకన్ల పాటు రుద్ది మరీ కడుక్కోవాలి.
* వంటకు ముందు, తర్వాత.. పాత్రలు, కటింగ్‌ బోర్డులు, కిచెన్‌ ఉపరితలాలను (కౌంటర్ టాప్స్‌).. సబ్బు నీరు, వేడి నీటితో శుభ్రం చేయాలి.
* పండ్లు, కాయగూరల్ని కుళాయి నుంచి నేరుగా వచ్చే నీటి కింద ఉంచి శుభ్రం చేయాలి.

వీటిని కలపద్దు!

* పచ్చి మాంసం, కోడిగుడ్లు, చికెన్‌, చేపలు.. వంటి వాటి వల్ల క్రిములు త్వరగా వ్యాపించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా వండకుండా నేరుగా తినే పండ్లు, ఇతర పదార్థాల పైకి ఇవి చేరితే మరింత ప్రమాదకరం.. కాబట్టి వీటిని దేనికదే విడివిడిగా, ఇతర పదార్థాలతో కలపకుండా జాగ్రత్తపడాలి. ఫ్రిజ్‌లోనూ వీటిని వేటికవే సెపరేట్‌గా నిల్వ చేయాలి.
* మాంసం, ఇతర నిత్యావసరాల్ని కొని తీసుకొచ్చేటప్పుడు కూడా ఒకదానికొకటి అంటకుండా వేర్వేరు బ్యాగుల్లో ప్యాక్‌ చేయించుకోవడం మంచిది. తద్వారా మాంసంలోని పచ్చిదనం ఇతర పదార్థాలకు అంటకుండా జాగ్రత్తపడచ్చు.
* మాంసం, ఇతర కాయగూరల్ని కట్‌ చేయడానికి వేర్వేరు కటింగ్‌ బోర్డులు, కత్తులు, ప్లేట్స్‌; వండడానికి వేర్వేరు పాత్రల్ని ఉపయోగించడం అన్ని విధాలా ఆరోగ్యకరం!

అధిక ఉష్ణోగ్రతల్లో..!

ఆహారాన్ని అధిక ఉష్ణోగ్రతల్లో ఉడికించినప్పుడే అందులో ఉండే క్రిములు నశించిపోతాయి. అయితే ఆ విషయాన్ని ఫుడ్ థర్మామీటర్‌తో తెలుసుకోవచ్చు. ఈ క్రమంలో ఉడికించాక వాటి అంతర్గత ఉష్ణోగ్రతలు ఎంత ఉండాలో చూద్దాం..!
* మటన్‌ (మేక మాంసం) - 160 డిగ్రీల ఫారన్‌హీట్‌ (71.1 డిగ్రీల సెల్సియస్)
* చికెన్‌ - 165 డిగ్రీల ఫారన్‌హీట్‌ (73.8 డిగ్రీల సెల్సియస్)
* కోడిగుడ్లు - తెల్లసొన, పచ్చసొన గట్టిగా అయ్యేంత వరకు ఉడికించాలి. ఈ క్రమంలో వాటిని కాస్త వత్తినప్పటికీ విడిపోకూడదు.
* కోడిగుడ్లతో చేసిన కూరలు/ఇతర వంటకాలు - 160 డిగ్రీల ఫారన్‌హీట్‌ (71.1 డిగ్రీల సెల్సియస్)
* చేపలు, ఇతర సీఫుడ్‌ - 145 డిగ్రీల ఫారన్‌హీట్‌ (62.7 డిగ్రీల సెల్సియస్)
ఇలా ఆయా పదార్థాల్ని ఉడికించినప్పుడు వాటి అంతర్గత ఉష్ణోగ్రతలు ఈ విధంగా నమోదైతే అవి పూర్తి సురక్షితమైనవని అర్థం.

ఏది ఎప్పుడు ఫ్రిజ్‌లో పెట్టాలి?

ఫ్రిజ్‌లో పెడితే పదార్థాలు పాడైపోవు అనుకుంటారు చాలామంది. కానీ వాటికీ ఎక్స్‌పైరీ డేట్‌ ఉంటుంది. అంతేకాదు.. అవి చూడ్డానికి, రుచికి బాగానే ఉంటాయి.. కానీ మన ఆరోగ్యాన్ని పాడు చేసే బ్యాక్టీరియా వాటిలో అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఏ పదార్థం ఎప్పుడు ఫ్రిజ్‌లో పెట్టాలి? ఎన్ని రోజులు ఉంచాలి? తెలుసుకుందాం.
* ఏ కాలంలోనైనా ఫ్రిజ్‌లో ఉష్ణోగ్రత 40 డిగ్రీల ఫారన్‌హీట్‌ (4.4 డిగ్రీల సెల్సియస్‌)కు మించకుండా చూసుకోవాలి.
* పాలు, పాల పదార్థాలు, మాంసం, కోడిగుడ్లు, చేపలు.. వంటి త్వరగా పాడైపోయే పదార్థాలు బయటి నుంచి తెచ్చిన రెండు గంటల్లోపే ఫ్రిజ్‌లో పెట్టేయాలి. ఒకవేళ బయట ఉష్ణోగ్రత 90 డిగ్రీల ఫారన్‌హీట్‌ (32.2 డిగ్రీల సెల్సియస్‌) కంటే ఎక్కువగా ఉన్నట్లయితే తెచ్చిన గంటలోపే ఈ పదార్థాల్ని ఫ్రిజ్‌లో పెట్టాలి.
* గట్టకట్టిన పదార్థాలను చల్లటి నీటిలో/మైక్రోవేవ్‌ ఒవెన్‌లో పెట్టి కరిగించడం సురక్షితం. అంతేకానీ.. వాటిని బయట కిచెన్‌ ప్లాట్‌ఫామ్‌, ఇతర టేబుల్స్‌పై పెట్టి వాటంతటవే కరిగిపోతాయి అని వదిలేయడం మంచిది కాదు. ఎందుకంటే గది ఉష్ణోగ్రత వద్దకు చేరే సరికి ఆయా పదార్థాల్లోని బ్యాక్టీరియా రెండింతలవుతుంది. కాబట్టి కౌంటర్ టాప్స్‌పై పెట్టి ఘనీభవించిన పదార్థాల్ని అస్సలు కరిగించకూడదు.
* సూప్స్‌, ఇతర కూరల్ని (కాయగూరలు లేదా ఇతర మాంసాహారం కలిపి తయారుచేసినా) మూడు నాలుగు రోజుల వరకు ఫ్రిజ్‌లో నిల్వ చేయచ్చు.
* మిగిలిపోయిన ఆహార పదార్థాలు (మాంసం, పౌల్ట్రీ, చికెన్‌ నగెట్స్‌/ప్యాటీస్‌, పిజ్జా.. వంటివి) ఫ్రిజ్‌లో మూడునాలుగు రోజులు ఉంచచ్చు. అలాగని అన్ని పదార్ధాలను రోజుల తరబడి ఫ్రీజర్లో పెట్టి ఎప్పుడో వినియోగించడం కరక్ట్ కాదు.

ఏదేమైనా మనం తీసుకునే ఆహార పదార్థాల్ని ఎంత తాజాగా, పరిశుభ్రంగా, అప్పటికప్పుడు వండుకొని, వేడివేడిగా తీసుకోవడమే మంచిదని చెబుతున్నారు నిపుణులు. ఒకవేళ అలా తీసుకోని పక్షంలో వాటిని బయట పడేయడమే ఉత్తమమట! అప్పుడే అది విషతుల్యం కాకుండా ఉంటుంది. తద్వారా లేనిపోని అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉండదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని