విడిపోతున్న విషయాన్ని పిల్లలకు చెప్పేదెలా..?

దాంపత్యంలో ఏర్పడే విభేదాలు కొన్నిసార్లు భార్యాభర్తలను శాశ్వతంగా విడదీసే వరకు తీసుకెళతాయి. అటువంటి నిర్ణయం తీసుకునేటప్పుడు పిల్లల కోసం మరోసారి ఆలోచించాలని చెబుతారు నిపుణులు.

Published : 30 May 2022 01:06 IST

దాంపత్యంలో ఏర్పడే విభేదాలు కొన్నిసార్లు భార్యాభర్తలను శాశ్వతంగా విడదీసే వరకు తీసుకెళతాయి. అటువంటి నిర్ణయం తీసుకునేటప్పుడు పిల్లల కోసం మరోసారి ఆలోచించాలని చెబుతారు నిపుణులు. అప్పటికీ నిర్ణయం మారక కలిసి కొట్టుకోవడం కన్నా విడిపోతేనే ఎవరికివారు బతకగలరు అనుకుంటే ఆ విషయాన్ని పిల్లలకు వివరించగలగాలి అంటున్నారు. లేదంటే వారు శాశ్వతంగా బాధితులుగా మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది.

ఇరువురూ కలిసి.. పిల్లలెదుట పెద్దవాళ్ల సంభాషణ అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉండాలి. విడిపోయే ముందు పిల్లలెదుట ఏం మాట్లాడాలో, వారికి అవగాహన ఎలా కలిగించాలో ముందుగానే భార్యాభర్తలిద్దరూ ఆలోచించుకోవాలి. లేదంటే వారి సున్నిత మనసు మరింత వేదనకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇద్దరూ వారెదుట కోపాలు ప్రదర్శించడం, ఒకరిపై మరొకరు నిందలు వేసుకోవడం వంటివి చేయకూడదు. తామిద్దరూ ఎందుకు దూరంగా ఉండాలనుకుంటున్నామో పిల్లలకు ప్రశాంతంగా చెప్పాలి. కనీసం ఇదైనా వారిని కొంత ఆలోచించేలా చేస్తుంది. అలాగని వారికి దూరంగా ఉండబోమనే విషయాన్ని కూడా వారికి చేరవేయాలి. అమ్మానాన్నలు ఇకపై కలిసి ఉండరనే భావం వారిని వేదనకు గురిచేసినా, తమతో నాన్న వచ్చి కలుస్తారనేది వారికి కొంత ఊరటగా ఉంటుంది.

మార్పులు.. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు దూరమైతే జీవితంలో వచ్చే మార్పులు కూడా పిల్లలకు ముందుగానే తెలిస్తే మంచిది. అప్పటికి వారిని బాధకు గురిచేసినా, మున్ముందు ఎలా ఉండాలో అవగాహన కలుగుతుంది. లేదంటే ఆ తర్వాత మానసికంగా కుంగుబాటుకు గురయ్యే ప్రమాదం ఉంది. తామెందుకు విడిపోతున్నామనే కారణాన్ని వారికి తెలియజేయడం పెద్దవాళ్లగా తల్లిదండ్రుల బాధ్యత. అయితే అది పిల్లల భవిష్యత్తుపై ప్రభావం పడకుండా చూస్తామనే భరోసా ఇవ్వాలి. ఇలా చేస్తే పిల్లలకు కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది.

ఆ తర్వాత.. వైవాహిక బంధం నుంచి బయటకు వచ్చిన తర్వాత తల్లి  మరింత జాగ్రత్తగా పిల్లలను పరిరక్షించాల్సిన అవసరమెంతో ఉంది. వారితో ఎక్కువ సమయం గడపడం, వారి ఆలోచనలను పంచుకోవడం వంటివి చేయాలి.  వారెదుట సాధారణంగా ప్రవర్తించాలి.  ఆత్మన్యూనత, అభద్రత వంటి భావాలకు పిల్లలు దరిచేరకుండా ఎప్పటికప్పుడు కాపాడాలి. తాము ఒంటరివాళ్లం కాదనే భరోసా అందించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని