ఆరేళ్ల పిల్లతో అసభ్యంగా..

నా స్నేహితురాలి భర్త ఆరేళ్ల పాపతో అసభ్యంగా ప్రవర్తించడాన్ని కళ్లారా చూశా. ఈ విషయం నా ఫ్రెండుకి చెబితే.. వాళ్లాయన చాలా మంచివాడు, నేనే అపార్థం చేసుకున్నాను అంది. ఆ పాపదేమో అర్థం చేసుకోలేని వయసు. ఈ పరిస్థితిలో నేనేం చేస్తే బాగుంటుందో కాస్త చెప్పండి!

Updated : 28 Aug 2023 12:46 IST

నా స్నేహితురాలి భర్త ఆరేళ్ల పాపతో అసభ్యంగా ప్రవర్తించడాన్ని కళ్లారా చూశా. ఈ విషయం నా ఫ్రెండుకి చెబితే.. వాళ్లాయన చాలా మంచివాడు, నేనే అపార్థం చేసుకున్నాను అంది. ఆ పాపదేమో అర్థం చేసుకోలేని వయసు. ఈ పరిస్థితిలో నేనేం చేస్తే బాగుంటుందో కాస్త చెప్పండి!

-ఓ సోదరి

సాధారణంగా ఏ భార్య అయినా భర్తను ఎంతగానో నమ్ముతుంది. అందువల్ల అతన్ని సమర్థించి మాట్లాడటం పరిపాటి. చిన్నపిల్లలతో సన్నిహితంగా ఉంటే.. వాళ్లను ఆడించారు, ముద్దు చేశారనుకుని సర్దిచెబుతారు. ఈమధ్య కాలంలో యువకుల దగ్గర్నుంచి వృద్ధుల వరకూ ఆడపిల్లలతో.. ముఖ్యంగా చిన్నపిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉదంతాలెన్నో వార్తల్లో వస్తున్నాయి. ఇలాంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకునే పోక్సో యాక్ట్‌ (లైంగిక వేధింపులు, అశ్లీలత నుంచి బాలలను రక్షించడానికి రూపొందిన చట్టం) వచ్చింది. దాని ప్రకారం చిన్నారులతో లైంగిక చేష్టలు నేరం. అతనలా అసభ్యంగా ప్రవర్తించిన విషయం చెబితే.. మీ స్నేహితురాలు నమ్మడం లేదు, అతన్ని మీరు మార్చలేరు కనుక.. చిన్నారి తల్లిదండ్రులను హెచ్చరించండి. ‘మనచుట్టూ అనేక దారుణాలు జరుగుతున్నాయి. మాట్లాడుతున్న, ఆడిస్తున్న నెపంతో ఎవరైనా అసంబద్ధంగా ప్రవర్తించే అవకాశం ఉంది. పాపను మగవాళ్ల దగ్గరికి ఒంటరిగా పంపకండి’ తరహాలో వారికి వివరించి, పాపను కాపాడండి. ఒకవేళ అతనలా తప్పుగా ప్రవర్తించడం మీరు మళ్లీ చూస్తే.. శిశు సంరక్షణశాఖ వారికి ఫిర్యాదు చేయండి. అలాగే మీ స్నేహితురాలికి ‘నేను ప్రత్యక్షంగా చూశాను. రేపు మీ మధ్య గొడవలు రాకూడదని, జీవితం అస్తవ్యస్తం కాకూడదని చెబుతున్నాను. ఇప్పుడు పట్టించుకోకుంటే రేపు పరిస్థితి చేజారుతుంది. పోక్సో చట్ట తీవ్రత తెలుసు కదా!’ అంటూ స్నేహపూర్వకంగా అర్థమయ్యేలా చెప్పండి. అయినా ఆమె ప్రతిస్పందించకపోతే.. ఇక వదిలేయండి. పాప తల్లిదండ్రులకు విషయం అర్థమవుతుంది కనుక వాళ్లు అప్రమత్తంగా ఉంటారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని