ఏడో తరగతికే డిజైనింగ్‌ మొదలుపెట్టా!

చిన్నతనం నుంచీ హరిత తన దుస్తులను తనే డిజైన్‌ చేసుకునేది. అవి చూసి చుట్టుపక్కల వాళ్లు మెచ్చుకునేవారు. దీంతో ఈ రంగంపై ఆసక్తి కలిగి దీనిలోనే ఎదగాలనుకుంది. ఇప్పుడామె డిజైన్లను మెచ్చేవారిలో సినిమా, సీరియల్‌ తారలు, విదేశాల్లో ఉండే తెలుగు వారూ చేరారు.

Updated : 26 May 2022 07:23 IST

హరిత

చిన్నతనం నుంచీ హరిత తన దుస్తులను తనే డిజైన్‌ చేసుకునేది. అవి చూసి చుట్టుపక్కల వాళ్లు మెచ్చుకునేవారు. దీంతో ఈ రంగంపై ఆసక్తి కలిగి దీనిలోనే ఎదగాలనుకుంది. ఇప్పుడామె డిజైన్లను మెచ్చేవారిలో సినిమా, సీరియల్‌ తారలు, విదేశాల్లో ఉండే తెలుగు వారూ చేరారు. అక్కడివరకూ ఆమె ప్రయాణం ఎలా సాగిందో.. వసుంధరతో పంచుకుందిలా!

ఉద్యోగంలో స్థిరపడటం నా కల కాదు. ఎందుకంటే ఒకరి అజమాయిషీలో పనిచేయడం నాకు నచ్చదు. అందుకే ఏదైనా సొంతంగా చేయాలని చిన్నప్పుడే నిర్ణయించుకున్నా. మాది భీమవరం. నాన్న గూడూరి కపిలేశ్వరరావు, కాంట్రాక్టర్‌. అమ్మ మహాలక్ష్మీ కుమారి. నా చిన్నప్పుడు అమ్మ, పెద్దమ్మ చీరల మీద పెయింటింగ్‌, ఎంబ్రాయిడరీ చేసేవారు. అది నచ్చి నేనూ నేర్చేసుకున్నా. ఏడో తరగతి నాటికే బయటి వాళ్లకి డబ్బులు తీసుకొని చేసిచ్చే దాన్ని. వచ్చేది చిన్న మొత్తమే కానీ.. తెలియని సంతృప్తి. సినిమాలు, టీవీ చూస్తోంటే నా దృష్టి తారల దుస్తుల మీదకే వెళ్లేది. అమ్మకి టైలరింగ్‌ వచ్చు. నాకు నచ్చిన డిజైన్‌ గీసి, అలా కుట్టమనేదాన్ని. వాటిని వేసుకొని వెళితే నా స్నేహితులు ‘బాగుంది, ఎక్కడ కుట్టించుకున్నావ్‌? మాకూ కుట్టించి ఇవ్వవా’ అనేవాళ్లు. నాకా మాటలు సంతోషాన్నిచ్చేవి. ఇంటరయ్యాక ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చేద్దామనుకున్నా. మోడలింగ్‌ అనుకుని ఇంట్లో వద్దన్నారు. నాకు ఓ అక్క, అన్నయ్య. వాళ్లకి విషయం చెబితే వాళ్లే ఒప్పించారు.

తన ద్వారా సీరియళ్లకి..
హైదరాబాద్‌లో ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో బ్యాచిలర్స్‌ చేశా. చదువుకునేప్పుడు మా అక్క నాకో చిన్న కుట్టు మెషిన్‌ కొనిచ్చింది. చదువుతూనే స్నేహితులకు డ్రెస్‌లు డిజైన్‌ చేసిచ్చేదాన్ని. 2019లో చదువయ్యాక పూర్తిగా దీనిపైనే దృష్టిపెట్టా. మొదట ఓ మెషిన్‌, కొన్నిరకాల వస్త్రాలు కొని డిజైన్‌ చేశా. వాటి ఫొటోలను తెలిసిన వాళ్లకి పంపేదాన్ని. ఇన్‌స్టాలో నా ఖాతాలోనూ ఉంచేదాన్ని. అలా క్రమంగా ఆర్డర్లు పెరిగాయి. దీంతో కుట్టడానికి టైలర్లను నియమించుకున్నా. ఇప్పుడు 20 మంది నా దగ్గర పని చేస్తున్నారు. డిజైన్‌ చేసి, ఎలా కుట్టాలి, ఏ వస్త్రం ఉపయోగించాలన్నది నేను చెబుతా. వాళ్లు కుట్టిస్తారు. వ్యాపారం కొద్ది కాలంలోనే పుంజుకుంది. నా స్నేహితురాలు ఓ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ దగ్గర పని చేస్తోంది. తన ద్వారా నటి హరితేజకు డ్రెస్‌ డిజైన్‌ చేసే అవకాశమొచ్చింది. తర్వాత యాంకర్‌ సుమ, బిగ్‌బాస్‌ ఫేమ్‌ సిరి, ఆరియానా, రసజ్ఞ రీతు, దీక్ష, అభిలాష.. ఇలా ఎంతోమందికి చేసిచ్చా. ఇటీవలే ఒక సినిమాలో హీరోయిన్‌కి చేసిచ్చా. అది ఇంకా విడుదల కావాల్సి ఉంది.

విజిల్స్‌.. చప్పట్లు..
నా డిజైన్లకు వస్తున్న స్పందన చూసి బొటిక్‌ పెడదామనుకున్నా. కొవిడ్‌ వల్ల ఆగిపోయింది. నాకు మొదట్నుంచీ సంప్రదాయ వస్త్రాలు ముఖ్యంగా పెళ్లి కూతురికి డిజైన్‌ చేయడమంటే చాలా ఇష్టం. అందుకే ఎక్కువ వీటిపైనే దృష్టి పెడతా. ఎంబ్రాయిడరీ చేయడానికీ ప్రత్యేకంగా కొందరిని నియమించుకున్నా. ఇప్పటి వరకూ ఆన్‌లైన్‌లోనే చేసిస్తున్నా. కొన్ని డిజైన్లు రూపొందించి, మోడళ్లతో షూట్‌ చేయించి ఇన్‌స్టాలో పెడతా. చాలామంది మీకు నచ్చినట్లుగా చేయండి. మాకు సరిపోయేలా, నప్పేలా ఉంటే చాలంటారు. ఫొటో చూసి, వాళ్లకి ఏ స్టైల్‌, కలర్‌ అయితే బాగుంటాయో సూచిస్తా. డిజైన్‌ వేసి వాళ్లు ఓకే అన్నాకే కుట్టడం మొదలుపెడతా. వ్యాపారం మొదలుపెట్టి మూడేళ్లవుతున్నా.. ఇప్పటికీ కస్టమర్లు వేసుకొని ఫీడ్‌బ్యాక్‌ ఇచ్చే వరకూ నాకు కొంత కంగారే. నేనో మధ్యతరగతి అమ్మాయిని. అందుకే వాళ్లకీ డిజైనర్‌ దుస్తులు అందుబాటులో ఉంచాలన్నది నా ఉద్దేశం. చూడటానికే కాదు.. వేసుకుంటే సౌకర్యంగా ఉండే వస్త్రాలకే ప్రాధాన్యమిస్తా. అందుకే ఆదరణ పెరిగింది. విదేశాల నుంచీ కూడా ఆర్డర్లు వస్తున్నాయి. ఆస్ట్రేలియా, యూఎస్‌, కెనడా, స్వీడన్‌, దక్షిణాఫ్రికా మొదలైన దేశాల్లో ఉన్నవారికి చేసిచ్చా.

రూ.30 లక్షలకు పైగా వ్యాపారం చేస్తున్నా. పాతికేళ్ల వయసుకి నా కాళ్ల మీద నేను నిలబడుతూ మరికొందరికి ఉపాధి కూడా చూపించగలగడం చాలా సంతోషంగా ఉంది. అమ్మానాన్న కూడా ఇప్పుడు ఆనందంగా ఉన్నారు. బ్యాచిలర్స్‌ చేసేటపుడు ఓసారి కళాశాలలో ఫ్యాషన్‌ షో జరుగుతోంది. బ్రైడల్‌ వేర్‌ నా థీమ్‌ అనగానే చాలామంది దీనిలో ఏముంటుంది చేయడానికి అన్నారు. కానీ ర్యాంప్‌ మీద నా డిజైన్లు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఒకటే విజిల్స్‌, చప్పట్లు. మా లెక్చరర్లూ మెచ్చుకున్నారు. నచ్చి మనస్ఫూర్తిగా చేస్తే దేనిలోనైనా విజయం సాధించొచ్చు అనడానికి ఇదో ఉదాహరణ. అందుకే ఎవరో చెప్పారని కాక.. నచ్చిన దాన్ని కెరియర్‌గా ఎంచుకోమని సలహానిస్తుంటా. నన్ను నేను నమ్మా.. అదే నేను రాణించడానికి కారణమనుకుంటున్నా. త్వరలో బొటిక్‌ ప్రారంభించనున్నా. వ్యాపారంలో రాణిస్తూ ఫ్యాషన్‌ రంగంలో మంచి పేరు సాధించాలనీ, మరింత మందికి ఉపాధి కల్పించాలన్నది నా కల.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్