వారం రోజులు తినలేదు..

నింగిలో రెక్కలు కట్టుకుని ఎగరాలన్నది ఆమె కల.. కానీ ఆ కల అంత సులభంగా నెరవేరలేదు. తన తర్వాత వాళ్లైనా ఆ కష్టం పడకూడదని వాళ్ల కలలకి తనే స్వయంగా రెక్కలు తొడగాలని అనుకుంది దివ్య. విమానంలో క్యాబిన్‌క్రూగా వెళ్లాలనుకొనేవారికి తగిన నైపుణ్యాలు అందించి 1500 మందిని ఆ రంగంలో ప్రోత్సహించారామె... ఇంతవరకూ రావడం ఎలా సాధ్యమైందో తన మాటల్లోనే..

Updated : 13 Jun 2023 06:49 IST

నింగిలో రెక్కలు కట్టుకుని ఎగరాలన్నది ఆమె కల.. కానీ ఆ కల అంత సులభంగా నెరవేరలేదు. తన తర్వాత వాళ్లైనా ఆ కష్టం పడకూడదని వాళ్ల కలలకి తనే స్వయంగా రెక్కలు తొడగాలని అనుకుంది దివ్య. విమానంలో క్యాబిన్‌క్రూగా వెళ్లాలనుకొనేవారికి తగిన నైపుణ్యాలు అందించి 1500 మందిని ఆ రంగంలో ప్రోత్సహించారామె... ఇంతవరకూ రావడం ఎలా సాధ్యమైందో తన మాటల్లోనే..

మాది బెంగళూరు. మా కుటుంబంలో అమ్మాయిలెవరూ ఇంజినీరింగ్‌ చదవలేదంటూ నన్ను అందులో ప్రోత్సహించారు. అలా మెడికల్‌ ఎలక్ట్రానిక్స్‌లో చేరినా మా మనసు మాత్రం విమానయానరంగంపైనే ఉండేది. ఇప్పటిలా సమాచారం తెలుసుకోవడానికి మొబైల్‌, గూగుల్‌ లేవు. మూడో ఏడాదిలో ఉండగా టీవీలో ఓ కార్యక్రమం నన్ను ఆకట్టుకుంది. ఎయిర్‌ హోస్టెస్‌ల శిక్షణపై వస్తున్న ప్రత్యేక కార్యక్రమం అది. ఇంజినీరింగ్‌ మానేసి, అందులో చేరతా అంటే.. నాన్న చదువుపూర్తికానివ్వు అన్నారు. మధ్యలో ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రకటన చూసి పరీక్షలు రాశా. అన్నీ రౌండ్లు అయ్యాయి. ఆఖరి మెడికల్‌ రౌండ్‌లో చేదు అనుభవం. బరువు అరకేజీ ఎక్కువగా ఉన్నానని తీసుకోలేదు. ఇంటికొచ్చి చాలా బాధపడ్డాను. వారం రోజుల పాటు ఏం తినలేదు. ఎయిర్‌హోస్టెస్‌ కావాలన్న నా కల నెరవేరలేదు. ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ రెండేళ్లకి ఒకసారి మాత్రమే ఉద్యోగ ప్రకటనలు ఇచ్చేది. మరోసారి రాయడానికి నా వయసు అయిపోయంది. ఆ తర్వాత మెడికల్‌ ఎలక్ట్రానిక్‌ ఎక్విప్‌మెంట్‌కు సంబంధించిన ఓ సంస్థలో ఉద్యోగానికి చేరా. కొన్నిరోజులే. అక్కడ చేయలేక ఉద్యోగానికి రాజీనామా చేసి ఎయిర్‌ ఇండియాకి దరఖాస్తు చేసుకున్నా. గత అనుభవంతో డైటింగ్‌, వ్యాయామాలతో ఫిట్‌నెస్‌ కోసం చాలా కష్టపడ్డా. పదివేలమంది హాజరయ్యారు. వాళ్లని చూస్తే నాలో దిగులు పుట్టింది. ఈసారైనా సాధిస్తానా నాన్న ధైర్యం చెప్పారు. ఫలితాలు చూస్తే.. బెంగళూరు నుంచి ఇద్దరు ఎంపికైతే అందులో నేనొక్కదాన్ని. ముంబయిలో శిక్షణ. ఆరునెలలపాటు అమ్మానాన్నలకు దూరంగా ఉన్నా. క్యాబిన్‌ క్రూగా కీలక బాధ్యతలు, సేవలు ఉంటాయి. భద్రతా నియమాల విషయంలో చాలా కఠినంగా ఉండాలి. అనుకోని ప్రమాదం ఏర్పడితే ప్రయాణికుల రక్షణ వంటివి మా బాధ్యతలే. అలా 2004లో ఉద్యోగంలో చేరి 5 ఏళ్లలో న్యూయార్క్‌, లాస్‌ఏంజిల్స్‌, షికాగో, లండన్‌, పారిస్‌, టోక్యో.. ఇలా ప్రపంచాన్ని చుట్టేశా. వారంలో రెండు రోజులు మాత్రమే ఇండియాలో.. మిగిలిన రోజులు విదేశాల్లోనే. పెళ్లై ఇద్దరు పిల్లలు అబ్బాయిలు పుట్టేసరికి వాళ్ల ఆలపాపాలనా కష్టమైంది. దాంతో ఉద్యోగాన్ని వదిలి బెంగళూరుకొచ్చేశా. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్‌లేని నేనే అవకాశం దక్కించుకున్నప్పుడు మధ్యతరగతి పిల్లలు ఎందుకు దక్కించుకోలేరు? అనుకున్నా. వాళ్ల కలలు కూడా నిజం చేయాలని పిల్లల్ని చూసుకొంటూనే ఫ్రాంక్‌ఫిన్‌ ఇన్‌స్టిట్యూట్‌లో క్యాబిన్‌క్రూ శిక్షకురాలిగా చేరా. ఆ తర్వాత మరికొన్ని సంస్థల్లో పనిచేయడంతో ఈ శిక్షణపై లోతైన అవగాహన వచ్చింది.

దూరం కాలేక..

వేర్వేరు సంస్థల్లో చాలామంది పిల్లలకు శిక్షణ ఇచ్చిన అనుభవంతో 2017లో ‘వెర్వే ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఏవియేషన్‌’ అకాడమీని సొంతంగా స్థాపించా. ఏడాదికే విద్యార్థుల సంఖ్య పెరగడంతో ఈ రంగంలో నిపుణులను ట్రైనీస్‌, మెంటర్స్‌గా నియమించా. ఆ తర్వాత ‘మ్యాన్‌క్యూ గ్లోబల్‌ ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్‌ సంస్థ’తో కలిసి పనిచేస్తూ.. ‘వెర్వే మ్యాన్‌క్యూ ఏవియేషన్‌ అకాడమీ’ని ప్రారంభించాం. ఎయిర్‌పోర్ట్‌ మేనేజిమెంట్‌, క్యాబిన్‌ క్రూ, ఎయిర్‌పోర్ట్‌ గ్రౌండ్‌ ఆపరేషన్స్‌ వంటివాటిలో డిప్లొమాసహా ఎయిర్‌లైన్‌ కస్టమర్‌ సర్వీస్‌లో సర్టిఫికేషన్‌ కోర్సులు అందిస్తున్నాం. ఇప్పటివరకు దాదాపు 1500మందికిపైగా విద్యార్థులకి శిక్షణ అందించా. వెయ్యిమంది ఎయిర్‌పోర్ట్‌ గ్రౌండ్‌ ఆపరేషన్స్‌లో ఉద్యోగాలు అందుకున్నారు. వాళ్ల సంతోషాన్ని నాతో పంచుకుంటూ ఉంటే వాళ్లంతా నా కుటుంబమే అనిపిస్తుంది. ఈ సేవలకుగాను వెయ్యిమంది ఆసియా ప్రముఖుల్లో ఒక్కరిగా గ్లోబల్‌ ఇంక్యుబేటర్‌ ఫర్‌ ఉమెన్‌ సంస్థ ఉమెన్నోవేటర్‌గా గుర్తించింది.


సమన్వయమే నా రహస్యం..

‘నీ సామర్థ్యం కన్నా తక్కువ కలలు కనొద్దని’ చెప్పేవారు నాన్న. అలా కుటుంబం నుంచి అందిన ప్రోత్సాహమే నన్నీ కెరియర్‌వైపు నడిపించింది. కానీ పిల్లల్ని చూసుకుంటూ కెరియర్‌ని సమన్వయం చేసుకోవడం కష్టమైంది. అందుకే బ్రేక్‌ తీసుకున్నా. యోగా, ప్రాణాయామం వంటివి తర్వాత కెరియర్‌ని ప్రారంభించడానికి కావాల్సిన శక్తిని అందించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని