శరణార్థ మహిళలకు చేయూతనిస్తూ..

చదువు నిమిత్తం విదేశం నుంచి భారతదేశానికొచ్చారావిడ. వస్త్రపరిశ్రమల వద్ద మిగిలిపోయే వృథాను ఓ మంచిపనికి వినియోగించాలనుకున్నారామె. ఆ ఆలోచనే నేడు శరణార్థ మహిళలకు ఉపాధిని కల్పిస్తోంది. వందలమంది గ్రామీణ మహిళలకూ ఆర్థిక స్వేచ్ఛను అందించేందుకు ఈమె కృషి చేస్తున్నారు.

Updated : 17 Jun 2023 02:52 IST

చదువు నిమిత్తం విదేశం నుంచి భారతదేశానికొచ్చారావిడ. వస్త్రపరిశ్రమల వద్ద మిగిలిపోయే వృథాను ఓ మంచిపనికి వినియోగించాలనుకున్నారామె. ఆ ఆలోచనే నేడు శరణార్థ మహిళలకు ఉపాధిని కల్పిస్తోంది. వందలమంది గ్రామీణ మహిళలకూ ఆర్థిక స్వేచ్ఛను అందించేందుకు ఈమె కృషి చేస్తున్నారు. వారి సృజనాత్మకతను ప్రపంచదేశాలకు పరిచయం చేసి, మహిళా సాధికారత కోసం పాటుపడుతున్న ఐరిస్‌ స్ట్రిల్‌ స్ఫూర్తి కథనమిది.

భారతదేశంలో డిజైన్‌ వర్క్‌కు సంబంధించిన కోర్సు చేయడానికి ఐరిస్‌ స్ట్రిల్‌ ఫ్రాన్స్‌ నుంచి వచ్చారు. తన కోర్సుతోపాటు ఇక్కడి మారుమూల గ్రామీణ ప్రాంత మహిళల్లో దాగున్న సృజనాత్మకతను గుర్తించి, వాటిని వినియోగించుకోవడంలో వారికి శిక్షణ నిచ్చేవారీమె. సంప్రదాయ కళలను అభివృద్ధి చేసుకోవడం నుంచి పలురకాల ఉత్పత్తుల తయారీలోకి అడుగుపెట్టేలా ప్రోత్సహించే వారు. మార్కెటింగ్‌ నేర్పించేవారు. దీని కోసం వర్క్‌షాపులు నిర్వహిస్తున్నప్పుడు వారందరూ ఆర్థికస్వేచ్ఛ అందుకోవడానికి తనవంతు సాయం చేయాలనుకొనేవారు. తన ప్రాజెక్ట్‌కు సంబంధించి ఫ్యాక్టరీలకు వెళ్లేటప్పుడు టన్నుల కొద్దీ వస్త్రం వృథా అవడం చూసిన ప్రతిసారీ, దీన్ని పునర్వినియోగించి ఉపయోగపడేలా చేయాలనే ఆలోచన వచ్చేదామెకు. దీన్ని మహిళలకు ఉపాధిగా మార్చితే ఎలా ఉంటుందనుకొన్నారు. అదే ఐరిస్‌ను 2019లో దిల్లీలో ‘సిలైవాలీ’ సంస్థను ప్రారంభించేలా చేసింది.

శరణార్థ మహిళలకు...

గ్రామీణ మహిళలకు హస్తకళలపై శిక్షణ ఇప్పించడానికి వర్క్‌షాపులు నిర్వహిస్తున్న సమయంలో ఓసారి 70మంది శరణార్థులను కలుసుకొన్నారు ఐరిస్‌. ‘‘యునైటెడ్‌ నేషన్స్‌ హైకమిషనర్‌ ఫర్‌ రెఫ్యూజీస్‌’ సెంటర్‌లో వర్క్‌షాపు నిర్వహించే అవకాశం దొరికింది. అక్కడ ఆఫ్గాన్‌ శరణార్థ మహిళలను చూశా. వీరికి ఉపాధిని కల్పించాలనిపించింది. అంతకు ముందు గ్రామీణ ప్రాంతాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినప్పుడు కలుసుకున్న 150 మంది మహిళలనూ ఈ ఉపాధి కల్పన ఆలోచనకు జోడించా. ఇదంతా పర్యావరణ పరిరక్షణ దిశగానే చేద్దామనిపించింది. వస్త్ర పరిశ్రమల వద్ద మిగులుతోన్న వృథా వస్త్రంతోనే బొమ్మలు, గృహాలంకరణ ఉత్పత్తుల తయారీపై అందరికీ శిక్షణనిచ్చా. వాటిని మార్కెటింగ్‌ చేయడం కూడా నేర్పించాం. ఆన్‌లైన్‌లో సిలైవాలీ ఉత్పత్తులను చూసి యునిక్లో సంస్థ మాతో చేయి కలిపింది. వృథా వస్త్రం ఉత్పత్తుల గురించి తెలుసుకొన్న న్యూయార్క్‌ సంస్థ ‘ఉల్లా జాన్సన్‌’ మొదటి సారిగా 150 ఏనుగు బొమ్మలకు ఆర్డరిచ్చి, మా ఖాతాదారుగా మారింది. మా బొమ్మలను నేటి తరానికి తగినట్లుగా డిజైన్‌ చేయడంతో మరిన్ని అవకాశాలూ వచ్చాయి. ఆయా సంస్థల ఆర్డర్ల మేరకు తయారీ చేసిస్తున్నాం. దాంతో భారతదేశంలోనే కాకుండా ‘సారా బ్యాగు’ వంటి విదేశీ సంస్థల నుంచి ఆర్డర్లు పెరిగాయి. ప్రతిష్ఠాత్మక ‘ఖ్లోయే ఫ్యాషన్‌హౌస్‌’ మాతో కలిసి పనిచేయడానికి ముందుకొచ్చింది. ఆ సంస్థ కోసం రెండు రకాల బొమ్మలను తయారు చేసి ఇస్తున్నాం. హ్యాండ్‌మేడ్‌ ‘సిలైవాలీ’ బొమ్మలు మార్కెట్లో మంచి గుర్తింపు పొందాయి. ఆయా సంప్రదాయాలు, దేశాలకు తగినట్లుగా సహజంగా ఉండేలా వస్త్రం ఎంపికలో జాగ్రత్తలు తీసుకొంటాం. దీంతో ఈ ఉత్పత్తులన్నీ ‘డాల్‌-వుమెన్‌ ఆఫ్‌ ద వరల్డ్‌’గా నిలిచాయి. దాదాపు 135రకాల ఈ ఉత్పత్తుల తయారీ ద్వారా ప్రస్తుతం 400 మందికిపైగా మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఈ డాల్స్‌ వరల్డ్‌ ఫెయిర్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ సర్టిఫికేషన్‌నూ పొందాయని’ సంతోషంగా వివరించారామె. ఈ బొమ్మలిప్పుడు పేపర్‌ బోట్‌, వాయు, జైపుర్‌ మోడర్న్‌, సారా బ్యాగు వంటి విదేశీసంస్థల తరఫున, 100కుపైగా లైఫ్‌స్టైల్‌ స్టోర్స్‌లోనే కాకుండా వెబ్‌సైట్‌ సహా దిల్లీలో సొంత దుకాణాల్లోనూ లభ్యమవుతున్నాయి. భవిష్యత్తులో మరిన్ని వందల మంది మహిళలకు ఉపాధి కల్పించాలనే ఆశయంతో ఐరిస్‌ ముందడుగు వేస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్