మాతృభాషా మాధుర్యం వాళ్లకూ దక్కాలని..

విదేశాలకు వెళ్లినపుడు మన భాష మాట్లాడేవాళ్లు కనిపిస్తే ఆనందమే కదా. చాలా పొంగిపోతాం. మరి ఇప్పటి తరానికి ఆ సంతోషాన్ని ఎందుకు అందివ్వలేకపోతున్నాం.

Updated : 20 Jul 2023 04:04 IST

విదేశాలకు వెళ్లినపుడు మన భాష మాట్లాడేవాళ్లు కనిపిస్తే ఆనందమే కదా. చాలా పొంగిపోతాం. మరి ఇప్పటి తరానికి ఆ సంతోషాన్ని ఎందుకు అందివ్వలేకపోతున్నాం. ఆంగ్లం తప్ప మరే భాషా నేర్చుకునే అవకాశం ఎందుకు ఇవ్వడం లేదు వాళ్లకి. ఈ ఆలోచనల్లోంచి పుట్టిందే టి4టేల్స్‌. దీని వెనుకున్న కథాకమామీషూ ప్రీధా కపూర్‌ గుప్తానే అడిగి తెలుసుకుందాం.

నగనగా ఓ ఊరు... అంటూ కథలు విన్నా, చదివిన అనుభూతి మనలో ఎంతమందికి ఉంది? చాలా మందిమే చేతులెత్తుతాం. కానీ ఇప్పటి తరం పిల్లల్లో అది కరవైంది. వాళ్లకి అంతా ట్వింకిల్‌ ట్వింకిల్‌ లిటిల్‌ స్టార్‌లే.. మా అమ్మాయి కూడా ఆ కోవకు చెందినదే. తల్లిగా, టీచర్‌గా పిల్లలు ఇక్కడి భాష, సంస్కృతులు నేర్చుకోవాలన్నది నా ఆశ. నేను పుట్టి పెరిగింది దిల్లీ. ప్లాంట్‌ మాలిక్యులర్‌ బయాలజీలో పీహెచ్‌డీ చేశాను. ఉన్నత చదువులు, ఉద్యోగాలు అంటూ ఆస్ట్రేలియా, జర్మనీ, అమెరికా ఇలా చాలా దేశాలే తిరిగాను. ఆస్ట్రేలియాలోని మాక్వేరి విశ్వవిద్యాలయంలో లెక్చరర్‌గానూ పనిచేశాను. పెళ్లయ్యాక  ఆయన ఉద్యోగరీత్యా బెంగళూరు వచ్చేశాం. బోధన అంటే ఇష్టం. అందుకే ఇక్కడికి వచ్చాక ఓ అంతర్జాతీయ పాఠశాలలో టీచర్‌గా చేరా. ఒక రోజు మా అమ్మాయిని పుస్తకాలు కొనడానికి దుకాణానికి తీసుకువెళ్తే అక్కడ ఆమె ఎంచుకున్నవన్నీ ఇంగ్లిషువే. విదేశాల్లో ఉన్న నా స్నేహితులతో ఇదే విషయం చెబితే మా పిల్లలూ మాతృభాషలో మాట్లాడాలన్న కోరిక ఉంది. కానీ ఎక్కడ మేం అంతా ‘కభి ఖుషీ కభీ ఘమ్‌...’లో కాజోల్‌లా ‘మా సే మమ్మీ..’ అయిపోయాం అన్నారు. ఆ క్షణం నవ్వుకుని అందరూ వదిలేశారు. కానీ నేను అలా చేయలేకపోయా. మనదేశంలోని చిన్నారులకే కాదు...విదేశాల్లో స్థిరపడ్డ వారికీ మాతృభాష మధురిమలు పంచాలనుకున్నా. ఇందుకోసమే టి4టేల్స్‌ ప్రారంభించాను. దీనికి అమెరికాలో ఉన్న నా స్నేహితురాళ్లు అతిరా నాయర్‌, అపరాజితా ఖండేల్వాల్‌ తోడయ్యారు. ఒకరు మార్కెటింగ్‌, ఇంకొకరు డిజైనింగ్‌ చూసుకుంటాం అన్నారు. చందమామ కథల కన్నా సులభంగా ఉండేలా పాఠ్యాంశాలు తయారుచేయాలనుకున్నా. ఎందుకంటే 3 నుంచి 8 ఏళ్ల పిల్లలే మా లక్ష్యం.

ప్రత్యేకంగా...

అప్పుడప్పుడే మాటలు పలికే చిన్నారులకు చిట్టిచిలకమ్మా పద్యం చెప్పినట్లు, ఒకవైపు పదాలన్నీ, ఇంకోవైపు వాటి బొమ్మల్ని అచ్చు వేయించాం. అలా మొదటి పుస్తకం ‘‘దస్‌దిన్‌’’ విడుదల చేశాం. హిందీ, పంజాబీ, మలయాళం, కన్నడ భాషల్లో వీటిని ప్రచురించాం. మంచి ఆదరణ లభించింది. భారత్‌లో కంటే విదేశాల నుంచి ఎక్కువగా ప్రశంసలు వెల్లువెత్తాయి.


అంతా వద్దని అన్నా..

‘‘ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో టీచర్‌వి. మీ ఆయన కూడా బాగా స్థిరపడ్డారు. నీకెందుకు ఈ వృథా ప్రయాస’’ అని చాలా మంది అడిగారు. కొందరైతే ‘నీకు వేరే ఆదాయ మార్గాలు అవసరమా’ అన్నారు. ఇవేవీ నేను పట్టించుకోలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ స్కూల్‌. తర్వాత ఇంటి బాధ్యతలు. ఇవన్నీ అయ్యాక, పిల్లలు నిద్రపోయాకే నా ఆంత్రప్రెన్యూర్‌ జీవితం మొదలయ్యేది. మొదట్లో కష్టంగా ఉన్నా. రానురానూ అలవాటైంది. రాబోయే తరానికి ఒక మంచి అలవాటుని పరిచయం చేస్తున్నానన్న తృప్తే నన్ను నడిపిస్తోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని