ఆ మనసే... గెలిపించింది!

110కిపైగా దేశాల యువతులు... అందంలోనూ, ప్రతిభలోనూ ఎవరికెవరూ తీసిపోరు. అలాంటిది ఇంతమందిని దాటి, మిస్‌ వరల్డ్‌ కిరీటం క్రిస్టీనా జికోవాని చేరింది. ఏమిటామెలో ప్రత్యేకత అంటే ఆమె ‘అందమైన మనసే’ అంటున్నారంతా! ‘ప్రతిఒక్కరికీ కొన్ని కలలు, ఆశయాలు ఉంటాయి కదా! పెద్దవుతున్న కొద్దీ అవి దూరమవుతూ వచ్చాయి అనుకుందాం

Published : 11 Mar 2024 02:17 IST

110కిపైగా దేశాల యువతులు... అందంలోనూ, ప్రతిభలోనూ ఎవరికెవరూ తీసిపోరు. అలాంటిది ఇంతమందిని దాటి, మిస్‌ వరల్డ్‌ కిరీటం క్రిస్టీనా జికోవాని చేరింది. ఏమిటామెలో ప్రత్యేకత అంటే ఆమె ‘అందమైన మనసే’ అంటున్నారంతా!

‘ప్రతిఒక్కరికీ కొన్ని కలలు, ఆశయాలు ఉంటాయి కదా! పెద్దవుతున్న కొద్దీ అవి దూరమవుతూ వచ్చాయి అనుకుందాం. ఇప్పుడు మీరు ఓ తల్లో తండ్రో అయ్యారు. మీ పిల్లలూ అదే పరిస్థితిలో ఉంటే మీకెలా ఉంటుంది? తాము ఎదుర్కొన్న ఇబ్బంది తమ పిల్లలకు రావాలని ఎవరూ కోరుకోరు. కానీ చాలామందిది ఏమీ చేయలేని నిస్సహాయత. ఇందుకు కారణం- సరైన విద్య లేకపోవడమే. ప్రపంచవ్యాప్తంగా పాతిక కోట్ల మందికి స్కూలు ముఖమే తెలియదు. అలాంటి వారందరికీ చదువును చేరువ చేయాలన్నదే నా కల. ఎందుకంటే చదువు ప్రతిఒక్కరి ప్రాథమిక హక్కు’ అని చెప్పి అందరి అభినందనలే కాదు, మిస్‌వరల్డ్‌ కిరీటాన్నీ దక్కించుకుంది 24 ఏళ్ల క్రిస్టీనా.

ఈమెది చెక్‌ రిపబ్లిక్‌. లా, బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ల్లో డ్యూయల్‌ డిగ్రీ పూర్తిచేసింది. మనం ఎదిగితే చాలదు. సమాజానికీ సాయపడాలి అని నమ్ముతుంది క్రిస్టీనా. అసలే చదువంటే ప్రాణమిచ్చే అమ్మాయి. అది చాలామందికి అందని కల అని తెలిసి తట్టుకోలేకపోయింది. ‘క్రిస్టీనా జికోవా ఫౌండేషన్‌’ ప్రారంభించి, పేద విద్యార్థులకు సాయమందిస్తోంది. టాంజానియాలో ‘ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌’ ప్రారంభించి, పిల్లలతోపాటు మానసిక వికలాంగులు, పెద్దవారికీ చేరువ చేసింది. ‘పేదరికం పోవాలన్నా, మానవ జీవనం మెరుగుపడాలన్నా విద్యే మూలం’ అని నమ్మే క్రిస్టీనా విద్యార్థి దశ నుంచే సేవాకార్యక్రమాలు చేస్తోంది. పనిలో భాగంగా దేశవిదేశాలను చూడొచ్చనుకున్న క్రిస్టీనా మోడలింగ్‌కి వచ్చింది. పోటీలో గెలిచినా ఓడినా నా లక్ష్యాన్ని కొనసాగించేదాన్ని. ఈ కిరీటం తన బాధ్యతను మరింత పెంచిందంటోంది. ‘పోటీల్లో భాగంగా భారత్‌లో ‘ధారావి ప్రాజెక్టు’ని చూశా. మురికివాడల పిల్లలు సంగీతంతో తమ కలలు పండించుకోవడానికి చేసే ప్రయత్నం నన్ను ఆకర్షించింది. ఆ స్ఫూర్తిని వెంటబెట్టుకొని వెళుతున్నా’ అంటోంది క్రిస్టీనా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్