అపరాజితాదేవి విజయం

శుంభ నిశుంభులనే రాక్షస సోదరులు అఖండ బలపరాక్రమాలతో లోక కంటకులయ్యారు. ఏ పురుషుడి చేతిలోనూ మరణించొద్దని శివుడి వరం పొందటమే వారి నిరంకుశత్వానికి కారణం. ఆ హింస తట్టుకోలేక దేవతలూ, సకల లోకవాసులూ దేవిని శరణు వేడారు. ఇంతలో ఆదిపరాశక్తి సౌందర్యాన్ని సైన్యాధిపతులు వర్ణించడంతో శుంభుడు ఆమెను పెళ్లాడదలచి దూతను పంపాడు.

Published : 01 Oct 2022 00:30 IST

శరన్నవరాత్రులు

స్త్రీశక్తి పురుషశక్తిని మించి తీరుతుంది అనడానికి అపరాజితా దేవి విజయమే నిదర్శనం.

శుంభ నిశుంభులనే రాక్షస సోదరులు అఖండ బలపరాక్రమాలతో లోక కంటకులయ్యారు. ఏ పురుషుడి చేతిలోనూ మరణించొద్దని శివుడి వరం పొందటమే వారి నిరంకుశత్వానికి కారణం. ఆ హింస తట్టుకోలేక దేవతలూ, సకల లోకవాసులూ దేవిని శరణు వేడారు. ఇంతలో ఆదిపరాశక్తి సౌందర్యాన్ని సైన్యాధిపతులు వర్ణించడంతో శుంభుడు ఆమెను పెళ్లాడదలచి దూతను పంపాడు. అంబిక చిరునవ్వు నవ్వి తనను ఓడించినవాడినే పెళ్లాడతానంది. శుంభుడు అంబికను లాక్కురమ్మని ధూమ్రలోచనుణ్ణి పంపాడు. ఆమె తిరస్కరించగా ‘పురుషులే శుంభుని ముందు నిలువలేరు, స్త్రీవైన నువ్వు గెలవగలవా?’ అని గద్దించాడు ధూమ్రలోచనుడు. ఆగ్రహించిన అంబిక ఒక్క హూంకారంతో అతణ్ణి భస్మం చేయగా చండ ముండులు కోపోద్రిక్తులయ్యారు. వారి ఘోరాకృతులకు తగ్గట్టుగా పరాశక్తి నుదుటి నుంచి కాళిని పుట్టించింది. కాళి వాళ్లిద్దర్నీ నేలకూల్చింది. దాంతో శుంభ నిశుంభులు యుద్ధానికి తరలారు. అప్పుడు బ్రహ్మశక్తి అయిన బ్రహ్మణి, మహేశ్వరుని శక్తి మాహేశ్వరి అలాగే కౌమారి, వైష్ణవి, వారాహి, నారసింహి, ఐంద్రి మొదలైన సర్వశక్తులూ చండిక పక్కన నిలిచారు. రాక్షసులందర్నీ నశింపచేస్తున్న స్త్రీ శక్తులను చూసి రక్తబీజుడనే అసురుడు ముందుకొచ్చాడు. అతడి శరీరం నుంచి పడుతున్న ఒక్కో రక్తబిందువు నుంచి ఒక్కో రక్తబీజుడు పుట్టసాగాడు. కాళి నోరు తెరిచి వారందరినీ మింగేసింది. అంబిక శూలంతో రక్తబీజున్ని వధించింది. ఖడ్గం, శూలం, చక్రం, గద మొదలైన ఆయుధాలతో పరాశక్తికీ, శుంభ నిశుంభులకూ మధ్య ఘోరయుద్ధం జరిగింది. దేవి పరాక్రమం ముందు నిలబడలేక నిశుంభుడు ప్రాణాలొదిలాడు. శుంభుతో ముష్టి యుద్ధం చేసిన అంబిక తననీ వధించడంతో లోకాలన్నీ పండుగ చేసుకున్నాయి. లోకకల్యాణకారిణి అయిన దేవి విజయ రూపిణిగా, విజయదాయినిగా, అపరాజితగా స్తుతులందుకుంది. సృష్టి స్థితి లయ కారిణి, సర్వశక్తిస్వరూపిణి, క్రూరరాక్షస సంహారిణి, సకల శుభప్రదాయిని.. రూపమేదైనా అది లలితా దేవే.  

- డాక్టర్‌ పులిగడ్డ విజయలక్ష్మి

బతుకమ్మ సంబరాల్లో ఏడో రోజున బతుకమ్మను ‘వేపకాయల బతుకమ్మ’గా పిలుస్తారు. ఈరోజు బియ్యప్పిండిని బాగా వేయించి వేప పండ్లలా చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు.


శ్రీమహాలక్ష్మి దేవి.. సిరిసంపదలు, సౌభాగ్యం, సంతానం, ధైర్యం, విజయానికి అధిష్ఠాన దేవత. ఇంద్రకీలాద్రిపైన శ్రీమహాలక్ష్మి అవతారంలో రెండు చేతుల్లో కమలాలనూ, మరో రెండు చేతుల్లో అభయ వరధ హస్త ముద్రలను చూపిస్తూ ఇరువైపులా గజరాజుల సపర్యల మధ్య అమ్మవారు తేజోమయంగా ప్రకాశిస్తూ భక్తులకు దర్శనమిస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని