వ్యాపారవేత్తగా నిలవాలనుకుంటే...
సరళకు తనకాళ్లపై తాను నిలబడి, మరికొందరికి ఉపాధి అందించాలనేది లక్ష్యం. చదువైన తర్వాత అయిదేళ్లు ఉద్యోగం చేసి కొంత పొదుపు చేసింది. ఇప్పుడు వ్యాపారవేత్తగా నిలబడాలనుకుంటోంది. ఈ దిశగా అడుగులేసే వారు ముఖ్యమైన కొన్ని అంశాలను తెలుసుకోవాలంటున్నారు నిపుణులు.
సరళకు తనకాళ్లపై తాను నిలబడి, మరికొందరికి ఉపాధి అందించాలనేది లక్ష్యం. చదువైన తర్వాత అయిదేళ్లు ఉద్యోగం చేసి కొంత పొదుపు చేసింది. ఇప్పుడు వ్యాపారవేత్తగా నిలబడాలనుకుంటోంది. ఈ దిశగా అడుగులేసే వారు ముఖ్యమైన కొన్ని అంశాలను తెలుసుకోవాలంటున్నారు నిపుణులు.
ఏదైనా కెరియర్‌లోకి వెళ్లేటప్పుడు సొంతంగా ప్రశ్నించుకోవాలి. ఎందుకు వ్యాపారవేత్త కావాలనుకుంటున్నారు అనే ప్రశ్నకు మీ దగ్గర స్పష్టమైన సమాధానం ఉండాలి. రంగాన్ని ఎంచుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ఎవరో చేస్తున్నారని కాకుండా, ముందుగా దానిపై పూర్తిగా అవగాహన సంపాదించాలి. అందులో ఎదురయ్యే ఛాలెంజ్‌ల గురించి అనుభవం ఉన్నవారిని అడగాలి. వారెలా అధిగమించారో తెలుసుకోవాలి. ప్రయోగాత్మకంగా వచ్చే సమస్యలను పరిష్కరించుకోగలరో లేదో మీకు మీరే ప్రశ్నించుకోవాలి. అప్పుడే అటువైపు అడుగులేయాలి.
ఏం సాధించాలి..
ప్రారంభించనున్న వ్యాపారంలో ఏ తరహా సమస్యలను అధిగమించగలమో, ఏవి కష్టంగా ఉంటాయో ఆలోచించాలి. ఏ చిన్న విషయాన్నీ తేలికగా తీసుకోకూడదు. ప్రారంభించే ముందు తగిన సందర్భం, ప్రాంతం, సీజన్ వంటి వాటిపై దృష్టి పెట్టాలి. అలాగే ఈ వ్యాపారం చేసి ఏం సాధించాలనుకుంటున్నాం అనే దానిపై ఓ లక్ష్యాల్ని ఏర్పరచుకోవాలి. దీనికోసం మనకు మనమే నిర్దిష్ట గడువులు కూడా పెట్టుకోవాలి. మధ్యలో సమస్యలెదురైనా లక్ష్యంవైపు చూస్తే చాలు, వాటిని దాటడానికి కృషి చేయొచ్చు.
సామర్థ్యాలు..
ఆ రంగానికి అవసరమైన సామర్థ్యాలు మీకు ఉన్నాయా లేదా గుర్తించాలి. లేవనకుంటే పెంచుకోవాలి. ఇందుకోసం శిక్షణ తీసుకోవడం, ప్రత్యేక కోర్సు చేయడం మంచిది. ఇవన్నీ నైపుణ్యాలను పెంచుతాయి. అలాగే తగినన్ని ఆర్థిక వనరులు ఉన్నాయా లేదా చూసుకోవాలి. తాహతుకు మించిన రుణాలవైపు వెళ్లకూడదు. అత్యవసరానికి మీకు ఎవరైనా చేయూతగా ఉండేలా ఉంటే, ముందుగానే వారితో మాట్లాడండి. వీటితోపాటు మార్కెట్‌లో మీ ఆలోచనలు ఎంతవరకు కొత్తగా ఉంటాయో తెలుసుకోవాలంటే సామాజిక మాధ్యమాల ద్వారా ప్రయత్నించొచ్చు. వినియోగదారులకు తగినట్లుగానే కాకుండా అవసరమయ్యేలా ఉండే ఏ వ్యాపారమైనా విజయవంతమవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.