గర్భిణిగానూ పరుగు ఆపలేదు!
మహిళలంటే సున్నితం అనే భావన చాలా మందికి ఉంటుంది. కానీ ఇంటికి, కుటుంబానికి మూలస్తంభం లాంటి మహిళ శారీరకంగా ద]ృఢంగా ఉండాలన్నది ఎరికా నమ్మకం. వైద్యురాలైన తనే ఆ
మహిళలంటే సున్నితం అనే భావన చాలా మందికి ఉంటుంది. కానీ ఇంటికి, కుటుంబానికి మూలస్తంభం లాంటి మహిళ శారీరకంగా ద]ృఢంగా ఉండాలన్నది ఎరికా నమ్మకం. వైద్యురాలైన తనే ఆ నమ్మకాన్ని అందరిలోనూ పాదుగొల్పాలని కంకణం కట్టుకుంది. అందుకే గర్భంతో ఉన్నప్పుడూ పరుగు పందాల్లో పాల్గొంది. ఇటీవలే చాలా కఠినమైందిగా చెప్పే ‘కామ్రేడ్స్ మారథాన్’లోనూ పాల్గొంది డాక్టర్ ఎరికా పటేల్.
ప్రపంచంలోనే అతి పురాతనమైన మారథాన్‌గా పిలిచే ‘కామ్రేడ్స్ మారథాన్’ ఇటీవల దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. ఈ పోటీలో భాగంగా 90 కిలోమీటర్ల దూరాన్ని 12 గంటల్లో పూర్తి చేయాలి. ఈ లక్ష్యాన్ని 22 నిమిషాలు ముందుగానే.. అంటే 11.38 గంటల్లోనే పూర్తి చేసింది చెన్నైకి చెందిన 35 ఏళ్ల డాక్టర్ ఎరికా. గైనకాలజిస్టుగా సేవలు అందిస్తూనే, మహిళల్లో ఆరోగ్యం పట్ల చైతన్యాన్ని కలిగించే కార్యక్రమాలను చేపడుతోందామె. చిన్నప్పటినుంచి క్రీడలంటే ఆసక్తి. బ్యాడ్మింటన్‌లో రాష్ట్ర స్థాయి క్రీడాకారిణి తను. తర్వాత వ్యాయామం కోసం పరుగుని అలవాటు చేసుకున్న ఎరికా.. క్రమంగా మారథాన్‌లపై ఆసక్తి పెంచుకుంది. 2016 నుంచి 5కే, 10కేలతో మొదలుపెట్టి హాఫ్ మారథాన్‌లలో పాల్గొనడం ప్రారంభించింది. 2018లో బెర్లిన్‌లో 26.2 మైళ్ల మారథాన్‌కూ హాజరైంది.
పరుగుతో శరీరమే కాదు, మనసు కూడా దృఢంగా తయారవుతుందంటుంది ఎరికా. ‘2019లో గర్భం దాల్చా. ఆ సమయంలోనూ పరుగుకు దూరం కాకూడదనిపించింది. గర్భిణిగానూ వ్యాయామాలు, పరుగు వంటివి నిపుణుల పర్యవేక్షణలో చేయొచ్చన్న విషయం అందరికీ అర్థమయ్యేలా చెప్పాలనిపించింది. దానికి నేనే ఉదాహరణగా ఉండాలనుకున్నా. గర్భిణులకు ప్రత్యేకంగా శిక్షణనిచ్చే దక్షిణాఫ్రికాకు చెందిన కోచ్ లిండ్సే ప్యారీ పర్యవేక్షణలో శిక్షణ పొందా. నా మూడో త్రైమాసికంలోనూ 10కే రన్‌లో పాల్గొన్నా. అది ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం. బాబు పుట్టిన ఆరు నెలలకే వ్యాయామాలన్నీ మొదలుపెట్టిన నేను, పరుగునీ ఆపలేదు. ప్రసవం తర్వాత మనం ఫిట్‌గా ఉండటానికి ఉపయోగపడే వ్యాయామాల్లో పరుగు కూడా ఒకటి. ‘చెన్నై రన్నర్స్’ తరఫున మహిళలకు వ్యాయామాలు, ఫిట్‌నెస్‌పైన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా. మారథాన్‌లలో పాల్గొనేలా ప్రోత్సహిస్తుంటా. ఏ లక్ష్యాన్ని అందుకోవాలన్నా.. నిరంతర సాధన ఉండాలి. ఈ నియమాన్నే నేనూ పాటిస్తా. వారంలో నాలుగు రోజులు పరుగు, రెండు రోజులు శారీరక దృఢత్వ వ్యాయామాలకు కేటాయిస్తుంటా. సంతాన లేమితో మహిళలు నన్ను సంప్రదించినప్పుడు మొదట ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోమని సూచిస్తుంటా. చాలామంది మహిళలు ఎక్కువగా పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్‌తో బాధ పడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం ఫిట్‌గా ఉండటమే. ‘కామ్రేడ్స్ మారథాన్’లో పాల్గొనడానికి చాలా సాధన చేశా. అది పూర్తి చేసిన తర్వాత కలిగిన ఆనందం ఇంతా అంతా కాదు. రన్నింగ్ ద్వారా నన్ను నేను తెలుసుకుంటా. త్వరలో మరో మారథాన్‌కు సిద్ధమవుతా’ అంటున్న ఎరికా ఆరోగ్య స్పృహ, మానసిక దారుఢ్యం ఎందరికో స్ఫూర్తిదాయకం!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.