జుట్టు ఒత్తుగా పెరగాలంటే.. ఇలా దువ్వుకోవాలి!

జుట్టును అదే పనిగా దువ్వుకుంటే ఎక్కువగా రాలిపోతుందనుకుంటాం.. అందుకే ఏదో అలా పైపైన దువ్వుకొని జడ వేసేసుకుంటాం. అయితే ఎలా పడితే అలా కాకుండా కుదుళ్ల నుంచి చివర్ల దాకా నెమ్మదిగా దువ్వుకోవాలంటున్నారు.

Published : 07 Oct 2023 18:14 IST

జుట్టును అదే పనిగా దువ్వుకుంటే ఎక్కువగా రాలిపోతుందనుకుంటాం.. అందుకే ఏదో అలా పైపైన దువ్వుకొని జడ వేసేసుకుంటాం. అయితే ఎలా పడితే అలా కాకుండా కుదుళ్ల నుంచి చివర్ల దాకా నెమ్మదిగా దువ్వుకోవాలంటున్నారు. ఫలితంగా కుదుళ్లకు రక్తప్రసరణ సక్రమంగా జరిగి జుట్టు ఒత్తుగా పెరుగుతుందని చెబుతున్నారు నిపుణులు.

ప్రయోజనాలివే!

సాధారణంగా మనం రోజూ జుట్టు దువ్వుకునే క్రమంలో సుమారు 50 నుంచి 100 వెంట్రుకల దాకా రాలిపోతాయంటున్నారు నిపుణులు. అయితే హడావిడిగా ఇష్టారీతిన దువ్వడం వల్లే ఇలా జరుగుతుందని, అదే కాస్త సమయం వెచ్చించి నెమ్మదిగా దువ్వుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య క్రమంగా తగ్గుతుందని చెబుతున్నారు. పలు అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని తేల్చాయంటున్నారు.

కుదుళ్లలో సహజసిద్ధమైన నూనెల్ని విడుదల చేసే సెబేషియస్‌ గ్రంథులుంటాయి. దువ్వే క్రమంలో అవి ప్రేరేపితమై అవసరమైన మొత్తంలో నూనెల్ని విడుదల చేస్తాయి. ఫలితంగా కుదుళ్లు, జుట్టు తేమను కోల్పోకుండా ఉంటాయి. ఇది జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తుంది.. అలాగే కేశాల్ని పట్టుకుచ్చులా మెరిపిస్తుంది.

దువ్వుకునే క్రమంలో కుదుళ్లకు చక్కటి మసాజ్‌ అందుతుంది. తద్వారా అక్కడ రక్తప్రసరణ మెరుగై.. అంతిమంగా ఇది జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది.

జుట్టులో దుమ్ము-ధూళి చేరి.. సరిగ్గా దువ్వకపోతే చిక్కులు కట్టినట్లుగా తయారవుతుంది. జుట్టు రాలడానికి ఇదీ ఓ కారణమే! కాబట్టి ఇలాంటప్పుడు చిక్కులు తొలగిస్తూ జుట్టును దువ్వుకోవడం వల్ల జుట్టు రాలకుండా ఉండడంతో పాటు వెంట్రుకలు-కుదుళ్లలో చిక్కుకున్న దుమ్ము-ధూళి కూడా తొలగిపోతాయి.

ఎన్నిసార్లు దువ్వుకోవాలి?

జుట్టు దువ్వుకోవడం మంచిదన్నాం కదా అని ఎలా పడితే అలా.. ఎంతసేపు పడితే అంతసేపు దువ్వుకుంటే ప్రయోజనాలకు బదులు సమస్యలు ఎదురవ్వచ్చంటున్నారు నిపుణులు. అందుకే రోజుకు రెండుసార్లు దువ్వుకుంటే సరి. అది కూడా దువ్వెన కుదుళ్లకు తాకేలా, వెంట్రుకల్లో చిక్కులు తొలగించుకుంటూ పైనుంచి కింది వరకు నెమ్మదిగా దువ్వుకోవాలి. ఇక ఈ క్రమంలో చెక్కతో చేసిన ప్యాడిల్ బ్రష్‌/దువ్వెన ఉపయోగిస్తే వెంట్రుకలు, కుదుళ్లు డ్యామేజ్‌ కాకుండా ఉంటాయంటున్నారు నిపుణులు.

తడి జుట్టు ఇలా!

తడిగా ఉన్న జుట్టును ఆరాక దువ్వుకుందాంలే అని వదిలేస్తుంటారు చాలామంది. తద్వారా వెంట్రుకలు చిక్కులు కట్టే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అందుకే తడిగా ఉన్న జుట్టును ఇలా దువ్వమంటున్నారు.

తలస్నానం చేశాక కండిషనర్‌ రాసుకోవాలి. ఒకవేళ ఈ అలవాటు లేని వారు దీన్ని వదిలేయచ్చు.

ఇప్పుడు బ్రిజిల్స్‌ మధ్య గ్యాప్‌ ఎక్కువగా ఉన్న, చివర్ల వద్ద మృదువైన బొడిపెల్లా ఉన్న దువ్వెన తీసుకొని కుదుళ్ల వద్ద నుంచి చివర్ల దాకా దువ్వుతూ రావాలి. ఈ క్రమంలో ఎక్కడైనా చిక్కులు కట్టినట్లు అనిపిస్తే వేళ్లతో వాటిని తొలగించాలి.

చిక్కులన్నీ తొలగిపోయాక.. మరోసారి జుట్టును పైనుంచి కింది వరకు దువ్వుకుంటే సరిపోతుంది. తడి జుట్టు బలహీనంగా ఉంటుంది కాబట్టి చిక్కులు తొలగించుకునేలా దువ్వుకుంటే చాలు.

పొడి జుట్టు కోసం..!

జడ వేసుకున్నా, ముడేసుకున్నా, వదిలేసినా.. జుట్టు ఎక్కువగా చిక్కులు కట్టేది కింది భాగంలో లేదంటే చివర్ల వద్దే.. కాబట్టి ముందుగా ఆ భాగంలో చిక్కులు తొలగించుకోవాలి. ఇందుకోసం జుట్టు మధ్య భాగం నుంచి కింది వరకు చిక్కులు తొలగించుకుంటూ నెమ్మదిగా దువ్వాలి.

ఇప్పుడు ఇంకాస్త పై నుంచి కింది వరకు నెమ్మదిగా దువ్వుకుంటూ రావాలి. ఆ తర్వాత ఇంకాస్త పై నుంచి.. ఆఖరుగా కుదుళ్ల నుంచి కింది దాకా మరోసారి జుట్టు మొత్తాన్ని దువ్వాలి. ఇలా చేయడం వల్ల చిక్కులు తొలగిపోతాయి.. జుట్టు కూడా ఎక్కువగా రాలకుండా ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్