ఈ చపాతీలతోనూ బరువు తగ్గచ్చట!

బరువు తగ్గడానికి ఆహార నియమాలు పాటించడం, వ్యాయామాలు చేయడం కామన్‌. ఈ క్రమంలో కొంతమంది రోజూ చపాతీ తింటుంటారు. మరి, సాధారణంగా చపాతీ అంటే గోధుమ పిండితో చేసుకునే వారే ఎక్కువ.

Published : 23 Dec 2023 12:28 IST

బరువు తగ్గడానికి ఆహార నియమాలు పాటించడం, వ్యాయామాలు చేయడం కామన్‌. ఈ క్రమంలో కొంతమంది రోజూ చపాతీ తింటుంటారు. మరి, సాధారణంగా చపాతీ అంటే గోధుమ పిండితో చేసుకునే వారే ఎక్కువ. కానీ ఇదొక్కటే కాదు.. వివిధ రకాల ధాన్యాలతో చేసిన పిండి కూడా అధిక బరువును తగ్గించి, సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేస్తుందంటున్నారు నిపుణులు. ఇలా ఒక్కోసారి ఒక్కో రకమైన పిండితో చపాతీ చేసుకోవడం లేదంటే ఇతర వంటకాలు ప్రయత్నించడం వల్ల విభిన్న రుచుల్నీ ఆస్వాదించచ్చు. అలాగే వాటిలోని పోషకాలూ శరీరానికి అందుతాయి.

ఓట్స్‌ పిండి

బరువు తగ్గాలనుకునే వారి డైట్‌లో ఇది తప్పకుండా ఉంటుంది. అయితే చాలామంది ఓట్స్‌ని పాలలో ఉడికించి తీసుకోవడం, ఓట్స్‌తో ఉప్మా, దోసె.. వంటివి తయారుచేసుకొని తీసుకోవడం చూస్తుంటాం. వీటితో పాటు ఓట్స్‌ పిండితో మెత్తని, రుచికరమైన చపాతీలు కూడా తయారుచేసుకోవచ్చు. ఇందుకోసం ఇంట్లో ఉన్న ఓట్స్‌నే మెత్తగా గ్రైండ్‌ చేసుకోవచ్చు లేదంటే మార్కెట్లో దొరికే ఓట్స్‌ పిండిని ఎంచుకోవచ్చు. ఓట్స్‌లో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.. పైగా ఇది గ్లూటెన్‌ రహిత పదార్థం.. ఇందులోని పోషకాలు శరీరంలో చక్కెర స్థాయుల్ని క్రమబద్ధీకరించడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.. అలాగే శరీరంలో పేరుకున్న కొవ్వుల్ని కరిగించి బరువు తగ్గడంలోనూ సహకరిస్తాయని పలు అధ్యయనాల్లో తేలింది.

సజ్జ పిండి

ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఐరన్‌, సోడియం.. వంటి పోషకాలు పుష్కలంగా లభించే సజ్జలు బరువు తగ్గాలనుకునే వారికి చక్కటి ఆహారం. ఇక వీటిలో ఉండే ఫైబర్‌ అరుగుదలను ప్రేరేపిస్తుంది. శరీరంలోని కొవ్వుల్ని కరిగించడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయుల్ని అదుపు చేసే ఈ చిరుధాన్యాలు మధుమేహులకూ మంచివట! కొన్ని రకాల క్యాన్సర్ల ముప్పునూ ఇవి దూరం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి సజ్జ పిండితోనూ రోటీ తయారుచేసుకొని.. కాయగూరలు/పప్పుతో తీసుకోవచ్చు. అయితే పూర్తిగా సజ్జ పిండి ఉపయోగించి తయారుచేసిన రోటీలు గోధుమపిండి చపాతీతో పోల్చితే కాస్త గట్టిగా, మందంగా వస్తాయి. ఇలా ఇష్టపడని వారు గోధుమ పిండి, సజ్జ పిండి సమపాళ్లలో కలుపుకొని కూడా చపాతీలు తయారుచేసుకోవచ్చు.

జొన్న పిండి

జొన్న రొట్టె మనకు తెలిసిందే! విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు నిండి ఉండే జొన్నల్లో క్యాలరీలు చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. కాబట్టి వీటిని రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల బరువు పెరగకుండా జాగ్రత్తపడచ్చు. అలాగే ఇందులోని విటమిన్‌ ‘బి’ కణజాల వృద్ధికి తోడ్పడుతుంది. ఇక ప్రొటీన్లు, క్యాల్షియం, కాపర్‌, జింక్‌, పొటాషియం.. వంటి పోషకాలు అధికంగా ఉండే జొన్నలు.. రక్తంలో చక్కెర స్థాయుల్నీ అదుపు చేస్తాయంటున్నారు నిపుణులు. అందుకే బరువు తగ్గాలనుకునే వారు, మధుమేహులు జొన్న పిండితో చేసిన రొట్టెను రోజూ ఒక పూట తీసుకోవాలంటున్నారు. రొట్టెల్ని ఎక్కువగా తినే మరాఠీయులు.. జొన్న పిండితో చేసిన రొట్టెలకే ప్రాధాన్యమిస్తారట!

క్వినోవా పిండి

క్వినోవాలో ఇతర ధాన్యాల్లో కంటే రెట్టింపు ఫైబర్‌ ఉంటుందట! ఇది కడుపు నిండిన భావనను కలిగించడంతో పాటు అరుగుదలను ప్రేరేపిస్తుంది. తద్వారా బరువు అదుపులో ఉంచుకోవచ్చు. అంతేకాదు.. శరీరంలో పేరుకున్న చెడు కొవ్వును తగ్గించడంలో ఇందులోని నీటిలో కరిగే ఫైబర్‌ తోడ్పడుతుంది. ఫలితంగా గుండె సమస్యలు తలెత్తకుండా కాపాడుకోవచ్చు. చర్మ ఆరోగ్యానికి, ఎముకల దృఢత్వానికి మేలు చేసే ఈ క్వినోవా పిండితో చేసుకునే చపాతీలు చాలా మృదువుగా వస్తాయని, సులభంగా జీర్ణమవుతాయంటున్నారు నిపుణులు.

రాగి పిండి

చలికాలంలో ఆకలి మందగిస్తుంది.. తద్వారా అన్ని రకాల ఆహార పదార్థాల్ని తీసుకోలేకపోతాం.. దీంతో పోషకాహార లోపం తలెత్తచ్చు. దీన్ని పూడ్చుకోవాలంటే రాగులు చక్కటి ప్రత్యామ్నాయం అంటున్నారు నిపుణులు. ఇవి శరీరానికి వెచ్చదనాన్ని పంచడంతో పాటు వీటిలో ఉండే క్యాల్షియం ఎముకల దృఢత్వాన్ని పెంచుతుంది. ఇక రాగుల్లో ఉండే ఐరన్‌ బరువు తగ్గడానికి సహాయపడడంతో పాటు బాలింతల్లో పాల ఉత్పత్తిని పెంచడంలో దోహదం చేస్తుందంటున్నారు నిపుణులు. కాబట్టి రాగి పిండితో చపాతీ, దోసె.. వంటివి తయారుచేసుకొని రోజూ తీసుకోవడం మంచిది.

ఇవి కూడా!

⚛ బరువు తగ్గడానికి చాలామంది బ్రౌన్‌రైస్‌ను ఆహారంలో చేర్చుకుంటుంటారు. అయితే వీటిని అన్నంగా కాకుండా అప్పుడప్పుడూ ఈ పిండితో చపాతీ చేసుకొని తీసుకున్నా ఫలితం ఉంటుందట! ఇందులో అధిక మొత్తంలో ఉండే ఫైబర్ కడుపు నిండుగా ఉండేలా చేసి ఎక్కువసేపు ఆకలేయకుండా చేస్తుందట! బియ్యప్పిండితో చేసిన చపాతీ తీసుకున్నా ఇదే ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు.

⚛ కార్న్‌ఫ్లోర్‌ని మనం వివిధ రకాల వంటకాల్లో భాగం చేసుకుంటాం. అయితే దీంతో చపాతీ తయారుచేసుకొని తీసుకుంటే అటు రుచికి రుచి.. ఇటు ఆరోగ్యానికి ఆరోగ్యం! ఇందులోని ఫైబర్‌ అధిక బరువును తగ్గించడంతో పాటు శరీరానికి శక్తినీ అందిస్తుందట!

⚛ రాజ్‌గిరాలో పుష్కలంగా లభించే ఫైబర్‌ బరువు తగ్గడంలో సహాయపడుతుంది.. అలాగే మలబద్ధకం సమస్యనూ నివారిస్తుంది.

⚛ బక్‌వీట్‌ (కుట్టు) పిండిలో క్యాలరీలు అసలు ఉండవు. అలాగే ఇందులోని పోషకాల్ని శరీరం త్వరగా గ్రహించి.. కొవ్వులు త్వరగా కరిగేలా చేస్తుంది. తద్వారా బరువు తగ్గచ్చు.

⚛ ఇలా వివిధ రకాల పదార్థాలతో తయారుచేసిన పిండిలో కొబ్బరి పొడి, బాదం పొడి.. వంటివి కొద్దికొద్దిగా కలుపుకొని చపాతీ చేసుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది. ఈ పిండితో చపాతీలే కాదు.. కేక్స్‌, పిజ్జా.. వంటివీ ఆరోగ్యకరంగా తయారుచేసుకొని తీసుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్