ఆల్ రౌండర్.. ఈ జోర్డాన్ రాకుమారి!

సాధారణంగా ధనవంతులు, సెలబ్రిటీల పెళ్లి వేడుకలంటే చాలామందికి ఆసక్తి ఉంటుంది. ఈ రోజుల్లో వారి విడాకులు కూడా ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి. దీనికి కారణం విడాకులు తీసుకునే క్రమంలో చెల్లించే భరణం అధిక మొత్తంలో ఉండడమే. రెండేళ్ల క్రితం అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌, మెకంజీ స్కాట్‌లు తమ పాతికేళ్ల అన్యోన్య దాంపత్యానికి స్వస్తి పలికారు.

Published : 22 Dec 2021 21:15 IST

సాధారణంగా ధనవంతులు, సెలబ్రిటీల పెళ్లి వేడుకలంటే చాలామందికి ఆసక్తి ఉంటుంది. ఈ రోజుల్లో వారి విడాకులు కూడా ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి. దీనికి కారణం విడాకులు తీసుకునే క్రమంలో చెల్లించే భరణం అధిక మొత్తంలో ఉండడమే. రెండేళ్ల క్రితం అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌, మెకంజీ స్కాట్‌లు తమ పాతికేళ్ల అన్యోన్య దాంపత్యానికి స్వస్తి పలికారు. ఈ సందర్భంగా మెకంజీకి దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు భరణంగా లభించింది. దాంతో అవి ప్రపంచంలో అత్యంత ఖరీదైన విడాకులుగా నిలిచాయి. తాజాగా దుబాయ్‌ రాజు షేక్‌ మహమ్మద్‌, జోర్డాన్‌ రాకుమారి హయా బింత్‌ల విడాకుల సర్దుబాటులో భాగంగా ఆమెకు, వీరిద్దరికీ పుట్టిన పిల్లలకు అక్షరాలా రూ.5,555 కోట్లు (554 మిలియన్‌ పౌండ్లు) కట్టి తీరాలంటూ కోర్టు తీర్పు చెప్పింది. దాంతో ఇవి బ్రిటిష్‌ చరిత్రలోనే అత్యంత ఖరీదైన విడాకులుగా మారాయి.

UAE ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి షేక్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూం (72), జోర్డాన్‌ రాకుమారి హయా బింత్‌ అల్‌ హుసేన్ (47)కు 2004లో పెళ్లైంది. షేక్‌ మహమ్మద్‌కు హయా బింత్‌ ఆరో భార్య. వీరికి అల్‌ జలీలా (14), జయేద్(9) అనే ఇద్దరు పిల్లలున్నారు. షేక్‌ మహమ్మద్ షరియా చట్టం ప్రకారం హయా బింత్‌ అనుమతి లేకుండానే విడాకులు ఇచ్చారు. అదే సంవత్సరం తన పిల్లలతో లండన్‌ వెళ్లిన ఆమె ‘నేను నా భర్తతో విసిగిపోయాను. అతను తన ఇద్దరు కూతుళ్లను వారి ఇష్టానికి వ్యతిరేకంగా.. బలవంతంగా దుబాయ్‌కు తీసుకొచ్చాడు. నా పిల్లలకు కూడా ప్రాణ హాని ఉంది. నాతో పాటు, నాకు సంబంధించిన వాళ్ల ఫోన్లను హ్యాక్‌ చేస్తున్నారు’ అంటూ లండన్‌ హైకోర్టుని ఆశ్రయించింది. ఈ కేసుని విచారించిన కోర్టు తాజాగా హయా బింత్‌, వారిద్దరి పిల్లలకు భరణంగా 5,555 కోట్లు చెల్లించాలని తీర్చునిచ్చింది.

ఈ క్రమంలో- బ్రిటిష్‌ చరిత్రలోనే అత్యధిక భరణం అందుకోబోతున్న హయా బింత్కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకుందాం రండి..

* హయా బింత్‌ తల్లిదండ్రులు హుస్సేన్‌ బిన్‌ తలాల్‌, అలియా టౌకన్‌. హుస్సేన్‌ బిన్‌ తలాల్‌ జోర్డాన్‌కు రాజుగా వ్యవహరించారు.

* హయా పదమూడేళ్ల వయసులోనే అంతర్జాతీయ గుర్రపు స్వారీ పోటీల్లో పాల్గొన్నారు. తద్వారా జోర్డాన్‌ తరపున ఈ పోటీల్లో పాల్గొన్న మొట్టమొదటి అమ్మాయిగా గుర్తింపు సాధించారు. ఈ క్రమంలో 1992లో ప్యాన్ అరబ్ గుర్రపు స్వారీ పోటీల్లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత జోర్డాన్‌ తరపున సిడ్నీ ఒలింపిక్స్ (2000)లో పాల్గొన్నారు. తద్వారా ఒలింపిక్స్‌లో పాల్గొనాలన్న తన కలను సాకారం చేసుకున్నారు.

* హయా బింత్‌ ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి తత్వశాస్త్రం, రాజకీయాలు, ఆర్థిక శాస్త్రం (PPE)లో గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు.

* హయా భారీ వాహనాలు కూడా నడపగలదు. ఇలా భారీ వాహనాలు నడపగలిగిన లైసెన్స్‌ ఉన్న ఏకైక జోర్డాన్‌ మహిళ హయానే.

* జోర్డాన్‌ ప్రస్తుత రాజు అబ్దుల్లా-2కు హయా సవతి సోదరి.

* ఆమె తన తల్లి రాణి అలియా పేరిట 2003లో ఓ స్వచ్చంద సంస్థను స్థాపించారు. దీనిద్వారా వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.  ఈ క్రమంలో 2005లో ఐక్యరాజ్యసమితి ఆమెను ఆహార కార్యక్రమానికి గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా నియమించింది. తద్వారా ఈ ఘనత సాధించిన మొట్టమొదటి మహిళగా నిలిచారు. 2007లో అప్పటి ఐక్యరాజ్యసమితి అధ్యక్షుడు బాన్‌కిమూన్‌ ఆమెను ఐక్యరాజ్యసమితి శాంతి రాయబారిగా నియమించారు.

* దుబాయ్‌ హెల్త్‌కేర్‌ సిటీ అథారిటీ అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో హయా ‘మెడ్‌కేర్‌ వుమెన్ & చిల్డ్రన్‌ హాస్పిటల్‌’ను ప్రారంభించారు. ఈ హాస్పిటల్లో పనిచేసే వారిలో 90 శాతం మంది మహిళలే కావడం విశేషం.

* గుర్రపు స్వారీ క్రీడలకు సంబంధించి అంతర్జాతీయ సమాఖ్యకు హయా బింత్ అధ్యక్షురాలిగా పనిచేశారు. ఆమె 2006 నుంచి 2014 వరకు ఈ పదవిలో కొనసాగారు. అలాగే 2007లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీలో సభ్యురాలిగానూ పనిచేశారు.

* దుబాయ్‌లో ఇంటర్నేషనల్‌ హ్యుమానిటేరియన్‌ సిటీ (IMC) ఉంది. ఇందులో ఐక్యరాజ్యసమితికి చెందిన పలు ఏజెన్సీలతో పాటు వివిధ ఎన్జీవోలకు సభ్యత్వం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనైనా విపత్తులు సంభవిస్తే సహాయం అందించే IMC కి హయా అధ్యక్షురాలిగా వ్యవహరించారు. 

* పౌష్టికాహారం, పేదరికం వంటి అంశాలపై హయా వివిధ అంతర్జాతీయ పత్రికల్లో సంపాదకీయాలు కూడా రాశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని