ఇదీ ఈ కేరళ సిస్టర్స్ గాన ప్రతిభ!

‘జనగణమన’ అంటూ చిన్నప్పుడు స్కూల్‌లో మన జాతీయ గీతాన్ని పాడుకున్నాం. ఆ తర్వాత స్వాతంత్ర్య, గణతంత్ర వేడుకలు లాంటి ప్రత్యేక సందర్భాల్లో ఆ గీతాన్ని ఆలపిస్తున్నాం. ఇది మన దేశ జాతీయ గీతం... అందులోనూ చిన్నప్పటి నుంచి పాడుతున్నాం కాబట్టి అందరూ సులభంగా ఈ గీతాన్ని గుర్తుంచుకుంటారు.

Published : 24 Sep 2021 18:16 IST

(Photo: Twitter)

‘జనగణమన’ అంటూ చిన్నప్పుడు స్కూల్‌లో మన జాతీయ గీతాన్ని పాడుకున్నాం. ఆ తర్వాత స్వాతంత్ర్య, గణతంత్ర వేడుకలు లాంటి ప్రత్యేక సందర్భాల్లో ఆ గీతాన్ని ఆలపిస్తున్నాం. ఇది మన దేశ జాతీయ గీతం... అందులోనూ చిన్నప్పటి నుంచి పాడుతున్నాం కాబట్టి అందరూ సులభంగా ఈ గీతాన్ని గుర్తుంచుకుంటారు. మరి అదే ఇతర దేశాల జాతీయ గీతాలు పాడమంటే... అందరమూ తెల్ల మొహాలు వేస్తాం. కానీ కేరళకు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఏకంగా 195 దేశాల జాతీయ గీతాలు ఎంతో లయబద్ధంగా ఆలపించారు. తమ గాన ప్రతిభను చాటుతూ ప్రపంచ రికార్డులు నెలకొల్పారు.

6 గంటలు.. 195 దేశాల జాతీయ గీతాలు!

అంతర్జాతీయ శాంతి దినోత్సవం (సెప్టెంబర్‌ 21) సందర్భంగా యునైటెడ్‌ నేషన్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియా (UNAA) ఆధ్వర్యంలో బ్రిస్బేన్‌లోని సెయింట్‌ జాన్స్‌ క్యాథడ్రల్‌లో ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ వేదికలోనే ‘సెల్యూట్‌ ది నేషన్స్‌’ పేరుతో ఒక ఈవెంట్‌ను నిర్వహించారు 21 ఏళ్ల థెరెసా, 18 ఏళ్ల ఆగ్నస్. ఇందులో భాగంగా ఐక్యరాజ్యసమితి సభ్యత్వం కలిగిన 195 దేశాల జాతీయ గీతాలను 6 గంటల్లో ఎంతో లయబద్ధంగా ఆలపించారు. మధ్యలో రెండుగంటలకోసారి 10 నిమిషాల పాటు మాత్రమే బ్రేక్‌ తీసుకుని ఈ అరుదైన ఫీట్‌ను పూర్తిచేశారీ ట్యాలెంటెడ్‌ సిస్టర్స్‌. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించడంతో పాటు యూనివర్సల్ రికార్డ్స్‌ ఫోరం ప్రశంసా పత్రం అందుకున్నారు.

కేరళ టు బ్రిస్బేన్!

థెరెసా, ఆగ్నస్‌ ప్రస్తుతం బ్రిస్బేన్‌లో నివాసముంటున్నారు. అయితే వీరి సొంతూరు కేరళలోని చేర్తల తాలుకాలోని థైకాట్టుస్సెరీ అనే గ్రామం. తండ్రి జాయ్‌ కే మాథ్యూ ఓ ఫిల్మ్‌ మేకర్‌. మలయాళంలో కొన్ని సినిమాలు కూడా నిర్మించారు. తల్లి జాక్వెలిన్‌ జాయ్‌ ఓ నర్సు. 2008లోనే వీరి కుటుంబమంతా ఆస్ట్రేలియాకు వలస వచ్చి స్థిరపడింది.

8 ఏళ్ల శ్రమ ఇది!

ఈ క్రమంలో ఎలాంటి దోషాలు దొర్లకుండా జాతీయ గీతాలు పాడడం వెనక ఎన్నో ఏళ్ల శ్రమ దాగి ఉందంటోంది థెరెసా. ‘వివిధ దేశాల జాతీయ గీతాలు ఆలపించాలన్న ఆలోచన ఇప్పటిది కాదు. 8 ఏళ్ల క్రితమే మా ఇద్దరికీ ఈ ఐడియా వచ్చింది. అప్పుడు నేను ఆరు, చెల్లి మూడో తరగతి చదువుతున్నాం. జాతీయ గీతాల సాధనలో మా అమ్మానాన్నలు బాగా సహకరించారు. ముఖ్యంగా కువైట్‌లో పనిచేసి వచ్చిన మా నాన్న ప్రతి జాతీయ గీతంలోని పదాలు, వాటి అర్థాలు, ఉచ్ఛారణలను మాకు వివరించారు. ఇందుకోసం ఆయా దేశాల ఎంబసీ సిబ్బంది సహకారం తీసుకున్నారు. అదేవిధంగా ఇంటర్నెట్‌లో వివిధ దేశాల టీచర్లతో మాట్లాడారు.’

తెల్లవారుజామున ప్రాక్టీస్‌ చేసేవాళ్లం!

‘మాకు మలయాళం, ఇంగ్లిష్‌ బాగా వచ్చు. కానీ వివిధ దేశాల జాతీయ గీతాలు ఆలపించాలంటే ఇవి సరిపోవు. అందుకే ఏ దేశ జాతీయ గీతమైనా నేర్చుకునేముందు దాని భాష, అర్థం, చరిత్ర గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాం. ఎలాంటి తప్పొప్పులు దొర్లకుండా, మూలంలోని భావం దెబ్బతినకుండా ఎలాంటి ఉచ్ఛారణలో పాడాలో నేర్చుకున్నాం. ఇలా ఒక్కో జాతీయగీతంపై పరిపూర్ణత సాధించేందుకు కొన్ని నెలలకు పైగా సమయం పట్టింది. ఇక సాధన విషయానికొస్తే... రోజూ తెల్లవారుజామున 5 గంటలకు లేచి, సుమారు రెండు గంటల పాటు జాతీయ గీతాలను ఆలపించేవాళ్లం’..

 

రికార్డుల కోసం కాదు!

‘ఏవో రికార్డులు సృష్టించాలని, అందరి దృష్టిలో పడాలని మేం ఈ పని చేయట్లేదు. ప్రపంచ శాంతి, పిల్లల భద్రత, మహిళా సాధికారత... ఈ మూడింటి లక్ష్యం కోసమే మా శ్రమంతా. మేం చిన్నప్పటి నుంచి ఐక్యరాజ్యసమితి నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నాం. అలా ఐక్యరాజ్యసమితి 75వ వార్షికోత్సవం సందర్భంగా గతేడాది కూడా ఒక ప్రత్యేక ఈవెంట్‌ నిర్వహించాలనుకున్నాం. కానీ కొవిడ్‌ కారణంగా రద్దైంది. అప్పుడు మేం చాలా నిరాశకు గురయ్యాం. అయితే కొవిడ్‌ మృతులకు సంఘీభావం తెలపడం కోసం వివిధ దేశాల జాతీయ గీతాలు పాడి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో అప్‌లోడ్‌ చేశాం. అప్పుడు వాటికి ఊహించని స్పందన వచ్చింది. బ్రిస్బేన్‌ కన్సర్ట్ లాగానే ఐక్యరాజ్యసమితి సహాయంతో వివిధ దేశాల్లో మా ప్రదర్శనలు ఇవ్వాలనుకుంటున్నాం. రాబోయే ఏడాది ఖతార్‌లో జరగబోయే ఫిఫా వరల్డ్‌కప్‌లో కూడా ఓ కన్సర్ట్‌ను నిర్వహించే యోచనలో ఉన్నాం. మా ఈవెంట్ల ద్వారా వచ్చిన నిధులను మహిళలు, పిల్లల భద్రత కోసం ఐక్యరాజ్యసమితి చేపట్టే కార్యక్రమాలకు విరాళంగా అందజేస్తున్నాం’ అని అంటోందీ యంగ్‌ సింగర్.

వాళ్ల సంక్షేమం కోసం ఓ ఫౌండేషన్!

ప్రస్తుతం థెరెసా క్వీన్స్‌లాండ్‌లోని గిఫ్రిత్‌ యూనివర్సిటీలో క్రిమినల్‌ సైకాలజీలో డిగ్రీ చదువుతోంది. ఆగ్నస్‌ 12వ తరగతి చదువుతోంది. పిన్న వయసులోనే అభ్యుదయ భావాలు కలిగిన వీరు ‘ఆగ్నస్‌ అండ్‌ థెరెసా పీస్‌ ఫౌండేషన్’ను నడుపుతున్నారు. దీని ఆధ్వర్యంలో పిల్లలు, మహిళల సంక్షేమం కోసం వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్