Published : 01/10/2021 14:51 IST

అందుకే రుక్మిణికి 29 కోట్ల పురస్కారం!

(Photos: Facebook)

ఏదో చదువుకుంటున్నారన్న పేరు తప్పితే చాలామంది పిల్లలకు నాణ్యమైన విద్య అందడం లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు చదువులో బాగా వెనకబడి ఉన్నారు. ఏడాదికోసారి పై తరగతులకు వెళుతున్నా ఏబీసీడీలు చెప్పలేకపోతున్నారు. సులభమైన కూడికలు, తీసివేతలు కూడా చేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు మెరుగైన, నాణ్యమైన విద్యను అందించడం కోసం తన వంతు కృషి చేస్తున్నారు రుక్మిణీ బెనర్జీ. ప్రభుత్వాలతో కలిసి పిల్లలకు మెరుగైన విద్యను అందించడానికి వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇలా విద్యా రంగానికి రుక్మిణి అందిస్తున్న సేవలకు గుర్తింపుగానే అత్యంత ప్రతిష్ఠాత్మక ‘యిదాన్‌’ పురస్కారం ఆమెను వరించింది.

ఏమిటీ పురస్కారం?

విద్య ద్వారా ప్రపంచంలో వెలుగులు నింపుతున్న వారిని ప్రోత్సహించేందుకు చార్లెస్‌ చెన్‌ యిదన్ 2016లో ఈ బహుమతిని ఏర్పాటు చేశారు. చార్లెస్‌ యిదాన్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 2017 నుంచి మొత్తం రెండు (ఎడ్యుకేషన్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌) విభాగాల్లో ఈ పురస్కారాలు ప్రదానం చేస్తున్నారు. బహుమతి గ్రహీతలకు బంగారు పతకంతో పాటు 3.9 మిలియన్ డాలర్ల (ఇండియన్‌ కరెన్సీలో సుమారు 29 కోట్ల రూపాయలు) నగదు అందజేస్తారు. అలా 2021 సంవత్సరానికి గాను మొత్తం 130 దేశాలకు చెందిన విద్యావేత్తలు పోటీ పడగా చివరకు ఇద్దరిని ఈ పురస్కారం వరించింది. అందులో భారతదేశానికి చెందిన రుక్మిణీ బెనర్జీ ఒకరు.

విద్యావేత్తగా!

ప్రస్తుతం ముంబయి కేంద్రంగా ఉన్న ‘ప్రథమ్‌’ అనే ఎన్‌జీవోకు సీఈవోగా వ్యవహరిస్తున్నారు బెనర్జీ. బిహార్‌లో పుట్టినప్పటికీ ఆమె చదువంతా దిల్లీలోనే సాగింది. సెయింట్‌ స్టీఫెన్స్ కాలేజీ నుంచి ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసిన రుక్మిణి దిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో మాస్టర్స్‌ పట్టా అందుకుంది. ఆ తర్వాత అమెరికాకు వెళ్లి ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో స్కాలర్‌గా చేరింది. ఆపై చికాగో యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పూర్తి చేసింది. 1996లో ఇండియాకు తిరిగొచ్చి ముంబయి కేంద్రంగా పనిచేస్తోన్న ‘ప్రథమ్‌’ ఎన్‌జీవోలో చేరింది.

6 లక్షల మంది విద్యార్థులపై సర్వే చేసి!

ఆర్థిక శాస్త్రంలో ఉన్నత చదువులు అభ్యసించిన రుక్మిణి ‘ప్రథమ్‌’లో చేరాక మాత్రం విద్యావేత్తగా మారిపోయారు. ‘ప్రతి చిన్నారి స్కూల్‌లో ఉండాలి... బాగా చదువుకోవాలి’ అనే సంస్థ స్లోగన్‌కు తగ్గట్లుగానే విద్యకు సంబంధించి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు అందుతోన్న విద్య, అందులోని లోపాలపై సమగ్ర వివరాలు సేకరించారు. ఈ క్రమంలోనే ‘యాన్యువల్ స్టేటస్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రిపోర్ట్‌’ (ASER) పేరుతో ఓ నివేదిక విడుదల చేశారు. రుక్మిణి, ఆమె బృందం కలిసి వంద రోజులకు పైగా గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి తయారుచేసిన నివేదిక ఇది. ఇందులో భాగంగా 6 లక్షల మంది విద్యార్థులు, వారి స్థితిగతులను ఇందులో పొందు పరిచారు. చాలామంది విద్యార్థులు చదువులో బాగా వెనకబడి ఉన్నారని, ముఖ్యంగా గణితంలో ప్రాథమిక సూత్రాలు కూడా చెప్పలేకపోతున్నారని ఈ రిపోర్టు ద్వారా చెప్పుకొచ్చారు రుక్మిణి.

ఆ నైపుణ్యాలు నేర్పిస్తూ..

ఈ నివేదికలోనే విద్యా వ్యవస్థలోని లోపాలను ఎలా అధిగమించాలో కూడా చెప్పుకొచ్చారు బెనర్జీ. ఇందులో భాగంగా ‘టీచింగ్‌ ఎట్‌ ది రైట్‌ లెవెల్‌ (TARL)’ అనే విధానం ద్వారా పిల్లలకు ‘రీడింగ్‌ అండ్‌ అర్థమెటిక్‌ స్కిల్స్‌’ ను నేర్పించాలని సూచించారు. ప్రభుత్వాల సహాయంతో కొన్నిచోట్ల ప్రయోగాత్మకంగా దీనిని అమలు చేసి సానుకూల ఫలితాలు సాధించారు. దీనికి గుర్తింపుగానే ‘యిదాన్‌’ పురస్కారాన్ని ఆమె అందుకున్నారు.

పిల్లల కోసం ఆర్టికల్స్‌, కథల పుస్తకాలు!

2015 నుంచి ‘ప్రథమ్‌’ సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తోన్న రుక్మిణి పురస్కారాలు అందుకోవడం ఇదేమీ మొదటిసారి కాదు. 2008లో బిహార్ ప్రభుత్వం ఆమెను ‘మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌’ అవార్డుతో సత్కరించింది. ఈ అవార్డు అందుకున్న మొదటి వ్యక్తి ఆమే కావడం విశేషం. ఎన్‌జీవో విధులతో పాటు పిల్లల కోసం వివిధ హిందీ, ఇంగ్లిష్‌ పత్రికల్లో వ్యాసాలు, కొన్ని కథల పుస్తకాలు కూడా రాస్తున్నారు రుక్మిణి.Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని