వీటిని ‘శృంగారం’తో ముడిపెట్టద్దు!

దాంపత్య బంధానికి ప్రేమే పునాది. ఇదే ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుతుంది.  అయితే ఆలుమగల మధ్య ప్రేమ ఉన్నప్పటికీ.. కొన్ని జంటలు తమ లైంగిక జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నారని నిపుణులు చెబుతున్నారు.

Published : 03 Feb 2024 19:38 IST

దాంపత్య బంధానికి ప్రేమే పునాది. ఇదే ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుతుంది.  అయితే ఆలుమగల మధ్య ప్రేమ ఉన్నప్పటికీ.. కొన్ని జంటలు తమ లైంగిక జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నారని నిపుణులు చెబుతున్నారు. వ్యక్తిగతంగానే కాదు.. ఇద్దరి జీవితాలతో ముడిపడిన కొన్ని అంశాలూ ఇందుకు కారణమవుతున్నాయంటున్నారు. వాటిని అధిగమించి.. పరిష్కార మార్గాలపై దృష్టి సారిస్తేనే శృంగార జీవితం పరిపూర్ణమవుతుందంటున్నారు.

కాదనకుండా..

పెళ్లంటేనే ఒక కమిట్‌మెంట్‌. జీవితాంతం ఒకరి ఇష్టాయిష్టాల్ని మరొకరు గౌరవిస్తూ ముందుకు సాగితేనే ఆ అనుబంధం శాశ్వతమవుతుంది. అయితే పెళ్లికి ముందు అవునన్నా.. పెళ్లయ్యాక కొంతమంది తాము ఇచ్చిన మాటను మరచిపోతుంటారు. తద్వారా భాగస్వామిని నిరాశకు గురి చేస్తుంటారు. ఉదాహరణకు.. తాము వ్యక్తిగతంగా, కెరీర్‌ పరంగా ఎంత బిజీగా ఉన్నా.. రోజూ కాస్త సమయం కేటాయించుకోవాలని అనుకున్నారనుకోండి. అయితే పెళ్లైన కొత్తలో దీన్ని తు.చ. తప్పకుండా పాటించినా.. రోజులు గడుస్తున్న కొద్దీ పలు కారణాల వల్ల ఒక్కోసారి ఇది కుదరకపోవచ్చు. దీంతో భాగస్వామిపై మనకు తెలియకుండానే కోపం వచ్చేస్తుంటుంది.. ‘నేనేమైనా మణులడిగానా, మాణిక్యాలడిగానా.. కాసేపు ఇద్దరం సరదాగా మాట్లాడుకుందామన్నా కుదరట్లేదు.. ఈ చిన్న కోరిక కూడా తీర్చలేకపోతే ఇంకెందుకు?!’ అంటూ అలకలు షురూ! మూగనోముతో మొదలైన ఈ అలక.. శృంగారం విషయంలోనూ భాగస్వామిని దూరం పెట్టేదాకా వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదు! అయితే ఇంత చిన్న విషయానికే.. సమస్యను పెద్దది చేసుకోకుండా.. కొన్నిసార్లు ఒకరికొకరు సర్దుకుపోవడం నేర్చుకోవాలంటున్నారు నిపుణులు. తద్వారా ఇద్దరి మధ్య ప్రేమా తరగదు.. అదే సమయంలో లైంగిక జీవితంలోనూ గ్యాప్‌ రాకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు.

పరిణతి సమస్య కాదు!

ఏ విషయంలోనైనా అనుభవంతోనే పరిణతి వస్తుంది. శృంగారమూ ఇందుకు మినహాయింపు కాదు. అయితే తమ భాగస్వామిపై ప్రేమున్నా, లైంగిక జీవితాన్ని ఆస్వాదించాలన్న కోరిక ఉన్నా.. ఈ విషయంలో పూర్తి అవగాహన లేదని, పరిణతితో ఆలోచించలేకపోతున్నామని.. తద్వారా శృంగారానికి దూరమవుతున్నట్లు కొన్ని జంటలు కౌన్సెలింగ్‌ నిపుణుల వద్దకు వెళ్తుంటాయి. ఈ క్రమంలో వారు తమ శరీరాకృతి, ఇతర విషయాల్లో ఆత్మవిశ్వాసం కోల్పోవడం, ఆత్మన్యూనతకు గురవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతుందంటున్నారు నిపుణులు. నిజానికి లైంగిక జీవితంలో పరిణతి సమస్య కానే కాదంటున్నారు నిపుణులు. అందుకే భాగస్వామిని దూరం పెట్టి.. వారిని నిరాశపరిచే కంటే.. ఒక్కసారి మీలోని భయాల్ని వారితో పంచుకోమంటున్నారు. తద్వారా మీపై వారికి ఇష్టం, గౌరవం మరింత పెరుగుతాయని.. అలాగే శృంగారం విషయంలో మీలో ఉన్న అపోహల్ని, భయాల్ని తొలగించి.. దానిపై ఆసక్తి పెరిగేలా వారు మిమ్మల్ని ప్రేరేపించే అవకాశాలే ఎక్కువంటున్నారు. దంపతుల మధ్య ఇలాంటి చర్చలు ఇద్దరినీ మానసికంగా, శారీరకంగా మరింత దగ్గర చేస్తాయని చెబుతున్నారు.

దేని దారి దానిదే!

వ్యక్తిగత జీవితానికి, కెరీర్‌కు సమప్రాధాన్యం ఇచ్చినప్పుడే దాంపత్య బంధాన్ని ఆస్వాదించచ్చు. అయితే కొంతమంది ఈ విషయాన్ని విస్మరిస్తుంటారు. తమ వృత్తి ఉద్యోగాలతోనే ఎప్పుడూ బిజీగా ఉంటారు. ఈ క్రమంలో భాగస్వామినీ నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇంటికొచ్చాక కూడా ఆఫీస్‌ పనిలోనే నిమగ్నమవుతుంటారు. తద్వారా అలసట, కోపం, చిరాకు.. ఇక ఇలాంటి ఫీలింగ్స్‌తో ఉన్నప్పుడు శృంగార ఆలోచనలు ఎలా వస్తాయి? అలాగని దాంపత్య బంధంలో కీలకమైన దీన్ని దూరం పెట్టడమూ సరికాదు. అందుకే పని, శృంగారం.. దేని దారి దానిదే అంటున్నారు నిపుణులు. ఈ రెండింటినీ బ్యాలన్స్‌ చేసుకోవాలంటే సరైన ప్రణాళికతోనే సాధ్యమంటున్నారు. ఒక సమయం అంటూ పెట్టుకొని ఆఫీస్‌ పని పూర్తిచేసుకుంటే ఒత్తిడి దరిచేరదు.. తద్వారా ఇంటికొచ్చాక భాగస్వామితో ప్రేమగా గడిపే ఆ విలువైన సమయమూ మిగులుతుంది. ఈ సమయపాలనే ఇద్దరి మధ్య అనుబంధాన్నీ పెంచుతుంది.

గొడవలే సాకుగా..!

భార్యాభర్తలు ఎంత ప్రేమగా ఉన్నా.. అప్పుడప్పుడు ఇద్దరి మధ్య గొడవలు జరగడం, ఆయా విషయాల్లో భేదాభిప్రాయాలు తలెత్తడం సహజం. అయితే వీటిని సామరస్యంగా పరిష్కరించుకొని తిరిగి కలిసిపోతే సరే సరి.. అలాకాకుండా చిన్న విషయాన్నే భూతద్దంలో పెట్టి చూడడం వల్ల దూరం పెరగడం తప్ప మరే ప్రయోజనం ఉండదు. ఇలా ఇద్దరి మధ్య వచ్చిన ఎడం.. వారి లైంగిక జీవితంపైనా ప్రతికూల ప్రభావం చూపుతుంది.. శృంగార ఆసక్తిని తగ్గిస్తుంది. అందుకే దేన్నైనా తెగే దాకా లాగడం సరికాదంటున్నారు నిపుణులు. కాబట్టి జరిగిన గొడవ గురించి ఇద్దరూ కలిసి చర్చించుకోవాలి. తప్పు చేసిన వారు క్షమాపణ కోరడం, అవతలి వారు క్షమించడం, మరోసారి ఇలాంటి పొరపాటు పునరావృతం కాకుండా చూసుకుంటామని ఒకరికొకరు ప్రమాణం చేసుకోవడం.. ఇవన్నీ గొడవ కారణంగా దంపతుల మధ్య పెరిగిన దూరాన్ని తగ్గించేవే! నిజానికి ఇలా గొడవ తర్వాత తిరిగి ఒక్కటైనప్పుడు ఇద్దరి మధ్య ప్రేమ మరింతగా పెరుగుతుంది. తద్వారా వారి మధ్య సాన్నిహిత్యమూ రెట్టింపవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్