Updated : 17/05/2022 16:34 IST

తన ప్రతిభకు ‘రోడ్స్’ స్కాలర్‌షిప్!

(Photo: Twitter)

చదువులో తాము కనబరిచే ప్రతిభతో ఎన్నో అవార్డులు, రివార్డులే కాదు.. అరుదైన స్కాలర్‌షిప్‌లూ గెలుచుకుంటారు కొందరు అమ్మాయిలు. తద్వారా అంతర్జాతీయంగా ఉన్న ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీల్లో ఉచితంగా చదువుకునే అద్భుతమైన అవకాశం అందుకుంటారు. కోల్‌కతాకు చెందిన 19 ఏళ్ల రితికా ముఖర్జీని కూడా అలాంటి అదృష్టమే వరించింది. ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన గ్రాడ్యుయేట్‌ స్కాలర్‌షిప్‌గా పేరుగాంచిన రోడ్స్‌ స్కాలర్‌షిప్‌కి ఇటీవలే ఎంపికైందామె. తద్వారా మన దేశం నుంచి ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది. ఈ క్రమంలో ప్రతిష్ఠాత్మక ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో పీజీ చేసే మహదవకాశం సొంతం చేసుకుంది రితిక.

రోడ్స్‌ స్కాలర్‌షిప్‌.. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో చేరడం కోసం అంతర్జాతీయంగా ప్రతిభ కనబరిచే విద్యార్థులకు అందించే పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ అవార్డు ఇది! 1903 నుంచి ఇవ్వడం ప్రారంభించిన ఈ స్కాలర్‌షిప్‌కు ప్రపంచంలోనే అతి పురాతనమైన స్కాలర్‌షిప్‌గా పేరుంది. ఇప్పటికే ఈ ఉపకార వేతనం అందుకున్న పలువురు.. రాజకీయ నాయకులుగా, విద్యావేత్తలుగా, శాస్త్రవేత్తలుగా, రచయితలుగా, వైద్యులుగా, వ్యవస్థాపకులుగా, నోబెల్‌ బహుమతి విజేతలుగా.. ఇలా వివిధ రంగాల్లో అత్యున్నత శిఖరాల్ని అధిరోహించారు. ఇలాంటి అరుదైన స్కాలర్‌షిప్‌కు ఈ ఏడాది భారత్‌ నుంచి ఐదుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. వారిలో 19 ఏళ్ల రితికా ముఖర్జీ ఒకరు. ఈ ఐదుగురిలో ఆమే పిన్న వయస్కురాలు కావడం విశేషం.

అలా పరిశోధనలంటే ఇష్టం పెరిగింది!

కోల్‌కతాలో పుట్టి దిల్లీలో పెరిగిన రితిక.. ప్రస్తుతం దిల్లీలోని మిరందా హౌస్‌ కళాశాలలో బీఎస్సీ (జంతుశాస్త్రం) ఫైనలియర్‌ చదువుతోంది. నిద్ర, నిద్రకు సంబంధించిన అంశాలపై పరిశోధనలు చేయడమంటే మక్కువ చూపే ఆమె ప్రస్తుతం దానికి సంబంధించిన ఓ ప్రాజెక్ట్ పైనే పని చేస్తోంది. క్యాలిఫోర్నియా బీచుల్లో సంతానోత్పత్తి కోసం వచ్చే సీల్‌ ఏనుగుల నిద్ర విధానాలపై పరిశోధనలు సాగిస్తోంది రితిక. ఈ క్రమంలో క్యాలిఫోర్నియా యూనివర్సిటీలోని ఓ బృందంతో కలిసి ఆన్‌లైన్‌ వేదికగా పనిచేస్తోంది. అయితే పుస్తకాలు చదవడంపై తనకున్న ఆసక్తే తనను పరిశోధనల దిశగా నడిపించిందంటోందీ బుక్‌ లవర్‌. ‘మా అమ్మానాన్నలిద్దరికీ ప్రముఖ మీడియా సంస్థల్లో ఎడిటర్లుగా పనిచేసిన అనుభవం ఉంది. వాళ్ల వల్లే నాకూ చిన్నతనం నుంచి పుస్తకాలు చదవడమంటే ఇష్టం పెరిగింది. ఇదే నన్ను నిద్రకు సంబంధించిన అంశాలపై పరిశోధనలు చేసేలా పురిగొల్పింది. అలాగే స్కేటింగ్‌, సంగీతం వినడమన్నా నాకు ఆసక్తే!’ అంటోంది రితిక.

ముందున్న లక్ష్యాలివే!

రోడ్స్‌ స్కాలర్‌షిప్‌తో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో పీజీ చదివే అవకాశం దక్కించుకున్న రితిక.. ‘మల్టీడిసిప్లినరీ బయోసైన్సెస్‌ డాక్టొరల్‌ ట్రైనింగ్‌ పార్ట్‌నర్‌షిప్‌ ప్రోగ్రామ్‌’లో చేరేందుకు ఆసక్తి చూపుతోంది. వీటితో పాటు శరీర ధర్మ శాస్త్రం, శరీర నిర్మాణ శాస్త్రం, జన్యుశాస్త్రంలో Dphill, న్యూరోసైన్స్‌లో Msc, Dphill.. చదవడమే తన ధ్యేయమంటోంది.

‘ఈ కోర్సులన్నీ నా ఆసక్తులకు సరిగ్గా సరిపోతాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే మున్ముందు జంతువుల్లో శారీరక కార్యకలాపాలు క్షీణించిన స్థితి, నిద్ర.. వంటి విషయాలపై నా పరిశోధనల్ని మరింత విస్తరించాలనుకుంటున్నా.. ఇక మరోవైపు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ వాతావరణం నన్ను అమితంగా ఆకర్షిస్తోంది.. కొత్త స్నేహితుల్ని కలుసుకోవాలని, విభిన్న దేశాల సంస్కృతుల గురించి తెలుసుకోవాలని నా మనసు ఉవ్విళ్లూరుతోంది..’ అని చెబుతోంది రితిక.

ఆంత్రప్రెన్యూర్‌గానూ..!

చదువు, పరిశోధనలతో నిరంతరం బిజీగా ఉండే ఈ బ్రిలియంట్‌ స్టూడెంట్.. InVolMEnt (ఇంటర్న్‌షిప్స్‌, వలంటీరింగ్‌, మెంటార్‌షిప్‌, ఆంత్రప్రెన్యూర్‌షిప్‌) అనే సంస్థను స్థాపించింది. డిగ్రీ విద్యార్థుల్లో ఆయా విషయాల్లో పని అనుభవం పెంచి.. తద్వారా వారికి మరెన్నో ఉపాధి అవకాశాల్ని అందుబాటులోకి తీసుకురావడమే ఈ సంస్థ ముఖ్యోద్దేశం. ఇక తాను ఎంపికైన స్కాలర్‌షిప్‌కు ప్రతిభ ఎంత ముఖ్యమో.. మర్యాద, కృతజ్ఞతా భావం, నిజాయతీ, వినయ విధేయతలు.. వంటి వ్యక్తిగత అంశాల్ని మన పనితనంతో ప్రదర్శించడమూ అంతే ముఖ్యమంటోందీ రోడ్స్‌ స్కాలర్‌. మొదట్నుంచి మనం నేర్చుకున్న ఈ ప్రాథమిక విషయాలే ఈ పోటీ ప్రపంచంలో మనల్ని ప్రత్యేకంగా నిలబెడతాయంటోంది రితిక.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని