Intimacy Tips: దాంపత్య బంధాన్ని ఆస్వాదించాలంటే..!

చక్కటి శృంగార జీవితమే దృఢమైన దాంపత్య బంధానికి బాటలు వేస్తుందని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే వ్యక్తిగత-వృత్తిపరమైన ఒత్తిళ్లు, ఆలుమగల మధ్య తలెత్తే భేదాభిప్రాయాలు.. ఎన్నో జంటల్ని లైంగిక జీవితానికి దూరం చేస్తున్నాయని పలు అధ్యయనాలు.....

Updated : 27 Apr 2022 20:24 IST

చక్కటి శృంగార జీవితమే దృఢమైన దాంపత్య బంధానికి బాటలు వేస్తుందని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే వ్యక్తిగత-వృత్తిపరమైన ఒత్తిళ్లు, ఆలుమగల మధ్య తలెత్తే భేదాభిప్రాయాలు.. ఎన్నో జంటల్ని లైంగిక జీవితానికి దూరం చేస్తున్నాయని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అంతేకాదు.. శృంగారానికి ముందు, తర్వాత.. తెలిసో, తెలియకో చేసే కొన్ని పొరపాట్లు/అలవాట్లు కూడా ఇద్దరి మధ్య అనుబంధాన్ని దెబ్బ తీస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే దంపతులిద్దరూ సన్నిహితంగా మెలిగే క్రమంలో కొన్ని అంశాలపై దృష్టి సారించడం చాలా ముఖ్యమంటున్నారు.

వ్యక్తిగత పరిశుభ్రత.. అందుకే!

వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్యానికే కాదు.. శృంగారాన్ని పూర్తిగా ఆస్వాదించడానికీ తోడ్పడుతుందని చెబుతున్నాయి పలు అధ్యయనాలు. అయితే కొంతమంది ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని.. తద్వారా ఆరోగ్యపరంగా వివిధ రకాల సమస్యలు కొనితెచ్చుకుంటున్నారని పేర్కొంటున్నాయి. అలాగే వ్యక్తిగత పరిశుభ్రత లోపించినట్లయితే దాని ప్రభావం దాంపత్య జీవితం పైన పడే అవకాశమూ లేకపోలేదు. ఈ క్రమంలో- శృంగారానికి ముందు శుభ్రంగా స్నానం చేయడం మంచిది. వీలైతే పరిమళాలు వెదజల్లే నూనెల్ని నీటిలో కలుపుకొంటే మరింత తాజాగా ఉండచ్చు. ఇక ఆ తర్వాత కూడా వ్యక్తిగత భాగాల్ని గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.

ఆహారం.. అమితంగా వద్దు!

రోజంతా వివిధ రకాల పనుల రీత్యా.. లైంగిక జీవితాన్ని ఆస్వాదించడానికి రాత్రుళ్లు సమయం కేటాయిస్తుంటారు చాలామంది. అయితే అంతకంటే ముందు కడుపు నిండా ఆహారం లాగించేస్తుంటారు. నిజానికి ఇది ఆయాసానికి దారి తీస్తుంది. తద్వారా ఏ పని చేయడానికీ శరీరం సహకరించదు. అందుకే తేలికపాటి ఆహారం, అది కూడా తక్కువ మొత్తంలో తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. అది కూడా శృంగార సామర్థ్యాన్ని పెంచే అవిసె గింజలు, డార్క్‌ చాక్లెట్‌, మాంసం, చేపలు.. వంటి వాటికి ప్రాధాన్యమివ్వాలి. ఇవి లైంగిక భాగాలకు రక్తప్రసరణను ప్రేరేపించి తద్వారా కలయికను ఆస్వాదించేలా చేస్తాయి. ఇక శృంగారం సమయంలో కోల్పోయిన శక్తిని తిరిగి పొందాలంటే సబ్జా గింజలు, విటమిన్‌-సి ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలతో పాటు శారీరక నొప్పుల్ని దూరం చేసుకోవడానికి అరటిపండ్లు మేలు చేస్తాయి.

మీకు ఈ వ్యసనం ఉందా?

భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని దెబ్బతీసే అంశాల్లో మొబైల్‌ ముందు వరుసలో ఉంటుందంటున్నారు నిపుణులు. తమ వద్దకు కౌన్సెలింగ్‌/చికిత్స కోసం వచ్చే జంటల్లో చాలామందిలో ఇదో వ్యసనంలా పరిణమించినట్లు చెబుతున్నారు. ఇలా మీరు ఫోన్‌తో గడుపుతుంటే మీ భాగస్వామిలో ఒక రకమైన అసహనం ఆవహిస్తుంది. ఇది ఇద్దరి మధ్య గొడవలకు కారణమవుతుంది. కాబట్టి అవతలి వారి సహనాన్ని పరీక్షించకుండా ఇలాంటి గ్యాడ్జెట్లన్నీ పడకగది బయటే పెట్టేయడం మంచిది. తద్వారా ఒకరితో ఒకరు సన్నిహితంగా మెలిగే సమయం దొరుకుతుంది. శృంగారాన్ని ఆస్వాదించాలంటే ఈ సాన్నిహిత్యమే కావాలంటున్నారు నిపుణులు.

కొత్తగా..

శృంగారమంటే నచ్చినా, నచ్చకపోయినా.. రోజూ చేసే ఓ పనిలా భావిస్తుంటారు కొంతమంది. ఇలాంటి భావన కలిగిందంటే.. కలయిక బోర్‌ కొట్టిందనే అర్థం చేసుకోవాలంటున్నారు నిపుణులు. తద్వారా దాన్ని పూర్తిగా ఆస్వాదించలేరు. అందుకే ఈ విషయంలో సాధ్యమైనంతవరకు కొత్తదనానికి, సృజనాత్మకతకు ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే పరస్పరం ఒకరి ఫ్యాంటసీలు మరొకరితో పంచుకోవడం, శృంగారానికి సంబంధించిన అనుభవాలను ఒకరితో ఒకరు చెప్పుకోవడం.. మొదలైన వాటి వల్ల ఇద్దరి మధ్య సాన్నిహిత్యం మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది.

ఎవరికి వారే ఏంజెల్స్!

శృంగారాన్ని, శరీరాన్ని ముడిపెడుతుంటారు కొంతమంది. ఈ క్రమంలో సన్నగా ఉన్నామనో, లావనో, చర్మ ఛాయ తక్కువనో.. ఇలా తమ శరీరాన్ని చూసుకొని ఆత్మన్యూనతకు గురవుతుంటారు. ఈ భావన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడమే కాదు.. లైంగికాసక్తి క్రమంగా సన్నగిల్లేలా చేస్తుందంటున్నారు నిపుణులు. అందుకే ఇలాంటి ఆలోచనలన్నింటికీ స్వస్తి చెప్పి మొదట మిమ్మల్ని మీరు అంగీకరించాలి. తద్వారా మీపై మీకు ప్రేమ పెరుగుతుంది. అప్పుడే భాగస్వామి కూడా ఆకర్షితులు కావడానికి అవకాశం ఉంటుంది. ఇద్దరి మధ్య లైంగిక కోరికలు చిగురించడానికి ఇదీ ముఖ్యమే అంటున్నారు నిపుణులు.

ఇవన్నీ చాలామందికి తెలిసినవే కావచ్చు.. కానీ చాలామంది వీటి విషయంలో నిర్లక్ష్యం వహిస్తుంటారు. కాబట్టి ఇక నుంచైనా అలా చేయకుండా జాగ్రత్తపడితే లైంగిక జీవితాన్ని ఆస్వాదించచ్చు.. తద్వారా మీ అనుబంధాన్నీ దృఢం చేసుకోవచ్చు..!
మరో విషయం.. ఇంత చేసినా లైంగిక జీవితాన్ని ఆస్వాదించలేకపోతున్నా, శృంగారం విషయంలో ఏదైనా ఇబ్బంది ఎదురవుతున్నా, ఇతర సమస్యలతో బాధపడుతున్నా.. ఆలస్యం చేయకుండా నిపుణుల్ని సంప్రదిస్తే సత్వరమే పరిష్కరించుకోవచ్చు. తద్వారా ఇద్దరి మధ్య దూరం ఏర్పడకుండా ముందే జాగ్రత్తపడచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని