కరోనా వేళ సింపుల్ వేడుకలకు.. సింపుల్ లెహెంగాలు!

అసలే కరోనా కాలం.. ఇలాంటి సమయంలో ఎవరింట్లో వేడుకైనా, ఎంతపెద్ద శుభకార్యమైనా తక్కువమంది అతిథులతో సింపుల్‌గా ముగించేస్తున్నారు. మరి, ఇలా నిరాడంబరంగా జరిగే వేడుకకు భారీగా ముస్తాబై వెళ్తే అస్సలు బాగోదు.. అందుకే అమ్మాయిలంతా సింప్లిసిటీని కోరుకుంటున్నారు. అయితే సాధారణంగా శుభకార్యమైనా, పార్టీ అయినా, వేడుకైనా.. చాలామంది అమ్మాయిలు ఎంచుకునేది లెహెంగాలే!

Updated : 08 Jul 2021 19:50 IST

అసలే కరోనా కాలం.. ఇలాంటి సమయంలో ఎవరింట్లో వేడుకైనా, ఎంతపెద్ద శుభకార్యమైనా తక్కువమంది అతిథులతో సింపుల్‌గా ముగించేస్తున్నారు. మరి, ఇలా నిరాడంబరంగా జరిగే వేడుకకు భారీగా ముస్తాబై వెళ్తే అస్సలు బాగోదు.. అందుకే అమ్మాయిలంతా సింప్లిసిటీని కోరుకుంటున్నారు. అయితే సాధారణంగా శుభకార్యమైనా, పార్టీ అయినా, వేడుకైనా.. చాలామంది అమ్మాయిలు ఎంచుకునేది లెహెంగాలే! అందులోనూ ప్రస్తుత పరిస్థితుల్లో సింపుల్‌గా జరిగే ఫంక్షన్లు, పార్టీలకు అంతే సింపుల్‌గా ఉండే లెహెంగాలను ఎంచుకుంటేనే అందం, సౌకర్యం! అలాంటి స్వీట్‌ అండ్‌ సింపుల్‌ లెహెంగాలే ఇవి!

లెహెంగాకు పూలందం!

ఫ్లోరల్‌ ఫ్యాషన్‌.. ఇప్పుడిదే ట్రెండ్‌! కుర్తా దగ్గర్నుంచి చీరల దాకా.. అతివలు ఏది ఎంచుకున్నా సరే.. విభిన్న పూల ప్రింట్‌తో రూపొందించిన దుస్తులకే ప్రాధాన్యమిస్తున్నారు. పైగా ప్రస్తుత కరోనా ప్రతికూల పరిస్థితుల్లో నిరాడంబరంగా జరిగే వేడుకలు/శుభకార్యాల కోసమైతే ఇవి చక్కగా నప్పుతాయి కూడా! వీటిలోనూ పెద్ద పెద్ద పూలు, చిన్న పూలు, ఆకులు.. ఇలా ఒక పూల తీగే దుస్తులపై అల్లుకుందా అన్నంత అందంగా ఈ ప్రింట్లు లెహెంగాలకు వన్నె తెస్తున్నాయని చెప్పడం అతిశయోక్తి కాదు. అయితే వీటిని ఎంచుకునే క్రమంలో కాస్త జాగ్రత్త వహించాలంటున్నారు ఫ్యాషన్‌ నిపుణులు. ఎందుకంటే కొందరికి పెద్ద పరిమాణంలో ఉండే పూలు నప్పచ్చు.. మరికొందరికి చిన్న ప్రింట్స్‌ అందాన్ని తీసుకురావచ్చు.. కాబట్టి మీరు ఎంచుకునే ప్రింట్స్‌ పూర్తిగా మీకు నప్పేలా ఉన్నప్పుడే లెహెంగా సోయగం మీలో ఉట్టిపడుతుంది. ఇక బ్లౌజ్‌ కూడా మ్యాచింగ్‌ వేసుకోవచ్చు.. లేదంటే పూల రంగుల్లో హైలైట్‌ అయిన కలర్‌ ఎంచుకొని ప్లెయిన్‌గానైనా కుట్టించుకోవచ్చు.


ఆర్గంజాతో అదుర్స్!

ప్రస్తుతం మగువల మనసు దోచుకుంటోన్న ఫ్యాబ్రిక్స్‌లో ఆర్గంజా ఒకటి. ఉల్లిపొరలా పల్చగా, గుబురుగా, తక్కువ బరువుండే ఈ క్లాత్‌తో రూపొందించిన చీరలు, లెహెంగాలు, లాంగ్‌ ఫ్రాక్స్‌, అనార్కలీ.. వంటి దుస్తులు అతివలకు సరికొత్త అందాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఇక సింపుల్‌గా జరుపుకొనే వేడుకలో మిమ్మల్ని మరింత ప్రత్యేకంగా నిలబెడతాయివి! కాబట్టి నిరాడంబరంగా జరుపుకొనే పార్టీలు, శుభకార్యాల కోసం ఆర్గంజా లెహెంగాను ఎంచుకోవడం మంచిదని చెబుతున్నారు నిపుణులు. ఇక వీటిలోనూ ఫ్లోరల్‌, జామెట్రిక్‌ లైన్స్‌, డిజిటల్ ప్రింట్స్‌, ఎంబ్రాయిడరీ చేసినవి.. ఇలా విభిన్న డిజైన్లలో లభిస్తున్నాయి. మీకు నప్పిన, నచ్చిన ప్రింటెడ్‌ క్లాత్‌ని ఎంచుకొని మీరే స్వయంగా లెహెంగా కుట్టించుకోవచ్చు.. లేదంటే రెడీమేడ్‌గా దొరుకుతోన్న వాటిని సైతం ఎంచుకోవచ్చు.


కుర్తా-లెహెంగాతో కట్టిపడేయండి!

వేడుక సింపుల్‌గానే జరిగినా.. అందరిలోకెల్లా కాస్త ప్రత్యేకంగా, లెహెంగాలోనూ వైవిధ్యాన్ని ప్రదర్శించాలంటే అందుకు కుర్తా-లెహెంగా సరైనదని చెబుతున్నారు ఫ్యాషనర్లు. వీటితో ఇటు సంప్రదాయబద్ధంగా కనిపిస్తూనే, అటు కాస్త మోడ్రన్‌ లుక్‌లో మెరిసిపోవచ్చు.. నడుము కూడా కవరయ్యేలా అదనంగా సౌకర్యాన్ని సైతం అందిస్తాయివి. ఇక వీటిలోనూ పట్టు తరహావి, ఫ్లోరల్‌, ఎంబ్రాయిడరీ, రా మ్యాంగో.. ఇలా మనకు కావాల్సినన్ని వెరైటీలు లభిస్తున్నాయి. అంతేకాదు.. కుర్తాలో కూడా షార్ట్‌, పెప్లమ్‌, అసిమెట్రిక్‌, స్లిట్‌.. వంటి విభిన్న మోడల్స్‌లో అందుబాటులో ఉన్నాయి. అలాగే కుర్తా-లెహెంగా రెండూ మ్యాచింగ్‌గానైనా లేదంటే అపోజిట్‌ రంగుల్లో ఉన్నవైనా ఎంచుకోవచ్చు.


క్రాప్‌టాప్‌ను జోడించండి!

లెహెంగా ధరించినా మోడ్రన్‌గా మెరిసిపోవాలనుకునే అమ్మాయిలూ లేకపోలేదు. అలాంటి వారు బ్లౌజ్‌, దుపట్టాతో పని లేకుండా లెహెంగాకు నప్పే క్రాప్‌టాప్‌ను జత చేయచ్చు. ఇక దుపట్టా లేదు కదా నడుం కనిపిస్తే బాగోదేమో అనుకునే వారు కాస్త పొడవాటి క్రాప్‌టాప్‌ను ఎంచుకోవచ్చు. ఈ క్రమంలో లెహెంగాపై కాస్త హెవీ ప్రింట్స్‌, ఎంబ్రాయిడరీ ఉన్నట్లయితే ఆ రంగులకు మ్యాచింగ్‌గా ఉండే ప్లెయిన్‌ క్రాప్‌టాప్‌ చక్కగా నప్పుతుంది.. అయితే ప్లెయిన్‌గా కాకుండా క్రాప్‌టాప్‌ మరింత ట్రెండీగా కనిపించాలంటే దానికి రఫుల్స్‌, కోల్డ్‌ షోల్డర్‌, కేప్‌ స్లీవ్స్‌.. ఆలోచించాలే గానీ ఇలా క్రాప్‌టాప్‌కు వన్నెలద్దేందుకు బోలెడన్ని ఆప్షన్లున్నాయి..


యాక్సెసరీస్‌ కూడా సింపుల్‌గానే!

మనం ధరించే దుస్తులకు అనుగుణంగా ఉండే యాక్సెసరీస్‌ను ఎంచుకున్నప్పుడే అందం ఇనుమడిస్తుందంటున్నారు నిపుణులు. అందుకే సింపుల్‌ లెహెంగాల పైకి ధరించే ఆభరణాలు కూడా సింపుల్‌గా ఉంటేనే మంచిదని చెబుతున్నారు. ఈ క్రమంలో ఓ నెక్‌పీస్‌, చెవిదిద్దులు, ఓ చేతికి గడియారం, మరో చేతికి గాజు/హ్యాండ్‌కఫ్‌/బ్రేస్‌లెట్‌.. ఇలా మీకు నప్పినవి ఎంచుకోవచ్చు. అయితే ఈ ఆభరణాల్లో కూడా కాస్త మోడ్రన్‌ లెహెంగా అయితే మ్యాచింగ్‌ త్రెడ్‌ జ్యుయలరీ ఎంచుకోవచ్చు.. అదే కాస్త సంప్రదాయబద్ధంగా ఉండే లెహెంగా వేసుకుంటే దాని పైకి బంగారు ఆభరణాలు బాగుంటాయి. ఇక తక్కువ మేకప్‌, వదులైన హెయిర్‌స్టైల్‌/పోనీటెయిల్‌/సింపుల్‌ హెయిర్‌ యాక్సెసరీస్‌తో ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చారంటే వేడుకలో మీరే ప్రత్యేక ఆకర్షణగా నిలవచ్చు.
ఇక ముస్తాబంతా పూర్తయ్యాక.. వేడుకకు వెళ్లే ముందు మ్యాచింగ్‌ మాస్క్‌ ధరించడం మాత్రం మర్చిపోవద్దు.. ఎందుకంటే కరోనా ఇంకా మన చుట్టే ఉందన్న విషయం గుర్తు పెట్టుకోండి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్