ఇమ్యూనిటీ కోసం.. ఈ మువ్వన్నెల పదార్థాలు!

ఇమ్యూనిటీని పెంచే చాలా రకాల కాయగూరలు, పండ్లు మన జెండా రంగుల్ని పోలి ఉంటాయన్న విషయం అంతగా గమనించి ఉండరు కదూ! అవును.. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ.. ఇలా జెండా రంగుల్లో ఉన్న కాయగూరల్లో-పండ్లలో బోలెడన్ని పోషకాలు దాగున్నాయి. అవి మన రోగ నిరోధక శక్తినీ మెరుగుపరుస్తాయి....

Published : 15 Aug 2023 12:03 IST

మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు వివిధ రకాల పదార్థాలను మనం రోజూ తీసుకుంటూనే ఉంటాం. కానీ వాటి రంగుల్ని మీరెప్పుడైనా సునిశితంగా పరిశీలించారా? ఇమ్యూనిటీని పెంచే చాలా రకాల కాయగూరలు, పండ్లు మన జెండా రంగుల్ని పోలి ఉంటాయన్న విషయం అంతగా గమనించి ఉండరు కదూ! అవును.. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ.. ఇలా జెండా రంగుల్లో ఉన్న కాయగూరల్లో-పండ్లలో బోలెడన్ని పోషకాలు దాగున్నాయి. అవి మన రోగ నిరోధక శక్తినీ మెరుగుపరుస్తాయి. మరి, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇమ్యూనిటీని పెంచే ఆ మువ్వన్నెల పదార్థాలేంటో తెలుసుకుందామా?

కాషాయం:

కమలాపండు
ఆరెంజ్ కలర్‌లో నిగనిగలాడుతూ, చూడగానే నోరూరేలా ఉండే ఈ పండులో విటమిన్ ‘సి’ సమృద్ధిగా లభిస్తుంది. ఇది మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ పటిష్టమయ్యేందుకు దోహదం చేస్తుంది. అలాగే ఈ పండు శరీరంలో కొలాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. బీపీ, షుగర్ ఉన్న వాళ్లకు కూడా ఇది చక్కటి ఆహారం అని చెబుతున్నారు నిపుణులు.

టొమాటో
టొమాటోలో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే శరీర కణాల్ని డ్యామేజ్ చేసే ఫ్రీరాడికల్స్‌తో పోరాడే శక్తి లైకోపీన్ సొంతం. తద్వారా చర్మ ఆరోగ్యాన్ని ప్రేరేపిస్తుందీ యాంటీ ఆక్సిడెంట్. అలాగే ఇందులోని ‘ఎ’, ‘బి’ విటమిన్లు గుండె ఆరోగ్యానికి మంచివి. టొమాటోలోని విటమిన్ ‘సి’ రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఒత్తిడి హార్మోన్లను తగ్గించడానికి దోహదం చేస్తుంది. కాబట్టి టొమాటోను ప్రతి కూరలోనూ భాగం చేసుకోవచ్చు.. సలాడ్స్‌లోనూ తీసుకోవచ్చు.

క్యారట్
సీజన్ మారే కొద్దీ జలుబు, దగ్గు.. వంటి ఫ్లూ లక్షణాలు వేధించడం కామనే. మన శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడమే అందుకు కారణం. మరి, దాన్ని పెంచుకోవాలంటే క్యారట్ తీసుకోవడం తప్పనిసరి. క్యారట్‌లో ఉండే విటమిన్ ‘సి’ ఇందుకు బాగా తోడ్పడుతుంది. అయితే దీన్ని జ్యూస్ రూపంలో తీసుకుంటే మరీ మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇక జీవక్రియల పనితీరును మెరుగుపరచుకోవడానికి, కంటి ఆరోగ్యానికి, చర్మ సంరక్షణకు, శరీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వును కరిగించడానికి.. ఇలా చాలా రకాలుగా క్యారట్ మన ఆరోగ్యానికి అవసరం.

గుమ్మడి
విటమిన్ ‘ఎ’ మన శరీరంపై దాడి చేసే ఇన్ఫెక్షన్లతో పోరాడి.. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహకరిస్తుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. గుమ్మడిలో అధికంగా లభించే బీటా-కెరోటిన్‌ను మన శరీరం విటమిన్ ‘ఎ’గా మార్చుకుంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అలాగే ‘సి’, ‘బి2’, ‘ఇ’.. వంటి విటమిన్లతో పాటు ప్రొటీన్లు, ఖనిజాలు దీనిలో పుష్కలంగా లభిస్తాయి. ఇవన్నీ సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడంలో సహకరిస్తాయి. కాబట్టి హల్వా, ఇతర కూరల్లో భాగం చేసుకుంటూ దీన్ని రోజూ ఆహారంలో తీసుకుంటే మంచిది.

తెలుపు:

వెల్లుల్లి
వెల్లుల్లి అంటేనే కొంతమంది చీదరించుకుంటారు. ఇక తప్పని పరిస్థితుల్లో కూరల్లో వేసుకున్నా.. దాని ఫ్లేవర్ కూరకు పడుతుంది కదా అనుకుంటారు. కానీ వెల్లుల్లిని పచ్చిగానే తినమని సలహా ఇస్తున్నారు నిపుణులు. ఇలా రోజుకో వెల్లుల్లి రెబ్బను నోట్లో వేసుకొని నమిలితే దాన్నుంచి అలిసిన్ అనే పదార్థం విడుదలవుతుంది. దీన్ని శరీరం గ్రహించి ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు వీలుగా రోగనిరోధక శక్తిని మెరుగుపరుచుకుంటుంది. అలాగే వైరస్‌తో పోరాడేందుకు రక్తంలో టి-సెల్స్‌ని పెంచడంలోనూ ఈ పదార్థం సహకరిస్తుంది.

పుట్టగొడుగులు
పుట్ట గొడుగుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహకరిస్తాయి. తద్వారా శరీరంపై ప్రతికూల ప్రభావం చూపే వైరస్‌లను రోగనిరోధక వ్యవస్థ సమర్థంగా ఎదుర్కొంటుంది. అలాగే ఈ సమ్మేళనాలు క్యాన్సర్ రాకుండా కాపాడడంతో పాటు, శరీర అవయవాల్లో వాపును తగ్గించేందుకూ దోహదం చేస్తాయి. ఈ పుట్టగొడుగుల్లోనూ విభిన్న రకాలున్నాయి. వాటితో వేర్వేరు రెసిపీలను తయారుచేసుకోవచ్చు. సలాడ్స్‌లోనూ భాగం చేసుకోవచ్చు.

పెరుగు
పెరుగులో ప్రొ-బయోటిక్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవే శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి దోహదం చేస్తాయి. అలాగే ఇందులో అధిక మొత్తంలో లభించే ప్రొటీన్, విటమిన్ ‘ఎ’, జింక్.. వంటి పోషకాలు మన సంపూర్ణ ఆరోగ్యానికి అవసరం. అయితే పెరుగు తీసుకోమన్నారు కదా అని వెన్న ఎక్కువగా ఉండేది కాకుండా వెన్న లేని పెరుగే శ్రేష్టమని నిపుణులు సలహా ఇస్తున్నారు. దీన్ని నేరుగా తీసుకోవడం లేదంటే బెర్రీస్, నట్స్, తేనె.. వంటివి కలిపి కూడా తీసుకోవచ్చు.

ఆకుపచ్చ:

బ్రకలీ
ఎన్నో పోషకాలు మిళితమైన బ్రకలీ రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ దోహదం చేస్తుంది. కప్పు బ్రకలీలో ఒక కమలాపండులో ఉండేంత విటమిన్ ‘సి’ ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థ పటిష్టంగా మారేందుకు దోహదం చేస్తుంది. ఇక ఇందులో ఉండే బీటా కెరోటిన్, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఐరన్‌లతో పాటు బి-కాంప్లెక్స్ విటమిన్లన్నీ మన శరీరం ఎలాంటి అనారోగ్యం బారిన పడకుండా కాపాడతాయి. దీన్ని సలాడ్స్ రూపంలో తీసుకోవచ్చు.. లేదంటే కూరగానైనా తినొచ్చు.

ఆకుకూరలు
పాలకూర, తోటకూర, గోంగూర, కొత్తిమీర, కరివేపాకు, మెంతికూర.. వంటి ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరల్లో విటమిన్ ‘సి’, ‘కె’లతో పాటు ఫోలేట్ పుష్కలంగా లభిస్తుంది. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి దోహదం చేస్తాయి. అందుకే వీటిని కనీసం వారానికి రెండుసార్లైనా తీసుకోవాలి. అలాగే ప్రతి కూరలోనూ కొత్తిమీర, కరివేపాకు, మెంతికూర.. వంటివి ఉపయోగించి.. కూర తినేటప్పుడు వాటిని తీసిపడేయకుండా తినడం అలవాటు చేసుకుంటే మంచిది.

గ్రీన్ యాపిల్
రోగ నిరోధక శక్తిని పెంచడంలో విటమిన్ ‘ఎ’ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇలాంటి అద్భుతమైన విటమిన్ నిండి ఉన్న పండు గ్రీన్ యాపిల్. అలాగే ఇది కంటి చూపును మెరుగుపరచడానికి, ఎముకల ఆరోగ్యానికి, ముఖంపై మొటిమల సమస్యను తగ్గించడానికి.. ఇలా విభిన్న రకాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి గ్రీన్ యాపిల్‌ని నేరుగా తినొచ్చు.. లేదంటే దీంతో తయారుచేసిన జ్యూస్‌ని కూడా తాగచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్