Grecia Munoz: ఎవరీ ‘జొమాటో’ క్వీన్‌.. నెట్టింట్లో ఆమె గురించే చర్చంతా!

ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ ‘జొమాటో’ గురించి అందరికీ తెలిసిందే! దీన్ని స్థాపించిన దీపీందర్‌ గోయల్‌ ‘జొమాటో కింగ్‌’గా మనకు సుపరిచితుడే! అయితే ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ‘జొమాటో క్వీన్‌’ అన్న కొత్త పిలుపు వినిపిస్తోంది.. ఎక్కడ చూసినా ఆమె గురించే చర్చించుకుంటున్నారు.

Updated : 23 Mar 2024 21:32 IST

(Photos: Instagram)

ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ ‘జొమాటో’ గురించి అందరికీ తెలిసిందే! దీన్ని స్థాపించిన దీపీందర్‌ గోయల్‌ ‘జొమాటో కింగ్‌’గా మనకు సుపరిచితుడే! అయితే ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ‘జొమాటో క్వీన్‌’ అన్న కొత్త పిలుపు వినిపిస్తోంది.. ఎక్కడ చూసినా ఆమె గురించే చర్చించుకుంటున్నారు. ఇంతకీ జొమాటోకు, ఆమెకు సంబంధమేంటని ఆరా తీస్తే.. దీపీందర్‌ గోయల్‌ ఆ అమ్మాయిని వివాహమాడాడని.. అలా తాను జొమాటో క్వీన్‌ అయిందని.. సమాచారం! ఈ విషయాన్ని ఈ బిజినెస్‌ కపుల్‌ అధికారికంగా ప్రకటించకపోయినా.. ఆ అమ్మాయి ఇన్‌స్టా బయో కూడా పరోక్షంగా ఇదే విషయాన్ని చెబుతోందంటున్నారు నెటిజెన్లు. ఇంతకీ మన దీపీందర్‌ మనసు దోచుకున్న ఆ అమ్మాయి ఎవరు? ఏం చేస్తుంటుంది? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!

నా ఇల్లు ఇండియా!

‘జొమాటో’ పేరుతో ఓ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించి.. అంచెలంచెలుగా ఎదిగాడు దీపీందర్‌ గోయల్‌. దేశంలో తరచూ ప్రకటించే ధనవంతుల జాబితాల్లో చోటు దక్కించుకుంటూ వార్తల్లో నిలిచే ఈ జొమాటో కింగ్‌.. ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టాడట! ఇంతకీ వధువు ఎవరనేగా మీ సందేహం? ఆమె పేరు గ్రేసియా మునోజ్‌. మెక్సికోలో పుట్టి పెరిగిన ఈ అమ్మాయికి మన దేశమంటే వల్లమాలిన అభిమానమట! ఈ మక్కువతోనే పలుమార్లు భారత్ను సందర్శించిన ఆమె తన అందంతో దీపీందర్‌ మనసు దోచుకుంది. అలా వీళ్లిద్దరూ పెళ్లిపీటలెక్కినట్లు, గత నెలలో హనీమూన్‌కి కూడా వెళ్లొచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం! కాగా, ‘పుట్టింది మెక్సికోలో.. ఇప్పుడు నా ఇల్లు ఇండియానే!’ అని ఇన్‌స్టా బయోలో ఆమె పెట్టిన క్యాప్షన్‌ వీళ్ల పెళ్లి జరిగిందనడానికి మరింత బలం చేకూర్చుతోంది. అయితే దీపీందర్‌కు ఇది రెండో పెళ్లి. గతంలో కంచన్‌ జోషీని వివాహం చేసుకున్నాడాయన. ఐఐటీ దిల్లీలో చదువుకొనే సమయంలోనే వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం కంచన్‌ దిల్లీ యూనివర్సిటీలో గణిత ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.


ఫ్యాషన్‌ క్వీన్‌.. ట్రావెల్‌ లవర్!

జొమాటో సీఈఓ దీపీందర్‌తో గ్రేసియా వివాహం జరిగిందన్న వార్త బయటకు వచ్చినప్పట్నుంచి ఆమెను అందరూ ‘జొమాటో క్వీన్‌’ అంటూ పిలుస్తున్నారు. ఆమె గురించి మరింత లోతుగా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

⚛ గ్రేసియా మెక్సికోలో పుట్టి పెరిగింది. మోడలింగ్‌ రంగంలో కెరీర్‌ ప్రారంభించిన ఆమె.. టీవీ హోస్ట్‌గానూ కొనసాగుతోంది.

⚛ ఈ జొమాటో క్వీన్‌కు ట్రావెలింగ్‌ అంటే పిచ్చి. వీలు చూసుకొని కాదు.. సమయం కుదుర్చుకొని మరీ విదేశీ పర్యటనలకు చెక్కేస్తుంటుందట! అందులోనూ భారత్‌లో పర్యటించడమంటే తనకు భలే సరదా అంటోంది. దిల్లీ వీధుల్లో చక్కర్లు కొడుతూ దిగిన ఫొటోల్ని ‘దిల్లీ దర్శన్‌’ పేరుతో మొన్నామధ్య సోషల్‌ మీడియాలో పంచుకోగా అవి వైరల్‌గా మారాయి. ఇక బీచుల్ని, కొండ ప్రాంతాల్ని బాగా ఇష్టపడతానంటోంది గ్రేసియా.

⚛ సాహసాలు చేయడమంటే ఈ ముద్దుగుమ్మకు చాలా ఇష్టమట! పర్యటనల్లో భాగంగా ఎక్కడికెళ్లినా.. కొండలెక్కడం, స్కైడైవింగ్‌ వంటి సాహస క్రీడల్ని ఎక్కువగా ప్రయత్నిస్తుంటుందీ భామ.

⚛ ఫ్యాషనిస్టాగానూ గ్రేసియాకు పేరుంది. విభిన్న ఫ్యాషనబుల్‌ దుస్తులు ధరించి ముస్తాబవడం, కొత్త ఫ్యాషన్లను ప్రయత్నించడమంటే ఈ ముద్దుగుమ్మకు భలే ఇష్టమట! ఈ క్రమంలోనే తాను దిగిన ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ మురిసిపోయే ఈ మెక్సికన్‌ బ్యూటీ.. 2022లో యూఎస్‌లో నిర్వహించిన ‘మెట్రోపాలిటన్‌ ఫ్యాషన్‌ వీక్‌’ విజేతగానూ నిలిచింది.

⚛ ప్రస్తుతం ఓవైపు టీవీ హోస్ట్‌గా రాణిస్తూనే.. మరోవైపు వ్యాపార రంగంలోకీ అడుగుపెట్టింది గ్రేసియా. ఈ క్రమంలోనే ఓ విలాసవంతమైన ఉత్పత్తుల స్టార్టప్‌ని నిర్వహిస్తోందామె.

⚛ ఇలా తన వృత్తిలో ఎంత బిజీగా ఉన్నా సేవా కార్యక్రమాలకూ తగిన సమయం కేటాయిస్తుంటుందట గ్రేసియా. ఈ క్రమంలోనే విద్య, మహిళా సాధికారత, చిన్నారుల సంక్షేమం కోసం పాటుపడుతోన్న పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తోందట ఈ మెక్సికన్‌ బ్యూటీ.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్