ఎక్కడికి వెళ్లినా మొహం మాడ్చుకొని కూర్చుంటుంది..!

మాది ప్రేమ వివాహం. ఇంట్లో అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. మా అత్తయ్య వాళ్లు కూడా పెళ్లికి ఒప్పుకున్నందుకు చాలా సంతోషించాను. వాళ్లని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలనుకున్నాను.

Published : 10 Jan 2024 11:48 IST

మాది ప్రేమ వివాహం. ఇంట్లో అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. మా అత్తయ్య వాళ్లు కూడా పెళ్లికి ఒప్పుకున్నందుకు చాలా సంతోషించాను. వాళ్లని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలనుకున్నాను. కానీ ఆవిడ మాత్రం నన్ను చాలా బాధపెడుతోంది. ఎలా అంటే నా భర్తతో ఎక్కువ సమయం గడపనివ్వదు. మేమిద్దరం ఎక్కడికైనా వెళ్తే మొహం మాడ్చుకొని కూర్చుంటుంది. అలాగే నా భర్తతో కలిసి మా పుట్టింటికి వెళ్లినా పదే పదే నా భర్తకి ఫోన్‌ చేసి ఏదో ఒకటి అంటుంది. దాంతో నా భర్త నన్ను బయటికి, మా పుట్టింటికి తీసుకెళ్లడమే మానేశాడు. నా భర్త కూడా వాళ్ల మాటలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాడు. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లమంటే వద్దంటున్నాడు. కానీ, నా భర్తకు నేనంటే చాలా ఇష్టం. ఏకాంతంగా ఉన్నప్పుడు నాతో చాలా బాగా మాట్లాడతాడు. కానీ నలుగురిలో ఉన్నప్పుడు అస్సలు మాట్లాడరు. మా ఆయన మా అత్తింటి వాళ్లు చెప్పినట్లల్లా చేయడం కాస్త బాధగా అనిపిస్తోంది. నా బాధని ఆయనతో పంచుకుందామనుకుంటే ఏమనుకుంటారోనని భయంగా ఉంది. ఈ సందిగ్ధంలో ఏం చేయాలో పాలుపోవట్లేదు. సలహా ఇవ్వండి. - ఓ సోదరి

జ. ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు కొన్ని సమస్యలు రావడం సహజం. అయితే మీ ఇద్దరి మధ్య తగినంత సాన్నిహిత్యం, చనువు ఏర్పడలేదని మీ ఉత్తరం సూచిస్తోంది. మీరిద్దరూ మానసికంగా మరింత దగ్గరైనప్పుడు ఒకరి మనసులోని భావాలను మరొకరితో చెప్పుకోవడమనేది పెద్ద విషయమేమీ కాదు. అతను ఏమనుకుంటున్నాడో అన్న సంకోచం మీకు, మీతో చనువుగా ఉండడం వల్ల తన తల్లిదండ్రులు ఏమనుకుంటారో అన్న సంకోచం తనకు ఉన్నాయా? అన్న విషయాన్ని పరిశీలించండి. ఇది కూడా మీ మధ్య అగాథాలు సృష్టించే అవకాశం ఉంటుంది.

మీ భర్త మీతో ఏకాంతంగా ఉన్నప్పుడు బాగానే ఉంటున్నాడని చెబుతున్నారు. కాబట్టి, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే మీరు కొత్తగా పెళ్లైన జంట కాబట్టి వారాంతాల్లో లేదా సమయం కుదిరినప్పుడు బయటకు వెళ్లండి. అయితే ఇది వారికి ఆమోదయోగ్యం కాకపోయినా సమయం కుదిరినప్పుడు మీరు బయటకు వెళ్తారన్న విషయాన్ని, అలాగే మీరిద్దరూ చనువుగా ఉండాల్సినటువంటి అవసరాన్ని వాళ్లకు అర్ధమయ్యేలా వివరించండి.

అయితే ఇన్నేళ్లు ఆ అబ్బాయితో అలవాటైన వ్యవహారశైలి ఇప్పుడు ఒక్కసారిగా మారిపోవడం కూడా వారికి ఇబ్బందిగా అనిపించే అవకాశం లేకపోలేదు. అయితే అది కూడా జీవితంలో భాగమేనన్న విషయం వారికి చిన్న చిన్న చర్యల ద్వారా అవగాహన కల్పించే ప్రయత్నం చేయండి. అలాగే అతనితో కూడా భార్యతో కొంత వ్యక్తిగత సమయం గడపాలన్న విషయాన్ని తెలియజేయండి. అది మీ భవిష్యత్తుకి, పుట్టబోయే పిల్లలకు కూడా ఉపయోగపడుతుందని అర్థమయ్యేట్టుగా వివరించండి. దీనికోసం మీ బంధువుల్లో దాంపత్య బంధం దృఢంగా ఉన్న వారిని ఉదాహరణగా చూపించండి. తద్వారా సమస్యను పరిష్కరించుకోగలుగుతారేమో చూడండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్