తలస్నానానికీ పద్ధతుంది..!

జుట్టు కాస్త డల్‌గా, రఫ్‌గా కనిపించిన వెంటనే తలస్నానం చేయడం చాలామందికి అలవాటు. కానీ, అలా చేయడం మంచిదేనా? అసలు ఎన్ని రోజులకోసారి తలస్నానం చేయాలి? తలస్నానం చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే జుట్టుకి మంచిది?.. తెలుసుకుందాం రండి....

Published : 16 Aug 2023 12:45 IST

జుట్టు కాస్త డల్‌గా, రఫ్‌గా కనిపించిన వెంటనే తలస్నానం చేయడం చాలామందికి అలవాటు. కానీ, అలా చేయడం మంచిదేనా? అసలు ఎన్ని రోజులకోసారి తలస్నానం చేయాలి? తలస్నానం చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే జుట్టుకి మంచిది?.. తెలుసుకుందాం రండి..

ఎన్నిరోజులకోసారి చేస్తున్నారు?
వాతావరణ కాలుష్యం, దుమ్ము, ధూళి, పొగ.. ఇలా రకరకాల కారణాల వల్ల జుట్టు తొందరగా రఫ్‌గా, డల్‌గా మారిపోవడం సహజమే. అందుకే జుట్టు తిరిగి మృదువుగా, ఆరోగ్యంగా కనిపించాలని వెంటనే తలస్నానం చేసేస్తూ ఉంటాం. కానీ, అలా ఎన్నిరోజులకోసారి చేస్తున్నారో ఎప్పుడైనా గమనించారా? జుట్టు జిడ్డుగా ఉంటే నిపుణుల సలహా మేరకు రెండు రోజులకోసారి తలస్నానం చేయచ్చు.. ఒకవేళ మీది సాధారణ, పొడి జుట్టు అయితే.. వారానికి రెండుసార్లు మాత్రమే తలస్నానం చేయాల్సి ఉంటుంది. ఇలా ఎప్పుడు, ఎన్నిసార్లు చేసినా గాఢత తక్కువగా ఉండే షాంపూనే ఉపయోగించాలి.

తలస్నానానికీ పద్ధతుంది..
తలస్నానం చేయాలనుకునే ముందు జుట్టు చిక్కులు తీసి బాగా దువ్వుకోవాలి. దీనివల్ల తలస్నానం చేసేటప్పుడు జుట్టు రాలడం కొంతవరకు తగ్గించుకోవచ్చు. అలాగే బిరుసుగా ఉన్న వెంట్రుకలు కూడా తెగిపోకుండా ఉంటాయి. ముందుగా నీళ్లతో జుట్టుని బాగా తడపాలి. ఇప్పుడు నీళ్లలో షాంపూను కలుపుకొని.. ఈ మిశ్రమాన్ని తలపై పోసుకొని.. కుదుళ్లను రెండు నిమిషాల పాటు గుండ్రంగా రుద్దుతూ మసాజ్‌ చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఫలితంగా కుదుళ్లు బాగా శుభ్రపడి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. జుట్టు రాలిపోయే సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది.

గోరువెచ్చని నీరే..!
తలస్నానం చేసేటప్పుడు మరీ చల్లని లేదా బాగా వేడిగా ఉండే నీళ్లను ఉపయోగించకూడదు. ఇలా చేస్తే కుదుళ్ల లోపల ఉండే సెబేషియస్‌ గ్రంథులు దెబ్బతింటాయి. కాబట్టి ఆ ప్రాంతంలో జుట్టు పల్చగా అయిపోయి, తేమను కూడా కోల్పోతుంది. అందుకే తలస్నానానికి ఉపయోగించే నీళ్లు మరీ చల్లగా కాకుండా.. మరీ వేడిగా కాకుండా.. గోరు వెచ్చగా ఉండేలా చూసుకోవడం ఉత్తమం.

కండిషనర్‌తో ఫినిషింగ్‌ టచ్..
చాలామంది తలస్నానం చేశాక అక్కడితో పని పూర్తైపోయిందనుకుంటారు. కానీ, అన్నింటికంటే ముఖ్యమైంది.. తలస్నానం చేశాక జుట్టుకి కండిషనర్ రాసుకోవడం. కండిషనర్ రాసుకోవడం వల్ల చివర్లు చిట్లకుండా జాగ్రత్తపడచ్చు. అలాగే జుట్టు మృదువుగా, పట్టుకుచ్చులా మారుతుంది. కండిషనర్‌ వెంట్రుకల చివర్లను బ్లాక్‌ చేసి జుట్టు తేమను కోల్పోకుండా చేస్తుంది.

తడి తలను దువ్వకండి..
తలస్నానం చేసిన తర్వాత కుదుళ్లు బాగా మెత్తబడి ఉంటాయి. ఇలాంటి సమయంలో తల దువ్వితే ఎక్కువగా జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఎప్పుడూ తడి తలను దువ్వే ప్రయత్నం చేయకండి. ముందు బాగా ఆరబెట్టుకుని, ఆ తర్వాతే దువ్వుకోవాలి. అలాగే తడిగా ఉన్న తల తొందరగా ఆరిపోవాలని టవల్ పెట్టి తెగ తుడిచేస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. ఇలా చేస్తే జుట్టు నిర్జీవంగా మారిపోతుంది. అందుకే వీలైనంత వరకు జుట్టుని సహజంగానే ఆరనివ్వాలి. అలాగే తలను ఆరబెట్టుకోవడానికి డ్రయర్స్, బ్లోయర్స్.. వంటి ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం కూడా వీలైనంత తగ్గించేయడం మంచిది. వీటివల్ల జుట్టు సహజసిద్ధమైన తేమను కోల్పోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్