Updated : 01/10/2021 15:41 IST

60ల్లోనూ పిల్లల్ని కంటారట.. 120 ఏళ్లు బతుకుతారట!

యాభై దాటగానే ఆ నొప్పి, ఈ నొప్పి అంటూ మాత్రలేసుకుంటాం.. కానీ వాళ్లు ఒక్క మాత్రైనా మింగకుండానే 120 ఏళ్లు బతుకుతారట!

నలభై ఏళ్లకే మెనోపాజ్‌ ఛాయలు ఆవహిస్తాయి చాలామందిలో.. అలాంటిది వాళ్లు 60ల్లో కూడా పిల్లల్ని కంటారట!

వయసు మీద పడే కొద్దీ మన శరీరం మనకే బరువవుతుంటుంది.. అదే అక్కడైతే 90 దాటినా వారి శరీరం, మనసు ఉత్సాహంతో ఉరకలెత్తుతాయి.

ముప్ఫై దాటగానే ముఖంపై ముడతలు, గీతలే కనిపిస్తాయ్‌.. అదే 80 దాటినా వారి అందం చెక్కు చెదరట!

ఇంతకీ ఎవరబ్బా వాళ్లు.. అనుకుంటున్నారా? గిల్గిత్‌-బాల్టిస్తాన్‌ పర్వతాలపై నివసించే హంజా తెగకు చెందిన మహిళల గురించి మనం మాట్లాడుకుంటుంది! వయసు పెరుగుతున్నా వన్నె తరగని అందానికి, వృద్ధాప్యం పైబడుతున్నా తరిగిపోని ఉత్సాహానికి చిరునామాగా నిలుస్తున్నారీ కమ్యూనిటీ మహిళలు. అందుకే ప్రపంచంలోనే అత్యంత అందగత్తెలుగా, ఎక్కువ కాలం జీవించే వ్యక్తులుగా పేరుగాంచారు ఇక్కడి ప్రజలు. ఇదంతా చదువుతుంటే.. అసలు వీరి ఆరోగ్యం, అందం వెనకున్న ఆ రహస్యాలేంటో తెలుసుకోవాలనిపిస్తోంది కదూ! అయితే ఆలస్యం ఎందుకు.. రండి తెలుసుకుందాం..!

మనం రోజూ ఇంతలా కష్టపడేది.. సమయంతో పని లేకుండా కెరీర్‌ వెంట పరుగులు తీసేది.. ఎందుకు? కూడు, గూడు, గుడ్డ.. ఈ మూడింటి కోసమే కదా! అయితే డబ్బు మోజులో పడిపోయి చాలామంది తమ ఆహారపుటలవాట్లనే మార్చేసుకుంటారు.. బోలెడంత డబ్బు ఖర్చు పెట్టి హోటళ్లు, రెస్టరంట్లలో తింటే గానీ జీవితాన్ని ఆస్వాదించినట్లు కాదన్న భ్రమలో ఉంటారు. నిజానికి ఇలాంటి జీవనశైలే మనిషి సగటు ఆయుష్షును దెబ్బతీస్తుందని చెప్పచ్చు. అదే ఆరోగ్యకరమైన జీవనశైలిని మన రోజువారీ అలవాట్లలో భాగం చేసుకుంటే నిండు నూరేళ్ల జీవితాన్ని సంతోషంగా ఆస్వాదించవచ్చు. ఇదే విషయాన్ని నిరూపిస్తున్నారు హంజా తెగ ప్రజలు.

‘పచ్చి’గానే తింటారట!

గిల్గిత్‌-బాల్టిస్తాన్‌ పర్వతాలపై నివసించే హంజా తెగ వారికి ‘బురుషా తెగ’ అనే పేరు కూడా ఉంది. వయసుతో పాటు యవ్వనాన్ని, చురుకుదనాన్ని పెంచుకుంటూ పోయే ఈ ప్రజల జీవనశైలే వారి అందానికి, ఆరోగ్యానికి ముఖ్య కారణంగా చెప్పచ్చు. ఈ క్రమంలో వండినవి, ప్రాసెస్‌ చేసినవి అస్సలు ముట్టుకోరట ఇక్కడి ప్రజలు. ఎక్కువగా పండ్లు, పచ్చి కాయగూరలు తీసుకోవడానికి ఇష్టపడతారు. అది కూడా స్వయంగా, సహజసిద్ధంగా పండించుకొని మరీ తింటుంటారు. ముఖ్యంగా పాలు, పెరుగు, బార్లీ, తృణధాన్యాలు, బక్‌వీట్‌, గోధుమలు, మొలకెత్తిన గింజలు, ఎండు ఆప్రికాట్స్.. వంటివి ఇక్కడి ప్రజల ప్రధానాహారంగా చెప్పుకోవచ్చు. అలాగే హిమానీనదాల నుంచి వచ్చే స్వచ్ఛమైన నీటిని తాగడం వల్ల కూడా వీరు ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా ఉంటున్నారు.

‘ఉపవాసం’ ఇక్కడి ఆచారం!

రోజుకు రెండు పూటలు మాత్రమే.. అంటే మధ్యాహ్నం 12 గంటలకు అల్పాహారం, ఆపై రాత్రి భోజనం.. రోజూ ఇవే మెనూ టైమింగ్స్‌ని ఫాలో అవుతారట హంజా ప్రజలు. అయితే ఏడాదిలో మూడు నాలుగు నెలల పాటు నిరంతరాయంగా ఉపవాస దీక్ష చేపడతారట వారు. పైగా దీన్ని ఆచారంగా పాటిస్తుంటారు కూడా! ఈ క్రమంలో ఆప్రికాట్‌తో తయారుచేసిన రసాన్ని తప్ప వేరే పదార్థాలేవీ ఈ సమయంలో తీసుకోరు. ఇలా వారి ఆరోగ్య రహస్యాల్లో ఇది కూడా ఓ కీలకాంశం అని చెప్పచ్చు. ముఖ్యంగా ఆప్రికాట్‌లో అధికంగా ఉండే అమైగ్డాలిన్‌ అనే రసాయనిక సమ్మేళనం ఎలాంటి అనారోగ్యాలు మన దరిచేరకుండా మనల్ని కాపాడుతుంది. అంతేకాదు.. క్యాన్సర్‌ కారకాలతో పోరాడే శక్తి ఈ సమ్మేళనానికి ఉందని పలు పరిశోధనల్లో కూడా రుజువైంది. అందుకే ఉపవాసం చేయడం, ఆ సమయంలో ఈ పండ్ల రసాన్ని తీసుకోవడం అనేది చిన్నతనం నుంచే మొదలుపెడతారట అక్కడి ప్రజలు! కాబట్టే వయసు పెరుగుతున్నా ఎంతో చురుగ్గా ఉండడంతో పాటు ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా సగటున 120 ఏళ్లు ఆనందంగా, ఆరోగ్యంగా తమ జీవితాన్ని ఆస్వాదిస్తుంటారట హంజా తెగ వారు.

అందానికి ఆ ‘రెండూ’!

వయసు పెరుగుతున్న కొద్దీ చర్మం ముడతలు పడడం, ముఖంపై ముడతలు, గీతలు.. ఇలా వృద్ధాప్య ఛాయలు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటాయి. కానీ హంజా ప్రజలు అరవైల్లో ఉన్నా యవ్వనంగానే కనిపిస్తుంటారట! ఇందుకు వారు తీసుకునే ఆహారంతో పాటు తాగే ఈ సూపర్‌ డ్రింక్స్‌ కూడా కారణమే! అందులో ఒకటే ‘సాల్టీ టీ’. తుమురు అనే మూలికతో తయారుచేసే ఈ టీ తాగడం వల్ల నవయవ్వనంగా మెరిసిపోతుంటారు వారు. ఇందుకు తుమురులో యాంటీ-ఏజింగ్‌ గుణాలు పుష్కలంగా ఉండడమే కారణం! ఇక, అక్కడి ప్రదేశాలన్నీ సాధారణంగానే మంచుతో కప్పబడి ఉంటాయి.. అంతటి ఎముకలు కొరికే చలిలో సైతం చల్లటి నీళ్లతో స్నానం చేస్తుంటారట హంజా తెగ వారు. ఇలా చన్నీటి స్నానమే వారి అందాన్ని మరింతగా పెంచుతుందని చెబుతున్నాయి అక్కడి ప్రజలపై జరిపిన కొన్ని పరిశోధనలు.

అరవైల్లోనూ అమ్మవుతారు!

సాధారణంగా మహిళల్లో వయసు పెరిగే కొద్దీ అమ్మయ్యే అవకాశాలు క్రమంగా సన్నగిల్లుతుంటాయి. ఇందుకు వారిలో అండాల నిల్వ క్రమంగా తగ్గిపోవడమే కారణం! అంతేకాదు.. నలభైల్లోకి చేరకముందే కొందరు మెనోపాజ్‌ దశలోకీ ప్రవేశిస్తుంటారు. మరి, మన పరిస్థితి ఇలా ఉంటే హంజా తెగలో మాత్రం అరవై ఏళ్లు దాటిన ఆడవారు కూడా అమ్మగా ప్రమోషన్‌ పొందుతారట! ఆరోగ్యకరమైన సంతానానికి జన్మనిస్తారట! ఇందుకు వారు పాటించే ఆరోగ్యకరమైన జీవనశైలే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అంతేకాదు.. లేటు వయసులో లైంగిక జీవితం ఆస్వాదించేవారు మనలో చాలా తక్కువ మందే! కానీ హంజా ప్రజలు మాత్రం వయసు పెరుగుతున్నా శృంగార జీవితానికి ప్రాధాన్యమిస్తూ.. తాము ఇంత ఆరోగ్యకరంగా ఉండడానికి ఇదీ ఓ కారణమేనని నిరూపిస్తున్నారు.

సెంచరీ వయసులోనూ ఉత్సాహంగా..!

ఇక ఫిట్‌నెస్‌ విషయానికొస్తే.. నడక, వివిధ రకాల వ్యాయామాలు చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు హంజా ప్రజలు. అంతేకాదు.. వందేళ్లొచ్చినా ఏదో ఒక ఆట ఆడుతూ తమ శరీరంలోని సత్తువను పెంచుకుంటూ మనందరికీ ఫిట్‌నెస్‌ పాఠాలు నేర్పుతున్నారు. ఇక ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లకు చాలా వరకు దూరంగా ఉండే ఇక్కడి ప్రజలు పీల్చే గాలి కూడా ఎంతో స్వచ్ఛమైనది. ఎప్పుడూ పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటూ, ప్రకృతిలోని పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ.. ‘ప్రకృతిని మనం ప్రేమిస్తే.. అదీ మనల్ని ప్రేమిస్తుంది.. సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తుంది!’ అని తమ ఆరోగ్యకరమైన లైఫ్‌స్టైల్‌తో నిరూపిస్తున్నారు హంజా తెగ ప్రజలు.

తరగని అందానికి, పెరిగే ఆయుష్షుకు ఆరోగ్యకరమైన జీవనవిధానమే ప్రధాన కారణం అని నిరూపిస్తోన్న హంజా ప్రజల లైఫ్‌స్టైల్‌ గురించి తెలుసుకున్నారుగా! అందుకే వీరిని చూసి మనమూ స్ఫూర్తి పొందుదాం.. చెడు అలవాట్లను పక్కన పెట్టి ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లను, వ్యాయామాన్నీ అలవాటు చేసుకుందాం.. నిత్యం ఉత్సాహంగా, ఉల్లాసంగా జీవితాన్ని ఆస్వాదిద్దాం..!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి