చిటపట చినుకుల్లో కురులు పదిలమిలా!
ఎన్నిసార్లు శుభ్రం చేసుకున్నా ముఖం జిడ్డుగా మారడం, ఎంత దువ్వుకున్నా జుట్టు పిచ్చుక గూడులా తయారవడం.. వర్షాకాలంలో అధిక హ్యుమిడిటీ (వాతావరణంలో తేమ స్థాయులు పెరగడం) వల్ల తలెత్తే సమస్యలివి! ఇలాంటి వాతావరణాన్ని....
ఎన్నిసార్లు శుభ్రం చేసుకున్నా ముఖం జిడ్డుగా మారడం, ఎంత దువ్వుకున్నా జుట్టు పిచ్చుక గూడులా తయారవడం.. వర్షాకాలంలో అధిక హ్యుమిడిటీ (వాతావరణంలో తేమ స్థాయులు పెరగడం) వల్ల తలెత్తే సమస్యలివి! ఇలాంటి వాతావరణాన్ని ఎదుర్కొని అందాన్ని సంరక్షించుకోవడమంటే అంత ఈజీ కాదు. ముఖ్యంగా కుదుళ్లు జిడ్డుగా మారడం, జుట్టు రాలడం, గడ్డిలా తయారవడం.. వంటి కేశ సంబంధిత సమస్యలు ఈ కాలంలో అమ్మాయిలకు సవాలు విసురుతుంటాయి. అయితే జుట్టు ఆరోగ్యాన్ని సంరక్షించుకునే క్రమంలో కొన్ని చిట్కాలు పాటిస్తే హ్యుమిడిటీలోనూ కేశాలను పట్టులా మెరిపించచ్చని చెబుతున్నారు సౌందర్య నిపుణులు. మరి, ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం రండి!
వానలో తడిశారా?
వానలో తడవడమంటే అందరికీ ఇష్టమే.. ముఖ్యంగా అమ్మాయిలైతే వర్షాన్ని మరింతగా ఎంజాయ్ చేస్తారు. అయితే ఇలా తడిసిన తర్వాత జుట్టును అలాగే ఆరబెట్టుకోవడం మనలో చాలామందికి అలవాటు. కానీ అలా చేయకుండా చల్లటి నీటితో ఓసారి తలస్నానం చేసి జుట్టు ఆరబెట్టుకోమంటున్నారు నిపుణులు. ఎందుకంటే సాధారణంగానే వర్షపు నీటిలో కొన్ని ఆమ్ల గుణాలుంటాయట! అసలే ఈ కాలంలో హ్యుమిడిటీ వల్ల కుదుళ్లు జిడ్డుగా మారి వివిధ రకాల ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. వీటికి ఈ ఆమ్ల గుణాలు తోడవడం వల్ల సమస్య మరింత పెరుగుతుందని, అందుకే వర్షంలో తడిసిన తర్వాత శుభ్రంగా తలస్నానం చేసి జుట్టును పొడిగా ఆరబెట్టుకోవాలని సూచిస్తున్నారు. తద్వారా వర్షంలో తడిసినా జుట్టు ఆరోగ్యం దెబ్బతినకుండా జాగ్రత్తపడచ్చు.
స్టైలింగా..? వద్దే వద్దు!
జుట్టుతో రోజుకో రకమైన కొప్పు వేసుకోవడం లేదంటే వివిధ హెయిర్‌స్టైల్స్ ప్రయత్నించడం మనకు అలవాటే! అయితే ఈ క్రమంలో వేడి ఉత్పత్తి చేసే హెయిర్ స్టైలింగ్ టూల్స్ వాడక తప్పదు. అలాగని వాడితే జుట్టు ఆరోగ్యం దెబ్బతినడం ఖాయం. అసలే హ్యుమిడిటీ కారణంగా జుట్టు గడ్డిలా తయారవుతుంది. దానిపై నుంచి హెయిర్‌స్టైలింగ్ చేశామంటే అది పిచ్చుకగూడులా మారిపోతుంది. కాబట్టి స్టైల్ అంటూ జుట్టును అలాగే వదిలేయడం, వివిధ రకాల హెయిర్‌స్టైల్స్ ప్రయత్నించడం, హెయిర్‌స్టైలింగ్ టూల్స్ వాడడం కంటే.. చక్కగా పైకి ముడేసుకోవడం/బన్ వేసుకోవడం లేదంటే నీట్‌గా జడ వేసుకోవడం.. మంచిది.
నూనె పెట్టుకోవద్దు!
జుట్టు, కుదుళ్లు ఆరోగ్యంగా ఉండడానికి తరచూ నూనె పెట్టుకోమని సూచిస్తుంటారు నిపుణులు. అయితే వర్షాకాలంలో మాత్రం ఈ అలవాటును కాస్త తగ్గించుకోవడం మంచిదంటున్నారు. ఎందుకంటే నూనెకు వర్షాకాలంలో ఉండే హ్యుమిడిటీ కూడా తోడవడంతో జుట్టు మరింత జిడ్డుగా మారుతుంది. దీనివల్ల కుదుళ్లలో చుండ్రు, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువ. మరి, జుట్టుకు నూనె లేకపోతే ఎలా? అనుకోకండి. నూనెకు బదులు నీటి ఆధారిత సీరమ్స్ (Water based serums) వాడచ్చంటున్నారు నిపుణులు. తద్వారా జుట్టు జిడ్డుగా మారకుండా జాగ్రత్తపడచ్చు.. అయితే మరీ అంతగా నూనె పెట్టుకోవాలనుకునే వారు.. రాత్రి పడుకునే ముందు కుదుళ్లు, జుట్టుకు నూనె పట్టించి.. ఉదయాన్నే గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేసేయాలి.
ఇలాంటప్పుడు సీరమ్ మంచిదే!
కొంతమంది జుట్టు ఎంత దువ్వినా కాసేపటికే చెదిరిపోతుంది. దీంతో పదే పదే దువ్వుకోవడం, ఎక్కడికక్కడ హెయిర్ పిన్స్/క్లిప్స్ పెట్టేయడం.. వంటివి చేస్తుంటారు. నిజానికి దీనివల్ల జుట్టు చెదిరిపోకుండా ఉండడమేమో గానీ.. పిన్స్ తీసేశాక మరింత గడ్డిలాగా మారుతుంది. అందుకే అలాంటి వారు జడ/హెయిర్‌స్టైల్ వేసుకోవడానికి ముందు కాస్త హెయిర్ సీరమ్‌ని అప్లై చేసుకుంటే ఫలితం ఉంటుందట! అంతేకాదు.. ఈ కాలంలో జుట్టు, కుదుళ్లలో ఉన్న తేమ, జిడ్డును తొలగించి.. జుట్టు మృదువుగా మార్చడంలోనూ ఇది సహాయపడుతుంది.
వారానికి మూడుసార్లు!
కుదుళ్లు జిడ్డుగా అనిపించినప్పుడల్లా షాంపూతో తలస్నానం చేయడం మనకు అలవాటే! అయితే హ్యుమిడిటీ కారణంగా ఈ సమస్య పెరగడంతో తరచుగా తలస్నానం చేస్తుంటారు కొంతమంది. అయితే ఇలా పదే పదే షాంపూ చేసుకోవడం వల్ల జుట్టు సహజ తేమను కోల్పోతుంది. ఇది వెంట్రుకలు ఎక్కువగా రాలడానికి దారితీస్తుంది. కాబట్టి ఇలాంటి వాతావరణంలో వారానికి రెండు లేదా మూడుసార్లు తలస్నానం చేయాలని.. అది కూడా షాంపూతో కాకుండా చల్లటి నీటితో జుట్టును శుభ్రం చేసుకుంటే సరిపోతుందంటున్నారు నిపుణులు. తద్వారా అటు జుట్టు శుభ్రపడుతుంది.. ఇటు కుదుళ్లు, జుట్టు ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుంది.
వీటితో పాటు తలస్నానం చేశాక కాటన్ టీషర్ట్‌తో జుట్టును తుడుచుకోవడం, జుట్టు ఆరోగ్యం కోసం నిపుణుల సలహా మేరకు నాణ్యమైన హెయిర్ స్ప్రే వాడడం, కండిషనర్ పెట్టుకున్నాక వేడి నీళ్ల కంటే చల్లటి నీళ్లతోనే జుట్టును శుభ్రం చేసుకోవడం.. వంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే హ్యుమిడిటీని ఎదుర్కొని జుట్టును ఆరోగ్యంగా మెరిపించుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.