close
సినిమా రివ్యూ
రివ్యూ: డియ‌ర్ కామ్రేడ్‌

న‌టీన‌టులు: విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న, రావు ర‌మేష్‌, శ్రుతి రామ‌చంద్రన్‌, జ‌య‌ప్రకాష్‌, బ్రహ్మాజీ, సుక‌న్య‌, ర‌ఘుబాబు, అనీష్ కురువిల్లా త‌దిత‌రులు
సంగీతం:  జ‌స్టిన్ ప్రభాక‌ర‌న్‌
ఛాయాగ్రహ‌ణం: సుజిత్ సారంగ్
కూర్పు: శ్రీజిత్ సారంగ్‌
క‌ళ‌: రామాంజ‌నేయులు
సాహిత్యం: చైత‌న్య ప్రసాద్‌, రెహ‌మాన్‌, కృష్ణకాంత్‌
సంస్థ‌:  మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బిగ్ బెన్ సినిమాస్‌
నిర్మాత‌లు:  న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి(సి.వి.ఎం), య‌ష్ రంగినేని
క‌థ‌, స్క్రీన్‌ప్లే, దర్శక‌త్వం: భ‌ర‌త్ కమ్మ
విడుద‌ల‌: 26-07-2019

విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా అన‌గానే అంచ‌నాలు ఆకాశాన్ని తాకుతుంటాయి. ప్రేక్షకుల్లో విజ‌య్‌కి ఉన్న క్రేజ్ అలాంటిది. అగ్ర క‌థానాయ‌కుల స్థాయిలో ఆయ‌న సినిమాలకి ప్రారంభ వ‌సూళ్లు వ‌స్తుంటాయి. ‘అర్జున్‌రెడ్డి’తో పొరుగు భాష‌ల్లోనూ గుర్తింపు తెచ్చుకున్నారు విజ‌య్‌. ఆయ‌న‌కి అక్కడ కూడా అభిమానులు ఏర్పడ్డారు. దాంతో విజ‌య్ న‌టించిన ‘డియ‌ర్ కామ్రేడ్’ సినిమా తెలుగుతో పాటు, త‌మిళం, క‌న్నడ‌, మ‌ల‌యాళం భాష‌ల్లోనూ విడుద‌లైంది. ‘గీత గోవిందం’తో అల‌రించిన విజ‌య్ - ర‌ష్మిక జోడీ ఇందులో క‌లిసి న‌టించ‌డం... ప్రచార చిత్రాలు ఆస‌క్తి రేకెత్తించ‌డంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. మ‌రి సినిమా ఎలా ఉంది? వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళుతున్న విజ‌య్‌కి ఈ చిత్రం ఎలాంటి ఫ‌లితాన్నిస్తుంది? 

క‌థేంటంటే: చైత‌న్య అలియాస్ బాబీ (విజ‌య్ దేవ‌ర‌కొండ‌) ఒక విద్యార్థి సంఘ నాయ‌కుడు. ఆవేశం ఎక్కువ‌. త‌న చుట్టూ ఉన్నవారిలో ఎవ‌రికి స‌మస్య వ‌చ్చినా వెంట‌నే  ప్రతి స్పందిస్తుంటాడు. అందుకోసం ఎవ‌రితోనైనా గొడ‌వ‌కి దిగుతుంటాడు. ఆ నైజం కొన్నిసార్లు కుటుంబ స‌భ్యుల‌కి కూడా చిక్కులు తెచ్చిపెడుతుంది. హైద‌రాబాద్ నుంచి త‌న ప‌క్కింటికి వ‌చ్చిన అప‌ర్ణాదేవి అలియాస్ లిల్లీ (ర‌ష్మిక మంద‌న‌)ని చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు.  క్రికెట‌ర్ అయిన లిల్లీ కూడా బాబీని ప్రేమిస్తుంది. అయితే సున్నిత మ‌న‌స్కురాలైన లిల్లీ ఆవేశం వ‌దులుకోమ‌ని బాబీని కోరుతుంది. మార‌క‌పోవడంతో ఇద్దరి మ‌ధ్య దూరం పెరుగుతుంది. మూడేళ్లు గ‌డిచిన త‌ర్వాత మ‌ళ్లీ లిల్లీ జీవితంలోకి వ‌స్తాడు బాబీ. జాతీయ జ‌ట్టులో చోటు సంపాదిస్తుంద‌నుకొన్న లిల్లీ వ్యక్తిగ‌తంగా, కెరీర్ ప‌రంగా స‌మ‌స్యల‌తో స‌త‌మ‌త‌మ‌వుతూ ఉంటుంది. ఆ క్రమంలో లిల్లీకి బాబీ ఎలా అండ‌గా నిలిచాడు? మూడేళ్ల త‌ర్వాత బాబీలో ఎలాంటి మార్పులు క‌నిపించాయి? లిల్లీలో బాబీ ఎలాంటి మార్పుని తీసుకొచ్చాడు? ఇదే కథ తెర‌పై చూడాల్సిందే. 

ఎలా ఉందంటే: పోరుబాట‌లో న‌డుస్తున్న ఓ యువ‌కుడు... సున్నిత మ‌న‌స్కురాలైన ఓ అమ్మాయి మ‌ధ్య సాగే ప్రేమ‌క‌థ ఇది. వర్తమాన స‌మాజంలో అమ్మాయిలు ఎదుర్కొంటున్న ఓ ప్రధాన స‌మ‌స్యని కూడా ఇందులో ప్రస్తావించారు. ఓ ప్రేమ‌క‌థ‌కి, ఒక సామాజిక సందేశాన్ని మేళ‌వించి చిత్రాన్ని తీర్చిదిద్దిన విధానం ఆక‌ట్టుకుంటుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా గురించి మాట్లాడిన ప్రతిసారీ లిల్లీ పాత్రలో ప్రతి అమ్మాయీ త‌న‌ని తాను చూసుకుంటుందని చెప్పిన‌ట్టుగానే లిల్లీ పాత్రని తీర్చిదిద్దారు. ప్రతి అమ్మాయికి ఒక కామ్రేడ్ ఉండాల‌ని ఆమె పాత్రతో చెప్పించిన విధానం బాగుంది. విజ‌య్‌ దేవ‌ర‌కొండ ఇమేజ్‌కి త‌గ్గట్టుగా ఆయ‌న పోషించిన బాబీ పాత్రని తీర్చిదిద్దారు. ఆయ‌న ఇమేజ్‌ని దృష్టిలో ఉంచుకుని ఆరంభ స‌న్నివేశాలకు రూపకల్పన చేశారు.  ఆ త‌ర్వాత పాత్రల్ని ప‌రిచ‌యం చేసుకుంటూ క‌థ‌లోకి వెళ్లారు. ఈ క్రమంలో స‌న్నివేశాల్లో వేగం త‌గ్గడం సినిమాకి కాస్త మైన‌స్‌గా మారింది.

ఆవేశం ఉన్న విద్యార్థి సంఘం నాయ‌కుడిగా విజ‌య్ దేవ‌ర‌కొండ క‌నిపిస్తారు. కానీ, ఆయ‌న ఆరంభంలో చేసే పోరాటాలే ఈ క‌థ‌కి అత‌క‌లేదనిపిస్తుంది. లిల్లీతో ప్రేమలో ప‌డే స‌న్నివేశాలు పర్వాలేద‌నిపించినా... వారిద్దరూ దూర‌మ‌వ‌డానికి గ‌ల కార‌ణాల్ని, అక్కడ పండాల్సిన భావోద్వేగాల్ని బ‌లంగా చూపించ‌లేక‌పోయారు. ద్వితీయార్ధంలోనే అస‌లు క‌థ ఉంటుంది. మ‌హిళ‌ల‌పై లైంగిక వేధింపుల అంశాన్ని ఇందులో మేళ‌వించిన విధానం ఆక‌ట్టుకుంటుంది. చివ‌రి అరగంట సినిమా చ‌క్కటి భావోద్వేగాల్ని పండించింది. క‌థా నేప‌థ్యం, పాత్రలతోపాటు...వాటిని స‌హ‌జంగా తెర‌పైకి తీసుకురావ‌డం వ‌ర‌కు బాగానే ఉన్నా... క‌థ‌నం విష‌యంలో ద‌ర్శకుడు చేసిన క‌స‌ర‌త్తులే స‌రిపోలేదు. దాంతో చాలా స‌న్నివేశాలు న‌త్తన‌డ‌క‌న సాగుతున్నట్లు అనిపిస్తాయి. 

ఎవ‌రెలా చేశారంటే: విజ‌య్ దేవ‌ర‌కొండ బాబీ పాత్రలో మంచి అభిన‌యం ప్రద‌ర్శించాడు. విద్యార్థి నాయ‌కుడిగా, ప్రేమికుడిగా ఆయ‌న పండించిన భావోద్వేగాలు ఆక‌ట్టుకుంటాయి. అయితే బాబీ పాత్రపై ‘అర్జున్‌రెడ్డి’ ప్రభావం చాలానే క‌నిపిస్తుంది. దాదాపు చాలా స‌న్నివేశాల్లో సిగ‌రెట్‌ కాలుస్తూ క‌నిపించ‌డం, అవ‌స‌రం లేని చోట కూడా చొక్కా విప్పడం ‘అర్జున్‌రెడ్డి’ పాత్రని గుర్తు చేస్తాయి. లిల్లీగా ర‌ష్మిక అభిన‌యం ఆక‌ట్టుకుంటుంది. ప్రథ‌మార్ధం వ‌ర‌కు ప‌క్కింటి అమ్మాయిలా సంద‌డి చేసింది. ద్వితీయార్ధంలోనే ఆమె న‌ట‌న‌కి ప‌రీక్ష ఎదురైంది. భావోద్వేగాలు పండించ‌డంలోనూ, స‌హ‌జంగా క‌నిపించ‌డంలోనూ ఆమె చ‌క్కటి ప్రతిభ కనబరిచింది. విజ‌య్‌, ర‌ష్మిక‌ల మ‌ధ్య కెమిస్ట్రీ మ‌రోసారి హైలైట్‌గా నిలిచింది. ర‌ష్మిక‌కి అక్కగా శ్రుతి రామ‌చంద్రన్ న‌టించింది. ఆమె కూడా తన అందంతో ఆక‌ట్టుకుంది. సంజ‌య్ స్వరూప్‌, శ్రీకాంత్ అయ్యర్‌, ఆనంద్ త‌దిత‌రులు పాత్రల ప‌రిధి మేర‌కు న‌టించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. సంగీతం, ఛాయాగ్రహ‌ణం, నిర్మాణ విలువ‌లు సినిమాకి మ‌రింత బ‌లాన్నిచ్చాయి.  కొత్త ద‌ర్శకుడు భ‌రత్ క‌మ్మ ఎంచుకొన్న క‌థాంశంలోనూ, ఆయ‌న ఆలోచ‌న‌ల్లోనూ నాణ్యత ఉన్నప్పటికీ అంద‌రికీ సంతృప్తినిచ్చేలా క‌థ‌ని చెప్పడంలో తడబడ్డారు. 

బ‌లాలు బ‌ల‌హీన‌త‌లు
+ క‌థా నేప‌థ్యం
+ విజ‌య్‌, ర‌ష్మిక‌ల న‌ట‌న‌
+ సంగీతం, ఛాయాగ్రహ‌ణం
- క‌థ‌నం 
-  అక్కడక్కడా సాగ‌దీత‌గా సాగే స‌న్నివేశాలు

చివ‌రిగా: ఇది ‘లిల్లీ కామ్రేడ్‌’
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

 

 


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.