close
సినిమా రివ్యూ
రివ్యూ: గ్యాంగ్‌లీడర్‌
చిత్రం: గ్యాంగ్‌లీడర్‌
నటీనటులు: నాని, కార్తికేయ, ప్రియా అరుళ్‌ మోహన్‌, లక్ష్మి, శరణ్య, అనీశ్‌, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిషోర్‌ తదితరులు
సంగీతం: అనిరుధ్‌ రవిచంద్రన్‌
సినిమాటోగ్రఫీ: మిరోస్లా కూబా బ్రోజెక్‌
ఎడిటింగ్‌: నవీన్‌ నూలి
నిర్మాతలు: వై.నవీన్‌, వై.రవి, మోహన్‌ చెరుకూరి
దర్శకత్వం: విక్రమ్‌ కె.కుమార్‌
బ్యానర్‌: మైత్రీ మూవీ మేకర్స్‌
విడుదల తేదీ: 13-09-2019

 

థా బలమున్న సినిమాలను, పాత్రలను ఎంచుకునే అతి కొద్ది మంది నటుల్లో నాని ఒకరు. ఒక పక్క కమర్షియల్‌ సినిమాలు చేస్తూనే ‘జెర్సీ’ వంటి విభిన్న నేపథ్యం ఉన్న చిత్రాలతో నటుడిగా తానేంటో నిరూపించుకుంటున్నారు. ఇక దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌ది విభిన్న శైలి. ‘24’, ‘మనం’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘గ్యాంగ్‌లీడర్‌’. అలనాటి చిరంజీవి సూపర్‌ హిట్‌ చిత్రం ‘గ్యాంగ్‌లీడర్‌’ పేరును గుర్తు తెచ్చేలా టైటిల్‌ను పెట్టినా, ఈ సినిమా కథ, నేపథ్యం పూర్తిగా వేరు. అందుకే నాని ‘గ్యాంగ్‌లీడర్‌’పై మొదటి నుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి. టీజర్‌, ట్రైలర్‌తో ఆసక్తిని మరింత పెంచాయి. పైగా ‘ఆర్‌ఎక్స్‌ 100’ కథానాయకుడు కార్తికేయ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటిస్తుండటంతో మరింత ఆసక్తి పెరిగింది. మరి ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని ‘గ్యాంగ్‌లీడర్‌’ ఎలా ఉంది? అసలు ఈ గ్యాంగ్‌ వెనుక ఉన్న కథేంటి? వారి పగను పెన్సిల్‌ పార్థసారథి ఎలా తీర్చాడు? ప్రతినాయకుడిగా కార్తికేయ నటన ఎలా ఉంది? విక్రమ్‌ కె.కుమార్‌ వెండితెరపై తనదైన మేజిక్‌తో అలరించారా?

క‌థేంటంటే: పెన్సిల్ పార్థసార‌థి (నాని) రివెంజ్ రైట‌ర్‌. హాలీవుడ్ సినిమాల్ని చూసి వాటి ద్వారా న‌వ‌ల‌లు రాసుకుంటూ ఫేమ‌స్ రైట‌ర్‌గా చ‌లామ‌ణీ అవుతుంటాడు. ఇత‌ని ప్రతీకార ర‌చ‌నా ప్రతిభ గురించి తెలుసుకొని, చాలా తెలివైన‌వాడ‌ని భావించి ఒక ఐదుగురు ఆడ‌వాళ్లు సంప్రదిస్తారు. ఒక‌రిపై ప్రతీకారం తీర్చుకోవాల‌ని ఉంద‌ని, అందుకు స‌హ‌కారం అందించాల‌ని కోరతారు. ఆ ప్రతీకారం త‌న రైటింగ్ కెరీర్‌కి కూడా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని భావించి ఓకే చెబుతాడు. రోజు వారీగా జ‌రిగే సంఘ‌ట‌ల‌న్నింటినీ రాసి మ‌రో బుక్‌గా త‌యారు చేయొచ్చనేది పెన్సిల్ ఆలోచ‌న‌. రూ. 300 కోట్లతో ముడిప‌డిన ఆ ప్రతీకారం వెన‌క అస‌లు క‌థేమిటి? ఆ క‌థ‌కీ వివిధ వ‌య‌సుల్లో ఉన్న ఆ ఐదుగురు ఆడ‌వాళ్లకీ మ‌ధ్య సంబంధ‌మేమిటి? పెన్సిల్‌తో క‌లిసి ఆ న‌లుగురు ఎలా ప్రతీకారం తీర్చుకున్నారు?త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే: ప్రతీకార క‌థల్లో ఒక స‌రికొత్త కోణాన్ని ఆవిష్కరించిన చిత్రమిది. ఐదుగురు ఆడ‌వాళ్లు ప్రతీకారం తీర్చుకోవాల‌ని నిర్ణయించుకోవ‌డం.. ఒక‌రికొక‌రు సంబంధం లేని వాళ్లు ఒక జ‌ట్టుగా ఏర్పడి ప్రణాళిక ర‌చించ‌డం, అందుకు ఒక ర‌చ‌యిత స‌హ‌కారం తీసుకోవ‌డం క‌థకి కొత్తద‌నాన్ని తెచ్చిపెట్టింది. నేర ప‌రిశోధ‌న త‌ర‌హాలో సాగే ఈ క‌థ‌కి భావోద్వేగాలు, కామెడీని మేళ‌వించిన విధానం కూడా ఆక‌ట్టుకుంటుంది. మానవ సంబంధాల్ని స్పృశించిన తీరూ మెప్పిస్తుంది. క‌థా నేప‌థ్యానికి త‌గ్గట్టుగా సినిమాని కూడా ఆస‌క్తిక‌రంగా ఆరంభించారు దర్శకుడు. బ్యాంకు దోపిడిని చాలా స్టైలిష్‌గా తీర్చిదిద్ది, ప్రేక్షకుడిని వేగంగా క‌థ‌లో లీనం చేశారు. పెన్సిల్ పార్థసార‌థి పాత్ర ప‌రిచ‌యం ద‌గ్గర్నుంచి క‌థ‌లో కామెడీ పెరుగుతుంది. కాపీ రైట‌ర్ అని తెలిసిపోయే క్రమం, రివేంజ్‌లో భాగంగానే సీసీ టీవీ ఫుటేజ్ కోసం చేసే ప్రయ‌త్నం, అక్కడ త‌న గ్యాంగ్‌తోపాటు, శన‌క్కాయ‌ల సంతూర్ పాత్రలో వెన్నెల కిషోర్‌తో క‌లిసి నాని చేసే హంగామా బాగా న‌వ్విస్తుంది.

ప్రథ‌మార్ధంలో కామెడీనే హైలైట్ అయ్యింది. అయితే క‌థ ప్రేక్షకుల ఊహ‌కు తగ్గట్టుగా సాగుతున్న అనుభూతి క‌లుగుతుంది.  ద్వితీయార్ధంలో స‌న్నివేశాలు మాత్రం ఉత్కంఠ‌ని రేకెత్తిస్తాయి. క‌థానాయ‌కుడు, ప్రతినాయ‌కుడి మ‌ధ్య నువ్వా నేనా అన్నట్టుగా సాగే స‌న్నివేశాలు చిత్రానికి ప్రధాన బ‌లంగా మారాయి. భావోద్వేగాలు కూడా హృద‌యాల్ని మెలిపెడ‌తాయి. షెర్లాక్ హోమ్స్ త‌ర‌హాలో క‌థానాయ‌కుడిని చూపించాల‌నుకున్నారు ద‌ర్శకుడు. ఒక‌ట్రెండు సంద‌ర్భాల్లో క‌థానాయ‌కుడు ఆ పేరును కూడా ప్రస్తావిస్తాడు. అయితే నేర ప‌రిశోధ‌న‌లో క్లూస్‌ని బ‌య‌ట‌పెట్టే విధానంలోనూ క‌థానాయ‌కుడు చేసే ప్రయ‌త్నాలు ప్రేక్షకుడిని పెద్దగా థ్రిల్ చేయ‌డక‌పోవ‌డం సినిమాకి కాస్త మైన‌స్‌. ఆ నేప‌థ్యంలో స‌న్నివేశాలు మ‌రింత ఇంటెలిజెన్స్‌తో సాగుంటే సినిమా మ‌రింత బిగితో క‌నిపించేది. ప‌తాక స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి. క‌థానాయ‌కుడు త‌న కుటుంబాన్ని వెతికే విధానం, ప్రేమ‌క‌థ కూడా మెప్పిస్తాయి.

ఎవ‌రెలా చేశారంటే: పెన్సిల్ పార్థసార‌థిగా నాని అల‌వోకగా న‌టించేశారు. అందులో ఆయ‌న ఒదిగిపోయిన విధానం, కామెడీ, భావోద్వేగాలు పండించిన తీరు ఆక‌ట్టుకుంటుంది. ఆయ‌న క‌నిపించిన విధానం కూడా ఇందులో కొత్తగా ఉంది. ల‌క్ష్మి, శ‌ర‌ణ్య, ప్రియాంక త‌దిత‌రుల‌తో కూడిన గ్యాంగ్ కూడా స‌హ‌జంగా న‌టించింది. ప్రతినాయ‌కుడిగా కార్తికేయ చాలా బాగా న‌టించారు. రేస‌ర్‌గా ఆయ‌న క‌నిపించిన తీరు, స్టైల్ మెప్పిస్తుంది. వెన్నెల‌కిషోర్, ప్రియ‌ద‌ర్శి, స‌త్య త‌దిత‌రులు పాత్రల ప‌రిధి మేర‌కు న‌టించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. అనిరుధ్ నేప‌థ్య సంగీతంతో పాటు, ‘రారా జ‌గ‌తిని జ‌యించుదాం’, ‘హొయ్‌నా హోయ్‌నా’ పాట‌లు ఆక‌ట్టుకుంటాయి. కూబా  ఛాయాగ్రహణం ప‌ర్వాలేద‌నిపిస్తుంది. మైత్రీ సంస్థ నిర్మాణ విలువ‌లు ఉన్నతంగా ఉన్నాయి. ద‌ర్శకుడు విక్రమ్‌ కె.కుమార్ ఎంతో స్పష్టతతో చిత్రాన్ని తెర‌పైకి తీసుకొచ్చారు. దర్శకుడిగా ఆయ‌న‌కి మంచి మార్కులే ప‌డినా... ర‌చ‌న ప‌రంగా మ‌రిన్ని క‌స‌రత్తులు చేయాల్సింది. 

+ బ‌లాలు - బ‌ల‌హీన‌త‌లు
+క‌థ‌, క‌థా నేప‌థ్యం -ఊహ‌కు త‌గ్గట్టుగా సాగే తొలి స‌గ‌భాగం
+భావోద్వేగాలు... సున్నిత‌మైన వినోదం  
+ద్వితీయార్ధంలో మ‌లుపులు  
న‌టీన‌టులు  

చివ‌రిగా: గ్యాంగ్‌ హంగామా మెప్పిస్తుంది
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.



Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.