నలభైల్లో పొట్ట పెరుగుతోందా..?ఈ జాగ్రత్తలు తప్పవు..!

అప్పటిదాకా నాజూగ్గా, సన్నజాజి తీగలా ఉన్న నడుము కొలతలు పిల్లలు పుట్టాక, వయసు పెరుగుతున్న కొద్దీ మారిపోతుంటాయి. పొట్ట పెరగడం, నడుం చుట్టూ కొవ్వు పేరుకుపోవడంతో అక్కడి చర్మం వేలాడినట్లుగా కనిపిస్తుంటుంది.

Published : 05 Aug 2023 12:17 IST

అప్పటిదాకా నాజూగ్గా, సన్నజాజి తీగలా ఉన్న నడుము కొలతలు పిల్లలు పుట్టాక, వయసు పెరుగుతున్న కొద్దీ మారిపోతుంటాయి. పొట్ట పెరగడం, నడుం చుట్టూ కొవ్వు పేరుకుపోవడంతో అక్కడి చర్మం వేలాడినట్లుగా కనిపిస్తుంటుంది. ఇక మెనోపాజ్‌ తర్వాత చాలామంది మహిళల్లో ఈ మార్పు కనిపించడం చూస్తుంటాం. దీన్ని మహిళలు జీర్ణించుకోలేరు. తిరిగి పూర్వ స్థితికి రావడానికి ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తుంటారు. అయితే అందం విషయం కాసేపు పక్కన పెడితే.. ఇలా పెరిగే పొట్ట ఇతర అనారోగ్యాలకూ దారి తీస్తుందంటున్నారు నిపుణులు. అందుకే నలభై దాటాక/మెనోపాజ్‌ దశలో చక్కటి పోషకాహారం తీసుకోవడం వల్ల పెరిగే పొట్టను తగ్గించుకోవచ్చంటున్నారు. అదెలాగో తెలుసుకుందాం రండి..!

హార్మోన్ల ప్రభావమే..!

హార్మోన్ల ప్రభావం కారణంగా మన శరీరంలో వివిధ మార్పులు చోటుచేసుకుంటాయి. మెనోపాజ్‌ దశలో పొట్ట పెరగడానికీ ఇవే కారణమంటున్నారు నిపుణులు. ఈ దశలో ఈస్ట్రోజెన్‌ వంటి హార్మోన్లు తక్కువగా ఉత్పత్తవడం వల్ల వాటి స్థాయుల్లో సమతుల్యత లోపిస్తుంది. ఇది పొట్ట చుట్టూ, పొత్తి కడుపు దగ్గర కొవ్వులు పేరుకుపోయేందుకు ప్రేరేపిస్తుంది. కొంతమందిలో శరీర బరువు పెరగకపోయినా ఇలా పొట్ట పెరిగే సరికి అసౌకర్యానికి గురవుతుంటారు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే.. క్రమంగా బరువు పెరిగి శ్వాస సంబంధిత సమస్యలు, గుండె సమస్యలు, టైప్‌-2 మధుమేహం.. వంటి దీర్ఘకాలిక అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అందుకే ముందే జాగ్రత్త పడి.. కొన్ని ఆహార పదార్థాల్ని మెనూలో చేర్చుకోవడం వల్ల ఫలితం ఉంటుందంటున్నారు.

ఈ ఆహారంతో..!

అవిసె గింజలు ఆరోగ్యానికే కాదు.. అధిక బరువు తగ్గించడానికీ దోహదం చేస్తాయి. వీటిలో ఉండే మోనోఅన్‌శ్యాచురేటెడ్‌ కొవ్వులే ఇందుకు కారణం. ఇవి శరీరంలో అధిక నీరు చేరకుండా చేయడంతో పాటు ఈస్ట్రోజెన్‌ స్థాయుల్నీ క్రమబద్ధీకరిస్తాయి.

మన శరీరంలో విడుదలయ్యే కార్టిసాల్‌ హార్మోన్‌ ఒత్తిడికి కారణమవుతుంది. ఇదీ పొట్టభాగంలో కొవ్వు పేరుకుపోయేందుకు కారణమవుతుంది. కాబట్టి ఈ హార్మోన్‌ స్థాయుల్ని తగ్గించడంలో దాల్చిన చెక్క సమర్థంగా పనిచేస్తుంది.

సబ్జా గింజల్లో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది పేగు కదలికల్ని ప్రేరేపించి వివిధ జీర్ణ సంబంధిత సమస్యల్ని దూరం చేస్తుంది. అంతేకాదు.. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరుగుతుందని పలు అధ్యయనాలు కూడా రుజువు చేశాయి.

చెడు కొవ్వుల్ని కరిగించడంలో యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ సమర్థంగా పనిచేస్తుంది. పైగా ఇందులో క్యాలరీలు కూడా తక్కువే! కాబట్టి పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించాలంటే ఇది చక్కటి ప్రత్యామ్నాయం అంటున్నారు నిపుణులు. ఈ ఫలితం పొందాలంటే.. గ్లాసు నీటిలో టేబుల్‌స్పూన్‌ యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ వేసుకొని పరగడుపున తీసుకోవాలి.

పప్పులు, కాయధాన్యాల్లో ఫోలికామ్లం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్‌ ‘బి’, ఫైబర్‌, ప్రొటీన్‌.. వంటి పోషకాలుంటాయి. ఇవి పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వుల్ని కరిగించడానికి దోహదం చేస్తాయి.

ఆకుకూరల్లో మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది. ఇది ఒత్తిడి, ఆందోళన, యాంగ్జైటీ.. వంటి మానసిక సమస్యల్ని తగ్గించడంలో దోహదపడుతుంది. అంటే పరోక్షంగా శరీరంలో పేరుకున్న చెడు కొవ్వులు, పొట్టనూ తగ్గిస్తుందన్నమాట!

మెనోపాజ్‌ దశలో తలెత్తే దుష్ప్రభావాలే మహిళల్లో వివిధ మానసిక సమస్యలకు కారణమవుతుంటాయి. వీటిని దూరం చేసుకోవాలంటే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే చేపలు, సీ-ఫుడ్‌, వాల్‌నట్స్‌ని డైట్‌లో చేర్చుకోవాలని చెబుతోంది ఓ అధ్యయనం!

ఇక వీటితో పాటు బరువులెత్తడం, నడక, పరుగు, ఈత, సైక్లింగ్‌.. వంటి వ్యాయామాలు కూడా నలభై దాటాక పొట్టను తగ్గించడంలో సహకరిస్తాయంటున్నారు నిపుణులు. అయితే ఈ నియమాలు పాటిస్తున్నా ఫలితం లేకపోతే, ఇతర సమస్యలేవైనా ఎదురైతే.. ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించడం ఉత్తమం అంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని