Anupama Nadella: వాడి నవ్వులో ఆ మ్యాజిక్‌ ఉండేది!

నెలలు నిండుతున్న కొద్దీ తన ప్రతిరూపాన్ని చూసుకోవడానికి తల్లి పడే ఆరాటం అంతా ఇంతా కాదు. పండంటి బిడ్డను చేతిలోకి తీసుకోవాలని, వారి బాల్యాన్ని చూసి మురిసిపోవాలని కడుపులో నలుసు పడ్డప్పట్నుంచే కలలు కంటుంది. వారిని పెంచి, ప్రయోజకులను చేసే విషయంలో ఆమె ఆలోచనలు హద్దులు దాటుతాయి.

Updated : 21 Nov 2022 16:50 IST

(Photo: Twitter)

నెలలు నిండుతున్న కొద్దీ తన ప్రతిరూపాన్ని చూసుకోవడానికి తల్లి పడే ఆరాటం అంతా ఇంతా కాదు. పండంటి బిడ్డను చేతిలోకి తీసుకోవాలని, వారి బాల్యాన్ని చూసి మురిసిపోవాలని కడుపులో నలుసు పడ్డప్పట్నుంచే కలలు కంటుంది. వారిని పెంచి, ప్రయోజకులను చేసే విషయంలో ఆమె ఆలోచనలు హద్దులు దాటుతాయి. అయితే ఇవేవీ జరగకుండా విధి అడ్డుపడితే, పుట్టిన బిడ్డ ఇక జీవితాంతం జీవచ్ఛవంలా చక్రాల కుర్చీకే పరిమితమవుతాడన్న చేదు నిజం తెలిస్తే.. ఆ తల్లి హృదయం తట్టుకోగలదా? అయినా ఈ బాధలన్నీ పంటి బిగువున భరించి తన కొడుకును కంటికి రెప్పలా కాచుకున్నారు మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల సతీమణి అనుపమా నాదెళ్ల. తనయుడి నిష్కల్మషమైన చిరునవ్వే బాధలన్నీ బాపేదని చెబుతుండేవారామె. అలాంటి కొడుకు లేడు, ఇక రాడన్న విషయాన్ని జీర్ణించుకోలేక ఇప్పుడు కుమిలిపోతున్నారు. రాకాసి సెరెబ్రల్‌ పాల్సీ తనయుడిని దూరం చేసి ఆ తల్లికి తీరని గర్భశోకం మిగిల్చింది.. 26 ఏళ్ల ఎదిగిన కొడుకును కోల్పోయి తల్లడిల్లిపోతోందా తల్లి హృదయం.

ప్రత్యేక అవసరాలున్న పిల్లల తల్లిదండ్రులకు ఈ సమాజంలో ప్రతి రోజూ, ప్రతి విషయమూ సవాలే! అయితే సెరెబ్రల్‌ పాల్సీతో జన్మించిన తన కొడుకు విషయంలో ఇలాంటి సవాళ్లెన్నో ధైర్యంగా ఎదుర్కొన్నామంటున్నారు అనుపమ నాదెళ్ల. టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ అధినేత సత్య నాదెళ్ల అర్ధాంగిగానే కాకుండా.. ఆర్కిటెక్ట్‌గా, సమాజ సేవకురాలిగా తనను తాను ప్రత్యేకంగా మలచుకున్నారామె. సందర్భం వచ్చినప్పుడల్లా తన కుటుంబ, వ్యక్తిగత విశేషాలనూ పంచుకోవడానికి వెనకాడని అను.. తన కొడుకు విషయంలో తానెదుర్కొన్న అనుభవాలను ఓ సందర్భంలో పంచుకుంటూ ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. సత్య కూడా తాను రాసిన ‘హిట్‌ రిఫ్రెష్‌’ పుస్తకంలో తన కొడుకు గురించి పలు విషయాలు పంచుకున్నారు. వాటి సారాంశమే ఇది..!

మా ప్రణాళికలన్నీ తారుమారైన క్షణమది!

‘కెరీర్‌ పరంగా మా భవిష్యత్తుకు బాటలు పరచుకుంటున్న సమయమది. ఆర్కిటెక్ట్‌గా నేను, ఇంజినీరింగ్‌ విభాగంలో సత్య రాణిస్తున్నాం. మా ఇరు కుటుంబాలు దూరంగా భారత్‌లో ఉన్నప్పటికీ సియాటెల్‌లో మా భవిష్యత్తు పైనే పూర్తి దృష్టి పెట్టాం. ఈ క్రమంలోనే మైక్రోసాఫ్ట్‌ క్యాంపస్‌ పక్కనే ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నాం. అప్పటికి నేను గర్భవతిని. తొలుచూరు బిడ్డ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాం. రాబోయే పాపాయి కోసం నర్సరీని అలంకరించడం, ప్రసవం తర్వాత తిరిగి కెరీర్‌ని ఎలా కొనసాగించాలి?, వారాంతాలు-సెలవుల్ని ఎలా సర్దుబాటు చేసుకోవాలి?.. ఈ ఆలోచనల్లోనే మునిగిపోయాం. కానీ ఒక్కరోజులోనే మా ప్రణాళికలన్నీ తారుమారయ్యాయి.

ఆ నిజాలు విని గుండె రాయి చేసుకున్నా!

36 వారాల సమయంలో ఓ రాత్రి నా పొట్టలోని పాపాయికి అంతకుముందులా కదలికలు లేకపోవడం గుర్తించాను. అప్పటికప్పుడు సాధారణ చెకప్‌ కోసమని ఆస్పత్రికి వెళ్తే.. అత్యవసరంగా సిజేరియన్‌ చేయాల్సి వచ్చింది. అలా 1996, ఆగస్టు 13న రాత్రి 11:29 గంటలకు జైన్‌ పుట్టాడు. కేవలం మూడు పౌండ్ల (సుమారు 1.3 కిలోలు) బరువున్న వాడు పుట్టగానే ఏడవలేదు కూడా! దాంతో వాడిని అత్యవసరంగా సియాటెల్‌ పిల్లల ఆస్పత్రికి తరలించి NICUలో ఉంచారు. ఆ తర్వాత జైన్‌కి పుట్టుకతోనే సెరెబ్రల్‌ పాల్సీ అని తెలిసింది. ఇదంతా వాడు నా కడుపులో ఉన్నప్పుడు Utero Asphyxiation (కడుపులో ఉన్నప్పుడు పాపాయి మెదడుకి సరైన ఆక్సిజన్‌, రక్తప్రసరణ జరగకపోవడం) వల్లే అని వైద్యులు చెప్పారు. ఆ క్షణం నా మనసులో ఎన్నో సందేహాలు.. గర్భిణిగా ఉన్నప్పుడు నా జీవనశైలి కారణంగా ఈ సమస్య తలెత్తిందా? నేను సరైన జాగ్రత్తలు తీసుకున్నానా? లేదా?.. వంటి ప్రశ్నలు నా మనసును తొలిచేశాయి. జైన్‌ సమస్య చాలా తీవ్రమైందని, ఇకపై తనెప్పుడూ వీల్‌ఛైర్‌కే పరిమితం కావాల్సి వస్తుందని, మాట్లాడలేడని, తన కళ్లతో ఈ ప్రపంచాన్ని చూడలేడని.. ఇలా మా అబ్బాయికి ఉన్న సమస్య గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం.

సహాయపడడం ఎలాగో నేర్పింది!

జీవితంలో ప్రతికూల పరిస్థితులంటే ఏంటో అప్పుడు నాకు అర్థమైంది. అయితే వీటిని జీర్ణించుకొని ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నా. ప్రతి విషయంలో ఎందుకు అన్న ప్రశ్నను పక్కన పెట్టి నా కొడుకు భవిష్యత్తును ఎలా మెరుగుపరచాలా అన్న విషయంపై దృష్టి పెట్టా. సత్యకు కూడా పదే పదే ఇదే మాట చెప్పేదాన్ని. నిజానికి ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలున్న తల్లిదండ్రులు నలుగురితో కలవలేరు. అయితే దీని గురించి ధైర్యంగా బయటికి చెప్పగలిగితే మరికొంతమంది తమ కథల్ని పంచుకోవడానికి ముందుకొస్తారు. ఈ క్రమంలోనే ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు సహాయం చేస్తున్న కొంతమందిని కలిశాను. అప్పుడే ఇతరులకు సహాయపడడంలో ఉన్న సంతృప్తేంటో నాకు అర్థమైంది.. అలాగే అప్పుడప్పుడూ ఎదుటివారు పంచుకునే బాధల్ని వినడం ద్వారా అవతలి వారికి మానసిక ప్రశాంతత చేకూర్చవచ్చన్న విషయం గ్రహించా.

వాడి నవ్వులో ఆ మ్యాజిక్‌ ఉంది!

జైన్‌ చక్రాల కుర్చీకే పరిమితం కావచ్చు.. కానీ వాడి చిరునవ్వుతో మమ్మల్ని ఎప్పుడూ ఉత్సాహంగా ఉంచేవాడు. తనకు సంగీతమంటే చాలా ఇష్టం. కానీ తనకు ఇష్టమైన పాటలను మార్చుకుంటూ వినలేడు. అయితే జైన్‌ తన సంగీతాన్ని తనే పెట్టుకునేలా వాళ్ల నాన్న విండోస్‌ యాప్‌ను రూపొందించారు. ఇక వాడి ఆరోగ్యపరంగా కొన్ని గడ్డు పరిస్థితుల్లోనూ ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించేవాడు. అది నన్ను మరింత పాజిటివిటీతో ముందుకు నడిపించేది. నాలోని ప్రతికూల ఆలోచనలకు చెక్‌ పెట్టేది. ఇలా జైన్‌ని సాకే క్రమంలో ఎదుటివారి పట్ల దయతో ఎలా మెలగాలో తెలుసుకున్నా. ప్రత్యేక అవసరాలున్న పిల్లల కుటుంబాలు తమకెదురయ్యే ప్రతి సవాలును ధైర్యంతో ఎదుర్కోగలిగే నేర్పును పెంచుకోవాలి. జైన్‌ తల్లిగా ఇలాంటి తల్లిదండ్రులందరికీ నేను చెప్పదల్చుకున్నది ఇదే..!’ అంటూ 26 ఏళ్ల పాటు తన కొడుకును కంటికి రెప్పలా కాచుకున్న సంగతుల్ని ఓ సందర్భంలో పంచుకున్నారు అను.

అమ్మలోని అనురాగం చూశా!

ఇక సత్య కూడా తను రాసిన పుస్తకంలో.. తన కొడుకు పరిస్థితిని చూసి తన భార్య చూపిన గుండె ధైర్యాన్ని ప్రస్తావించారు. ‘మా అబ్బాయి జైన్‌కి వచ్చిన ఇబ్బందితో.. అనుకోని విధంగా మా జీవితాలు మారిపోయాయి. సమస్యల్ని తట్టుకోవడం నేర్చుకున్నాం. పిల్లల ఆస్పత్రి నుంచి జైన్‌ ఇంటికి రాగానే మరో ఆలోచన లేకుండా అను ఈ పరిస్థితులన్నీ ఒంటబట్టించుకుంది. జైన్‌కి రోజూ ఎన్నో చికిత్సలు చేయాలి. ఐసీయూలో ఎంతో కాలం ఉన్నాక కూడా శస్త్రచికిత్సలు చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత చేసే సపర్యల విషయంలోనూ అను ఎంతో శ్రద్ధగా ఉండేది. పిల్లల పట్ల అమ్మ అనురాగం ఎలా ఉంటుందో చూపించేది. జైన్‌ని ఉదయమే పసిపిల్లల సీట్లో కూర్చోబెట్టుకొని థెరపిస్టు దగ్గరికి తీసుకెళ్లేది. సియాటెల్‌ పిల్లల ఆస్పత్రికి తరచూ తీసుకెళ్లేది. ఇలా ఆమె ప్రదర్శించే గుండె ధైర్యం నన్నూ పాజిటివిటీ వైపు నడిపించింది..’ అని పేర్కొన్నారు సత్య.

దాతృత్వంలోనూ మేటి!

ఇలా తమ కొడుకు విషయంలో తామెదుర్కొన్న అనుభవాలే ఎన్నో జీవిత పాఠాలు నేర్పాయని చెబుతోన్న ఈ జంట.. తన బిడ్డ స్ఫూర్తితో ఎన్నో సహాయ కార్యక్రమాల్లోనూ భాగమవుతున్నారు. తన కొడుకు లాంటి వారి కోసం వినూత్న పరికరాల ఆవిష్కరణలపై దృష్టి పెట్టారు సత్య. ఈ క్రమంలోనే అంగవైకల్యం ఉన్న వారు కూడా సులువుగా ఉపయోగించుకునేలా మైక్రోసాఫ్ట్‌ ఉత్పత్తుల్లో అనేక కొత్త మార్పులు తీసుకొచ్చారు. అలాగే తన కొడుక్కి చికిత్స అందించిన సియాటెల్‌ పిల్లల ఆస్పత్రికి గతేడాది 15 మిలియన్‌ డాలర్ల (సుమారు 113 కోట్లు) మొత్తాన్ని విరాళంగా అందించారు. ఇక మరోవైపు అను కూడా.. గతేడాది కొవిడ్‌ విజృంభణ సమయంలో తన వ్యక్తిగత ఆదాయం నుంచి పీఎం, తెలంగాణ సీఎం సహాయనిధికి.. రెండేసి కోట్ల చొప్పున విరాళం అందించి తన దాతృత్వాన్ని, మాతృభూమి పట్ల ప్రేమను చాటుకున్నారు. ఈ జంటకు జైన్‌తో పాటు దివ్య, తార అనే మరో ఇద్దరు కూతుళ్లున్నారు. వీరిలో తార ప్రస్తుతం హైస్కూల్‌ విద్యనభ్యసిస్తోంది.

ఎదిగిన కొడుకును కోల్పోయిన ఈ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం!   ఇన్నాళ్లూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన తన కొడుకు లేడన్న చేదు నిజాన్ని జీర్ణించుకోలేక కుమిలిపోతున్న ఆ కన్నతల్లి కడుపు కోత ఎవరూ తీర్చలేనిది. ఈ గడ్డు పరిస్థితిని తట్టుకునే ధైర్యాన్ని ఆ కుటుంబానికి అందించాలని ఆ భగవంతుడిని ప్రార్ధిద్దాం..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్