శారీరక లోపం ఉంటే ఏంటి? తైక్వాండోలో దూసుకుపోతోంది!

శారీరక లోపాలు.. అటు శారీరకంగా, ఇటు మానసికంగా ఎంతోమందిని కుంగదీస్తుంటాయివి. వారి కెరీర్‌కు అడ్డుగోడగా నిలుస్తుంటాయి. కానీ తన జీవితంలో వాటికి ఆ అవకాశమివ్వాలనుకోలేదామె. తన పట్టుదలకు తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా తోడవడంతో తైక్వాండోలో ఆరితేరింది. తనలో ఉన్న శారీరక లోపాన్ని ప్రత్యేక శక్తిగా భావించి ఈ క్రీడలో సత్తా చాటుతోన్న ఆమె.. ఇప్పుడు ప్రతిష్ఠాత్మక టోక్యో పారాలింపిక్స్‌ పోటీలకు కూడా అర్హత సాధించింది.

Updated : 17 Jun 2021 18:12 IST

Photo: Twitter

శారీరక లోపాలు.. అటు శారీరకంగా, ఇటు మానసికంగా ఎంతోమందిని కుంగదీస్తుంటాయివి. వారి కెరీర్‌కు అడ్డుగోడగా నిలుస్తుంటాయి. కానీ తన జీవితంలో వాటికి ఆ అవకాశమివ్వాలనుకోలేదామె. తన పట్టుదలకు తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా తోడవడంతో తైక్వాండోలో ఆరితేరింది. తనలో ఉన్న శారీరక లోపాన్ని ప్రత్యేక శక్తిగా భావించి ఈ క్రీడలో సత్తా చాటుతోన్న ఆమె.. ఇప్పుడు ప్రతిష్ఠాత్మక టోక్యో పారాలింపిక్స్‌ పోటీలకు కూడా అర్హత సాధించింది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ తైక్వాండో అథ్లెట్‌గా కీర్తి గడించింది. ఇంతకీ ఎవరామె? తన తైక్వాండో కథేంటో తెలుసుకుందాం రండి..
అరుణా సింగ్‌ తన్వర్‌.. హరియాణాలోని భివానీ జిల్లాలో పుట్టిపెరిగిందామె. ఆమె తండ్రి ప్రైవేట్‌ బస్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. పుట్టుకతోనే చేతులు, చేతి వేళ్లు ఉండాల్సిన దాని కంటే తక్కువ పొడవుండడం గమనించిన ఆమె తల్లిదండ్రులు.. తన కూతురిలోని ఈ శారీరక లోపాన్ని చూసి బాధపడలేదు. అంతేకాదు.. ఈ లోపం తన కూతురు ఎదుగుదలకు, ఆమె కెరీర్‌కు ఏమాత్రం అడ్డురాకూడదని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే పసి వయసు నుంచే ఆమెను ప్రోత్సహించడం మొదలుపెట్టారు. తన కూతురు క్రీడల్లో రాణించి దేశానికి మంచి పేరు తీసుకురావాలనేది అరుణ తండ్రి కల. ఇలా తనలోని తపన, తన తండ్రి కలను అర్థం చేసుకున్న ఆమె.. ఎదిగే క్రమంలో ఆ దిశగానే అడుగులు వేసింది.


ఓటమిని అధిగమించి!
చిన్నతనం నుంచే మార్షల్‌ ఆర్ట్స్‌ అంటే మక్కువ చూపే ఆమె.. తన శారీరక లోపం కారణంగా జనరల్‌ కేటగిరీలో అనుకున్నంత సక్సెస్‌ సాధించలేకపోయింది. అయినా నిరాశ చెందకుండా పారా-తైక్వాండో క్రీడలపై దృష్టి పెట్టింది. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా తన నైపుణ్యాలకు పదును పెడుతూ జాతీయ, అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతోంది. ఇప్పటిదాకా ఐదుసార్లు నేషనల్‌ ఛాంపియన్‌ అయిన అరుణ.. ఏషియన్‌ పారా తైక్వాండో ఛాంపియన్‌షిప్స్‌, వరల్డ్‌ పారా తైక్వాండో ఛాంపియన్‌షిప్స్‌.. వంటి అంతర్జాతీయ పోటీల్లోనూ పలు పతకాలు గెలుచుకుంది. అండర్‌-49 మహిళల విభాగంలో ప్రస్తుతం ప్రపంచంలోనే నాలుగో ర్యాంక్‌లో కొసాగుతోన్న ఈ యువ అథ్లెట్‌.. తాజాగా ప్రతిష్ఠాత్మక టోక్యో పారాలింపిక్స్‌కి అర్హత సాధించింది. గతంలో తను నమోదు చేసిన గొప్ప విజయాలను పరిగణనలోకి తీసుకొని వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ద్వారా అరుణ ఈ పోటీలకు అర్హత సాధించినట్లు భారత తైక్వాండో అధ్యక్షులు తెలిపారు. దీంతో ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్‌ 5 వరకు జరగనున్న ఈ పోటీలకు భారత్‌ తరఫున పాల్గొననున్న తొలి తైక్వాండో ప్లేయర్‌గా నిలవనుంది అరుణ.


అమ్మానాన్నల అండతోనే!
తైక్వాండో క్రీడలో తానింతగా రాణిస్తున్నానంటే అదంతా అమ్మానాన్నల ప్రోత్సాహం వల్లే సాధ్యమైందంటోంది అరుణ. ‘నాలోని శారీరక లోపాన్ని నాకు తెలియకుండా అమ్మానాన్న నన్ను పెంచారు. నేను క్రీడల్లో దేశానికి ప్రాతినిథ్యం వహించాలని, మంచి పేరు తేవాలనేది నాన్న కల. నాకు కూడా చిన్నతనం నుంచే మార్షల్‌ ఆర్ట్స్‌ అంటే ప్రాణం. జాతీయ స్థాయిలో ఎక్కడ పోటీలు జరిగినా వాళ్లిద్దరూ నా వెంటే ఉండేవారు.. ఇంట్లోని బంగారు నగలు అమ్మి నా కోచింగ్‌కి డబ్బులు సమకూర్చారు. ఇలా నా ప్రతి అడుగులోనూ వారి ప్రోత్సాహం ఎంతో ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే నేనీ స్థాయికి చేరానంటే అదంతా అమ్మానాన్నల చలవే! వాళ్లు నాలోని సంకల్ప దీక్షను నమ్మారు.. వాళ్లు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నేను గౌరవించాను. టోక్యో పారాలింపిక్స్‌లో పతకం గెలిచి అటు అమ్మానాన్నలు, ఇటు దేశం గర్వపడేలా చేయడమే ప్రస్తుతం నా ముందున్న ఏకైక లక్ష్యం..!’ అంటోంది అరుణ.

మరి, ఈ యువ అథ్లెట్‌ లక్ష్యం నెరవేరాలని, ఎంతోమంది క్రీడా ఔత్సాహికులకు ఆమె మార్గదర్శి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం!
ఆల్‌ ది బెస్ట్‌ అరుణ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్