కాఫీతో.. చర్మం, జుట్టు మృదువుగా!

‘కొంచెం కాఫీ తాగితే ఎంత హాయిగా ఉంటుందో..!’ కాఫీ ప్రియులు తరచుగా చెప్పే మాట ఇది. మూడ్‌ని ఉల్లాసంగా మార్చే కాఫీ సౌందర్య పోషణలోనూ ఉపకరిస్తుందంటున్నారు నిపుణులు. కాఫీ పొడి/గింజల వల్ల ఎన్నో సౌందర్యపరమైన ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు.

Published : 24 Jan 2024 12:24 IST

‘కొంచెం కాఫీ తాగితే ఎంత హాయిగా ఉంటుందో..!’ కాఫీ ప్రియులు తరచుగా చెప్పే మాట ఇది. మూడ్‌ని ఉల్లాసంగా మార్చే కాఫీ సౌందర్య పోషణలోనూ ఉపకరిస్తుందంటున్నారు నిపుణులు. కాఫీ పొడి/గింజల వల్ల ఎన్నో సౌందర్యపరమైన ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు.

స్క్రబ్‌గా..

కాఫీపొడి చర్మానికి మంచి స్క్రబ్‌గా పని చేస్తుంది. ఇది చర్మంపై ఉన్న మృతకణాలను సులభంగా తొలగిస్తుంది. ఫలితంగా నిగనిగలాడే మేని మెరుపు సొంతమవుతుంది. ఇందుకోసం స్నానం చేసే సమయంలో కాఫీపొడిని నేరుగా చర్మంపై రుద్దుకుంటే సరిపోతుంది. స్క్రబింగ్ కోసం కాఫీ గింజలను సైతం వాడచ్చు.

ముడతలు పడకుండా..

చర్మం ముడతలు పడకుండా యాంటీ ఏజింగ్ క్రీంలను ఉపయోగించడం సహజం. ఈ క్రమంలో కాఫీ మంచి యాంటీ ఏజింగ్ ఏజెంట్‌లా పని చేస్తుంది. దీనికోసం రెండు కప్పుల కాఫీ గింజలకు ఒక కప్పు నీటిని, కొన్ని చుక్కలు టీట్రీ నూనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని బ్లెండర్‌తో బాగా కలిపి, బ్రష్‌తో ముఖానికి రాసుకోవాలి. కాసేపటి తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మిశ్రమం చర్మాన్ని బిగుతుగా మార్చడంతో పాటు చర్మం మీద పేరుకున్న మృతకణాలను కూడా తొలగిస్తుంది.

కళ్ల విషయంలో..

నిద్ర తక్కువ కావడం, ఒత్తిడికి లోనవడం వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు వస్తూ ఉంటాయి. వాటి కోసం సహజమైన ఉత్పత్తులతో పాటు మార్కెట్లో దొరికే వాటిని కూడా వాడుతూ ఉంటాం. ఈ క్రమంలో ఒకసారి కాఫీపొడిని కూడా ప్రయత్నించి చూడచ్చంటున్నారు నిపుణులు. కాఫీలో ఉన్న ఔషధ గుణాలు ఒత్తిడిని తగ్గించడంతో పాటు, నిద్ర లేకపోవడం వల్ల అలసటకు గురైన కళ్లను తిరిగి సాధారణ స్థితికి తీసుకొస్తాయి. అలాగే కళ్ల కింద వచ్చే నల్లటి వలయాలను తగ్గించుకోవడానికి మనం ఉపయోగించే క్రీంలో మెత్తగా ఉండే కాఫీపొడి కొద్ది మొత్తంలో కలిపి రాసుకోవాలి. అయితే ఎప్పుడూ కాఫీ పొడిని నేరుగా మాత్రం కళ్ల కింద రాసుకోకూడదు.

కురుల ఆరోగ్యాన్ని పెంచేలా..

జుట్టును సంరక్షించుకోవడానికి మనం అనేక రకాల ఉత్పత్తులను ఉపయోగిస్తుంటాం. మరి కాఫీ వల్ల జుట్టుకి కలిగే ప్రయోజనమేంటి అనుకుంటున్నారా? ఇది మంచి కండిషనర్‌గా పనిచేసి జుట్టును మృదువుగా అయ్యేలా చేస్తుంది. దీనికోసం కాఫీపొడిని నీటిలో వేసి బాగా మరిగించాలి. తర్వాత దీనిని ఒక గిన్నెలోకి వడపోయాలి. ఈ నీటిని జుట్టుకు అప్త్లె చేసి ఇరవై నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. కాఫీపొడి జుట్టుకు కలరింగ్ ఏజెంట్‌లా కూడా పనిచేస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్