లెదర్ బ్యాగ్స్‌ను మెరిపించాలంటే..

ఫ్యాషన్, మన్నికకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే లెదర్‌బ్యాగులను చాలామంది మహిళలు ఉపయోగిస్తారు. అటువంటి లెదర్‌బ్యాగులపై మరకలు పడితే చూసేందుకే కాదు.. ఉపయోగించడానికి కూడా కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అందుకే వాటిని శుభ్రంగా మెయింటెయిన్ చేయడం కూడా చాలా ముఖ్యం.

Published : 30 Dec 2021 21:08 IST

ఫ్యాషన్, మన్నికకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే లెదర్‌బ్యాగులను చాలామంది మహిళలు ఉపయోగిస్తారు. అటువంటి లెదర్‌బ్యాగులపై మరకలు పడితే చూసేందుకే కాదు.. ఉపయోగించడానికి కూడా కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అందుకే వాటిని శుభ్రంగా మెయింటెయిన్ చేయడం కూడా చాలా ముఖ్యం. ఈ క్రమంలో లెదర్ హ్యాండ్‌బ్యాగును ఎలా శుభ్రం చేసుకోవచ్చో తెలుసుకుందామా..

మొండి మరకలు మాయమిలా..

నిమ్మరసానికి కొంత టార్టార్ క్రీం (క్రీం ఆఫ్ టార్టార్ పేరుతో మార్కెట్‌లో లభ్యమవుతుంది) కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఇలా తయారుచేసుకున్న మిశ్రమాన్ని మరకలున్న చోట రుద్దాలి. పదినిమిషాల తర్వాత మిశ్రమం రాసిన భాగాన్ని సబ్బుతో శుభ్రంగా కడిగేయాలి. తర్వాత పొడి టవల్ లేదా మెత్తటి వస్త్రంతో తుడవాలి. ఇలా చేస్తే లెదర్‌బ్యాగ్‌పై పేరుకున్న మొండి మరకలు సులభంగా వదిలిపోతాయి.

సిరా మరకలకు

బ్యాగుల్లో పెన్నులు పెట్టుకోవడం సహజం. అయితే వాటి మూతలు సరిగ్గా పెట్టకపోయినా లేదా వాటి నుంచి సిరా బయటకు వచ్చినా బ్యాగులో ఇంకు మరకలు పడతాయి. ఇటువంటి మరకల్ని డిటర్జెంట్‌తో ఎంత శుభ్రం చేసినా ఫలితం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఆల్కహాల్‌లో దూదిని ముంచి సిరా మరకలున్నచోట బాగా రుద్దితే మరకలు తొలగిపోతాయి.

వేడినీటితోనూ మరకకు చెక్

ఒకవేళ.. బ్యాగ్‌పై ఎక్కువ మురికి పేరుకుపోలేదు, చిన్న వాష్‌తో బ్యాగును శుభ్రం చేసేసుకోవచ్చు అనుకుంటే.. చన్నీళ్లకు బదులు వేడినీళ్లలో డిటర్జెంట్ కలిపి ఆ ద్రావణంతో బ్యాగును వారానికోసారి శుభ్రం చేసుకోవాలి. కావాలంటే అందులో కొంత నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు.

వీటితో పాటు కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా కూడా లెదర్‌బ్యాగులను ఎక్కువ కాలం మన్నేలా చేసుకోవచ్చు. అవేంటంటే..

* బ్యాగు లోపల పదునైన వస్తువులను పెట్టకూడదు. వాటివల్ల అది ఎంత ఖరీదైన బ్యాగైనా రంధ్రాలు పడి, వాడేందుకు వీల్లేకుండా తయారవుతుంది.

* అలాగే బ్యాగుని ఎండలో ఎక్కువ సమయం ఉంచకూడదు. దీనివల్ల రంగు, నాణ్యత రెండూ తగ్గి బ్యాగు పెళుసుగా మారి పగుళ్లకు లోనవుతుంది. అలాగే నీళ్లలో ఎక్కువగా తడపడం, అధిక సమయం బ్యాగుని తడిగా ఉంచడం.. వంటివి కూడా బ్యాగు మన్నికను దెబ్బతీస్తాయి.

* అవిసె నూనె అందుబాటులో ఉంటే ఆ నూనెకు రెట్టింపు శాతంలో వైట్‌వెనిగర్‌ను కలపాలి. ఒక శుభ్రమైన వస్త్రాన్ని ఈ మిశ్రమంలో ముంచి దాంతో బ్యాగును పూర్తిగా తుడవాలి. తర్వాత 10 నిమిషాలు ఆరనివ్వాలి. అవసరమైతే రెండు, మూడు సార్లు పొడి వస్త్రంతో తుడవచ్చు. ఇలా చేస్తే లెదర్ బ్యాగు కొత్తదానిలా మెరిసిపోతుంది.

* మరకలు మరీ మొండిగా మారేంతవరకు వదిలేసే కంటే బ్యాగును కనీసం వారానికోసారైనా అందుబాటులో ఉండే వస్తువులతో శుభ్రం చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

చూశారుగా.. లెదర్ బ్యాగును ఎలా శుభ్రం ఎలా చేసుకోవాలి? మెయింటెయిన్ చేయడానికి ఎలాంటి చిట్కాలు పాటించాలో! మీరు కూడా ఈ చిట్కాలను పాటించి మీ బ్యాగును కొత్తదానిలా మెరిపించేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్