పిల్లల్లో కరోనా.. ఏం చేయాలి? ఏం చేయకూడదు?

దశల వారీగా రూపు మార్చుకుంటూ విరుచుకుపడుతోన్న కొవిడ్ మహమ్మారి గురించి రోజుకో కొత్త విషయం తెలుస్తోంది. కొత్త ఉత్పరివర్తనాలపై టీకా ప్రభావం అంతంత మాత్రమేనని కొన్ని అధ్యయనాలు చెబుతుంటే ..మరో కొద్ది రోజుల్లో మూడో దశ ప్రారంభం కానుందని మరికొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. దీనికి తోడు మూడో దశలో పిల్లలపై వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉంటుందేమోనన్న సందేహం ముందు నుంచీ చాలామంది తల్లిదండ్రుల్లో నెలకొంది.

Published : 09 Jul 2021 17:43 IST

దశల వారీగా రూపు మార్చుకుంటూ విరుచుకుపడుతోన్న కొవిడ్ మహమ్మారి గురించి రోజుకో కొత్త విషయం తెలుస్తోంది. కొత్త ఉత్పరివర్తనాలపై టీకా ప్రభావం అంతంత మాత్రమేనని కొన్ని అధ్యయనాలు చెబుతుంటే.. మరో కొద్ది రోజుల్లో మూడో దశ ప్రారంభం కానుందని మరికొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. దీనికి తోడు మూడో దశలో పిల్లలపై వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉంటుందేమోనన్న సందేహం ముందు నుంచీ చాలామంది తల్లిదండ్రుల్లో నెలకొంది.

ఇలాంటి తరుణంలో ఈ మూడో దశ ప్రభావం పిల్లలపై నిజంగానే తీవ్రంగా ఉండబోతోందా? ఒకవేళ వస్తే పిల్లల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? దాన్ని ఎదుర్కోవాలంటే వాళ్లను ఎలా సిద్ధం చేయాలి? పెద్దలుగా మనం ఎలా సిద్ధపడాలి? పెద్దలకైతే టీకా ఉంది.. మరి, పిల్లల పరిస్థితేంటి? ప్రస్తుతం ఇలాంటి సందేహాలు ఎంతోమంది తల్లిదండ్రుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వీటన్నింటికీ ఒకే ఒక్క వీడియోతో చెక్‌ పెట్టే ప్రయత్నం చేశాడు న్యాచురల్‌ స్టార్‌ నాని. కొవిడ్‌పై తల్లిదండ్రుల్లో అవగాహన పెంచేందుకు ప్రముఖ పిడియాట్రీషియన్‌ డాక్టర్‌ శివరంజనితో ఓ సుదీర్ఘ ఇంటర్వ్యూ నిర్వహించాడు. ఈ ముఖాముఖిలో ఆమె పంచుకున్న విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

మూడో దశలో వైరస్‌ ప్రభావం పిల్లలపై ఎలా ఉండబోతోంది?

మొన్నటివరకు పిల్లలపై మూడో దశ ప్రభావం తీవ్రంగా ఉండబోతుందనుకున్నాం. కానీ ఇటీవలే ఎయిమ్స్‌ జరిపిన సర్వేలో.. ఒకవేళ వైరస్‌ రెండో దశ మాదిరిగానే ప్రవర్తిస్తే.. ఇప్పుడు పిల్లలపై దీని ప్రభావం ఎలా ఉందో మూడో దశలోనూ అలాగే ఉంటుందని వెల్లడైంది. ఒకవేళ తీవ్రంగా వచ్చినా వందకి ఐదు కంటే ఎక్కువ మంది ఆస్పత్రుల్లో చేరే అవసరం రాకపోవచ్చు. కాబట్టి అనవసరంగా ఆందోళన పడద్దు. కనీస అవగాహనతో సిద్ధంగా ఉంటే సరైన సమయంలో స్పందించి బిడ్డను రక్షించుకోవచ్చు.

పెద్దలు ఆందోళన పడకుండా సిద్ధంగా ఉండడమెలా?

* అర్హులైన పెద్దలంతా కొవిడ్‌ టీకా తప్పనిసరిగా వేయించుకోవాలి.

* పిల్లలకు టీకా వచ్చినప్పుడు వారికి తప్పనిసరిగా వేయించాలి.

* వ్యాక్సిన్‌ వేయించుకున్నా కొవిడ్‌ జాగ్రత్తలు మానద్దు. ఎందుకంటే టీకా వేయించుకున్నా వైరస్‌ సోకదన్న గ్యారంటీ లేదు.

* ఎన్‌-95 మాస్క్‌ ఉపయోగించడం (ఎగ్జేల్‌ వాల్వ్‌ లేనిది), సర్జికల్‌ మాస్క్‌ వాడితే దానిపై క్లాత్‌ మాస్క్‌ పెట్టుకోవడం తప్పనిసరి.

* సామాజిక దూరం పాటించడం, ఒకవేళ ఎవరినైనా అత్యవసరంగా కలవాల్సి వస్తే సరైన జాగ్రత్తలు పాటిస్తూ ఆరుబయట కలవడం, చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం/శానిటైజ్‌ చేసుకోవడం.. వంటివి ముఖ్యమైనవి.

* ఐదేళ్ల లోపు పిల్లలకు మాస్క్‌ వద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ, రెండేళ్ల లోపు పిల్లలకు వద్దని సీడీసీ చెబుతున్నాయి. అలాగే సంవత్సరం లోపు పిల్లలకు ఫేస్‌షీల్డ్‌ పెట్టకూడదు.

* పిల్లలకొచ్చే సమస్యల్ని (జ్వరం, విరేచనాలు-వాంతులు) గుర్తించి వాటికి ముందు ప్రథమ చికిత్స చేయడమెలాగో తల్లిదండ్రులకు తెలిసి ఉండాలి.

* జ్వరమొస్తే డాక్టర్‌ సలహా మేరకు జ్వరం మందు ఇవ్వాలి. గోరు వెచ్చటి నీళ్లతో శరీరాన్ని తుడవాలి.

* ఇక వాంతులు-విరేచనాలు అయితే ఓఆర్‌ఎస్‌ (డబ్ల్యూహెచ్‌వో ఫార్ములా అని రాసున్నది) ఇవ్వాలి.

* మూడో రోజు పరీక్ష చేయించాలి. కొవిడ్‌ కాదు అని తేలే వరకు ఒక్కరే బిడ్డను చూసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

* జ్వరం మూడు రోజులకు పైగా (అంటే.. 102, 103 డిగ్రీల ఫారన్‌హీట్‌) ఉన్నా, నీరసంగా ఉన్నా, MIS-C లక్షణాలున్నా తప్పనిసరిగా డాక్టర్‌ని సంప్రదించాలి.

* కొన్ని ప్రమాద సంకేతాల గురించి తల్లిదండ్రులకు అవగాహన ఉండాలి. విపరీతమైన తలనొప్పి, వాంతులు, కళ్లు మసకబారడం, మత్తుగా ఉండడం, గుండెలో నొప్పిగా ఉందని చెబుతున్నా, ఆయాసపడుతున్నా, విపరీతమైన పొట్ట నొప్పి, వాంతులు, విరేచనాలు, కాళ్లు చేతులు చల్లబడినా, ఫిట్స్‌ వచ్చినా, ఆక్సిజన్‌ స్థాయులు 95 శాతం లోపున్నా.. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఆస్పత్రికి తీసుకెళ్లాలో కూడా కనీస అవగాహన ఉండాలి.

MIS-Cకి, కొవిడ్‌కి సంబంధమేంటి?

శరీరంలోకి కరోనా వైరస్‌ ప్రవేశించాక నాలుగు నుంచి ఆరు వారాల్లోపు ఈ సమస్య తలెత్తుతుంది. వైరస్‌ రోగనిరోధక శక్తిపై తీవ్ర ప్రభావం చూపడం వల్ల సైటోకైన్స్‌ అనే రసాయనాలు శరీరంలో ఉద్ధృతంగా ఉత్పత్తవడం వల్ల తలెత్తే సమస్య ఇది. అలాగే వైరస్‌ శరీరంలో నుంచి వెళ్లిపోయాక ఇది వస్తుంది. ఇది అరుదైన సమస్య. అయితే దీన్ని ముందుగానే గుర్తిస్తే సరి. లేదంటే గుండె, మెదడు, కిడ్నీలు దెబ్బతినచ్చు. దీన్ని మూడు రకాల లక్షణాలతో గుర్తించచ్చు.

మొదటిది - జ్వరం వచ్చి మూడునాలుగు రోజులుండి తగ్గిపోవచ్చు.

రెండోది - కవాసాకి సిండ్రోమ్‌ను పోలిన లక్షణాలు రావచ్చు.. అంటే జ్వరంతో పాటు ఒంటి నిండా ఎర్రటి మచ్చలు, కళ్లు-నాలుక ఎర్రబడడం, మెడకు ఓ పక్కన వాపు రావడం (లింఫ్‌ నోడ్స్‌), పాదాలు-చేతులు ఎర్రబడి వాపు రావడం/వేళ్ల చివర చర్మం ఊడిపోవడం.. ఇటువంటి లక్షణాలతో బయటపడచ్చు. ఈ క్రమంలో గుండె రక్తనాళాలు వాపుకి గురవుతాయి. ఈ సమస్య కొంతమందిని దీర్ఘకాలంగా వేధించచ్చు.. మరికొంతమందిలో త్వరగా తగ్గిపోవచ్చు. కాబట్టి మూడు రోజులు జ్వరం, దాంతో పాటు ఈ లక్షణాలుంటే తప్పనిసరిగా డాక్టర్‌ని సంప్రదించాలి..

మూడోది - జ్వరం, జ్వరంతో పాటు మెదడుపై ప్రభావం చూపితే మెడనొప్పి, తలనొప్పి, ఛాతీలో నొప్పి, విపరీతమైన పొట్టనొప్పి-వాంతులు, విరేచనాలు, చేతులు-కాళ్లు చల్లబడిపోవడం, షాక్‌లోకి వెళ్లిపోవడం, విపరీతమైన అలసట ఉన్నా.. వెంటనే ఎమర్జెన్సీ చికిత్స తీసుకోవాలి. చికిత్స కోసం ఐసీయూ ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్తే మరీ మంచిది.

* చంటిపిల్లలకు కొవిడ్‌ రావచ్చు.. MIS-C కూడా రావచ్చు. ఈ క్రమంలో కొంతమంది పిల్లల్లో జ్వరం ఉండకుండా.. డల్‌గా, పాలు తాగకుండా ఉండచ్చు. అలాంటప్పుడు సత్వరమే డాక్టర్‌ని సంప్రదించాలి.

* చంటి పిల్లలకు కొవిడ్‌ వస్తే తల్లే దగ్గరుండి చూసుకోవాలి. అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ తల్లికి కొవిడ్‌ వచ్చినా బిడ్డను చూసుకోవచ్చు. అప్పుడు కూడా జాగ్రత్తలు పాటించడం మరవద్దు.

* డెలివరీకి ముందు తల్లికి కొవిడ్‌ ఉన్నా.. పుట్టిన బిడ్డకు MIS-C రావచ్చు.

ఫ్లూ వ్యాక్సిన్‌ పిల్లల్ని కరోనా నుంచి కాపాడుతుందా?

ఫ్లూ టీకా అనేది ఫ్లూ జ్వరాల నుంచి కాపాడుతుందనే దానికి ఆధారాలున్నాయి కానీ.. ఇది కొవిడ్‌ నుంచి పిల్లల్ని ఎంతవరకు రక్షిస్తుందనే అంశంపై ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి. ఫ్లూ వైరస్‌ కూడా ఎప్పటికప్పుడు ఉత్పరివర్తనం చెందుతుంది కాబట్టి సంవత్సరానికోసారి పిల్లలకు ఈ టీకా ఇప్పించాలి. ముఖ్యంగా ఐదేళ్ల లోపు.. అది కూడా ఆస్తమా, కిడ్నీ, గుండె జబ్బులు.. వంటి సమస్యలున్న పిల్లలకు తప్పనిసరిగా ఈ టీకా ఇవ్వాలి.

కరోనా జాగ్రత్తలు పాటించమని ఒత్తిడి చేయడం, ఇంట్లోనే నిర్బంధించడం వల్ల పిల్లలపై పడిన మానసిక ఒత్తిడిని ఎలా అధిగమించచ్చు?

ఇలాంటి కట్టుబాట్ల వల్ల పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడిందన్న మాట వాస్తవమే. అయితే దీన్ని దూరం చేసుకోవడానికి ‘సోషల్‌ బబుల్’ అనే కొత్త విధానం ప్రస్తుతం ప్రాచుర్యంలోకొస్తోంది.  అదేంటంటే.. టీకాలు వేయించుకొని, కరోనాకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు పాటిస్తూ, కనీస అవగాహన పెంచుకున్న కొన్ని కుటుంబాలు కలిసి ఒక కమ్యూనిటీ/ బృందంగా ఏర్పడడం.. వీరంతా అప్పుడప్పుడూ కలుసుకోవడం, ఈ కుటుంబాలకు చెందిన పిల్లలు కలిసి ఆడుకోవడం, కనీస జాగ్రత్తలు పాటించడం.. ఇలా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగితే పిల్లల మానసిక ఆరోగ్యం బాగుంటుందనేది దీని ముఖ్యోద్దేశం. కాబట్టి ఈ పద్ధతి పాటించాలనుకునేవారు కనీస జాగ్రత్తలు తీసుకుంటూ, బాధ్యతగా ఉంటే పిల్లల్లో ఉన్న ఈ మానసిక సమస్యల్ని అధిగమించచ్చు. అలాగే పెద్దలకూ కాస్త రిలాక్సేషన్‌గా ఉంటుంది.

పిల్లల విషయంలో కరోనా పరీక్షలు ఎప్పుడు చేయించాలి?

* కరోనా లక్షణాలు కనిపిస్తే మూడో రోజు పరీక్ష చేయించాలి. యాంటి జెన్‌ టెస్ట్‌, పీసీఆర్‌ టెస్ట్‌లు చేస్తారు. అయితే యాంటిజెన్‌ టెస్ట్‌ నెగెటివ్‌ వస్తే.. పీసీఆర్‌ టెస్ట్‌ చేస్తారు.. అందులోనూ నెగెటివ్‌ అని తేలితే శరీరంలో వైరస్‌ లేదని అర్థం. ఒకవేళ యాంటిజెన్ టెస్ట్‌లోనే పాజిటివ్‌ అని తేలితే ఇక పీసీఆర్‌ అక్కర్లేదు.

* ఒకవేళ పిల్లలు కొవిడ్‌ లక్షణాలున్న వారిని కలిసినప్పుడు.. ఐదు నుంచి పది రోజుల మధ్య పరీక్ష చేయిస్తే ఫలితం సరిగ్గా వస్తుంది.

* ఇంట్లో అందరికీ కొవిడ్‌ ఉండి.. బిడ్డకు కొవిడ్ లక్షణాలుండి పరీక్షలో నెగెటివ్‌ వచ్చినా.. దాన్ని పాజిటివ్‌గానే తీసుకొని ఐసొలేషన్లో ఉంచాలి.

* లక్షణాలున్నా/లక్షణాలు లేకుండా పాజిటివ్‌ వచ్చినా అప్పట్నుంచి పది రోజుల పాటు స్వీయ ఐసొలేషన్ (ఈ పది రోజుల్లో చివరి మూడు రోజులు జ్వరం ఉండకూడదు)  కావాలి. అది కూడా లక్షణాలు తీవ్రంగా ఉంటే డాక్టర్‌ సలహా మేరకు మరిన్ని రోజులు ఈ ఐసొలేషన్‌ని పొడిగించాల్సి ఉంటుంది. ఆ తర్వాత రెండోసారి కొవిడ్‌ టెస్ట్‌ అవసరం లేదు.
* జ్వరం మూడు కంటే ఎక్కువ రోజులున్నా, బిడ్డను ఆస్పత్రిలో చేర్పించినా, MIS-C అన్న సందేహం ఉన్నా.. ఇలాంటి సందర్భాల్లో డాక్టర్‌ సలహా మేరకు మాత్రమే బిడ్డకు రక్తపరీక్షలు చేయించాల్సి ఉంటుంది. అంతేకానీ ఎవరికి వారు చేయించుకోకూడదు.

* అలాగే డాక్టర్‌ చెప్పకుండా పిల్లలకు సీటీ స్కాన్‌ అస్సలు చేయించకూడదు.

తల్లికి పాజిటివ్ వస్తే బిడ్డకు పాలివ్వచ్చా?

తప్పనిసరిగా ఇవ్వచ్చు. డబ్ల్యూహెచ్‌వో, ఇండియన్‌ అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్స్‌, సీడీసీ.. అందరూ ఇదే చెబుతున్నారు. అయితే తల్లి నుంచి బిడ్డకు కొవిడ్‌ సోకకుండా తల్లి మాస్క్ పెట్టుకోవాలి. చేతులు ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి. ఇంకా చెప్పాలంటే.. పాలివ్వడం వల్ల తల్లి నుంచి బిడ్డకు యాంటీబాడీస్‌ చేరి వైరస్‌ నుంచి రక్షణ కల్పిస్తాయన్న ఒక నమ్మకం కూడా ఉంది. అలాగే పాలిచ్చే తల్లులకు, గర్భిణులకు టీకాలు సురక్షితమే అని ఇటీవలే కేంద్ర ఆరోగ్య శాఖ జీవో విడుదల చేసింది. కాబట్టి గర్భిణులు, బాలింతలు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలి. దానివల్ల మీతో పాటు, బిడ్డకు కూడా రక్షణ ఉంటుంది.

కొవిడ్‌ టీకాపై ఉన్న అపోహలను ఎలా జయించాలి?

కొవిడ్‌ టీకా వేయించుకుంటే వైరస్‌ వస్తుందనే అపోహ కొంతమందిలో ఉంది. నిజానికి ఇది వైరస్‌ వల్ల కాదు.. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా గుంపులో టీకా వేయించుకున్నప్పుడు అక్కడ వైరస్‌ ఎవరికి ఉన్నా అంటుకోవచ్చు. కాబట్టి టీకా వేయించుకునేటప్పుడూ జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి! అలాగే ఒకవేళ వ్యాక్సిన్‌ వల్ల రియాక్షన్‌ వస్తే అడ్రినలిన్‌ అనే ఇంజెక్షన్‌ ఇస్తారు. అది మీరు వ్యాక్సిన్‌ వేయించుకున్న చోట అందుబాటులో ఉందో లేదో ముందుగానే కనుక్కోవడం మంచిది.

ఆవిరి పట్టడం, కర్పూరం వాసన చూపించడం, ముక్కులో నూనె వేయడం.. ఇలా పెద్దవాళ్లు పాటించే ఇంటి చిట్కాలు పిల్లలకూ ఉపయోగపడతాయా?

* ఆవిరి పట్టడం వల్ల పిల్లలకు ఎలాంటి ఉపయోగం లేదు. ఒకవేళ బిడ్డకు వెచ్చటి ఆవిరి ఇవ్వాలనుకుంటే గదిలో ఆవిరి నింపి బిడ్డను అక్కడ కాసేపు ఉంచడం మంచిది. అంతేకానీ వేడివేడి నీళ్లతో ఆవిరి పట్టడం వల్ల లేనిపోని ప్రమాదాలు జరగచ్చు.

* కర్పూరం ఆవిర్లు ఎక్కువగా పీల్చుకుంటే ఫిట్స్‌ వచ్చే ప్రమాదం ఉంది.

* ఇక ముక్కులో నూనె వేయడం వల్ల ఇది ఊపిరితిత్తుల్లోకి వెళ్లి లైపాయిడ్‌ న్యుమోనియా (నిమ్ము)కు దారితీయచ్చు. అలాంటి నిమ్ము తీవ్రమైతే ఒక్కోసారి చికిత్స చేయడం కూడా కష్టం.

* ఇంట్లో ఉన్నా పదే పదే పిల్లలకు శానిటైజర్లు వద్దు. బాత్‌రూమ్‌కి వెళ్లొచ్చినప్పుడు, అన్నం తినే ముందు.. సబ్బుతో చేతుల్ని శుభ్రం చేసుకోవాలి. ఒకవేళ బయట చేతులు కడుక్కునే పరిస్థితి లేనప్పుడు మాత్రమే శానిటైజర్‌ ఉపయోగించాలి.

డీపీటీ, ఎంఎంఆర్‌.. వంటి సాధారణ టీకాలు కరోనా వచ్చిన పిల్లలకు ఎప్పుడు వేయించాలి?

ఇవి చాలా ముఖ్యమైన టీకాలు. కాబట్టి పిల్లలకు అన్ని టీకాలు సకాలంలో వేయించాలి. ఒకవేళ కరోనా వచ్చిన పిల్లలకు వైరస్ తగ్గిన రెండు వారాలు ఆగి మామూలు టీకాలు వేయించచ్చు. ఈ క్రమంలో కరోనా జాగ్రత్తలు పాటించడం మాత్రం మరవద్దు.

కొవిడ్‌ సోకిన చిన్నారులకు ఎలాంటి మందులు ఇవ్వచ్చు?

వైరస్‌ తీవ్రతను బట్టి ఎలాంటి మందులు ఇవ్వాలో డాక్టర్‌ సలహా ఇస్తారు. అంతేకానీ ఈ విషయంలో సొంత ప్రయోగం, పెద్దలకు వాడిన మందులు.. వంటివి అస్సలు ఇవ్వద్దు.

పిల్లలకు నెలల తరబడి జింక్‌, విటమిన్‌-సి, విటమిన్‌-డి.. వంటి సప్లిమెంట్స్‌ ఇవ్వడం మంచిది కాదు. విటమిన్‌ ‘సి’ ఎక్కువైతే కిడ్నీలో రాళ్లు రావచ్చు. విటమిన్‌ ‘డి’ ఎక్కువ డోసులిస్తే కిడ్నీలు దెబ్బతినచ్చు.. తలలో ఒత్తిడి పెరగచ్చు. కాబట్టి పిల్లలు ఈ సప్లిమెంట్స్‌ వేసుకోవచ్చా? ఒకవేళ వేసుకోమంటే.. ఎన్ని రోజులు, ఎంత డోసు వాడాలో ముందుగానే డాక్టర్‌ని అడిగి తెలుసుకోవాలి.

బయట దొరికే ఇమ్యునోబూస్టర్లు అస్సలు వాడద్దు. వాటికి బదులుగా కాయగూరలు, పండ్లు.. వంటి పోషకాహారం ఎక్కువగా ఇవ్వడం, పిల్లలకు సకాలంలో సాధారణ టీకాలు వేయించడం.. వంటివి చేస్తే సహజసిద్ధంగానే రోగనిరోధక శక్తిని పెంచిన వారవుతారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్