ఇలాంటి మెంటర్లు ఉండాల్సిందే..!

ప్రతి ఒక్కరూ జీవితంలో వివిధ సందర్భాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి వారిలో చాలామంది అనుభవం ఉన్నవారి సలహాలను తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. వీరినే మెంటర్లుగా పిలుస్తుంటారు.

Published : 07 Oct 2023 19:44 IST

ప్రతి ఒక్కరూ జీవితంలో వివిధ సందర్భాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి వారిలో చాలామంది అనుభవం ఉన్నవారి సలహాలను తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. వీరినే మెంటర్లుగా పిలుస్తుంటారు. జీవితంలో వివిధ దశల్లో మెంటర్‌షిప్ అవసరం. అయితే బాస్‌, కోచ్‌, గురువు, సీనియర్‌, సహోద్యోగి.. ఇలా ఎవరైనా మెంటర్‌ కావచ్చు. పెద్ద పెద్ద సంస్థలు కూడా తమ బ్రాండ్ విలువను పెంచుకోవడానికి మెంటర్లను నియమించుకుంటాయి. అయితే మెంటర్లు సరైన నిర్ణయాలు తీసుకునే విధంగా సహాయపడాలి. కానీ, తప్పుదోవ పట్టించే విధంగా ఉండకూడదు. ఈ క్రమంలో వివిధ రకాల మెంటర్ల గురించి తెలుసుకుందామా...

సృజనాత్మకంగా..

ప్రతి ఒక్కరిలో సృజనాత్మకమైన ఆలోచనలు దాగి ఉంటాయి. కానీ, వాటిని కొంతమంది మాత్రమే సరిగా ఉపయోగించుకుని కెరీర్‌లో రాణిస్తుంటారు. అయితే కొంతమంది మాత్రం తమను ఎవరో ఒకరు ప్రేరేపిస్తే కానీ తమ సృజనాత్మకతను తెలుసుకోలేరు. ఈ పాత్రను మెంటర్లు పోషిస్తుంటారు. వీరు ఎదుటి వ్యక్తి నైపుణ్యాలను సునిశితంగా పరిశీలిస్తుంటారు. వాటిని మరింతగా ఎలా పెంపొందించుకోవాలో తెలియజేస్తారు. కీలక సమయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తుంటారు. ఇలాంటి మెంటర్లు ఎదుటి వ్యక్తిలోని సృజనాత్మకతను బయటకు తీయడంలో సిద్ధహస్తులు.

మానసికంగా తోడ్పాటునిస్తూ..

కొంతమందికి వివిధ నైపుణ్యాలున్నా వివిధ రకాల మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. సహోద్యోగులు కామెంట్‌ చేస్తున్నారని, అధికారులు తమనే టార్గెట్‌గా చేసుకుని వేధిస్తున్నారని.. ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఆత్మన్యూనతా భావంతో మానసికంగా ఇబ్బంది పడుతుంటారు. దీనివల్ల పనిలో నాణ్యత తగ్గడంతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. ఇలాంటి వారూ మెంటర్లను ఆశ్రయిస్తుంటారు. వీరు అసలు విషయాన్ని తెలుసుకుని దాన్నుంచి వారిని బయటపడేయడానికి తగు సలహాలిస్తుంటారు. ఈ క్రమంలో వారికి మానసిక ధైర్యాన్ని అందిస్తుంటారు.

వారు కూడా..

ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితులు, సహోద్యోగులు ఏదో ఒక రూపంలో కీలక పాత్ర పోషిస్తుంటారు. మన నైపుణ్యాలతో పాటు వ్యవహారశైలి గురించి కూడా వారికి తెలుస్తుంటుంది. ఏదైనా కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు వీరు సహాయపడే అవకాశం ఉంటుంది. అలాగే ఇతరులకు మన శక్తిసామర్థ్యాలను వివరించడంలో కూడా సహాయపడుతుంటారు.

ఆర్థికంగా..

కొంతమంది వ్యక్తిగత, వృత్తిగత సమస్యలను స్వయంగానే పరిష్కరించుకోగలుగుతారు. కానీ ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటారు. సరైన అవగాహన లేక నష్టపోతుంటారు. ఇలాంటి వారు ఆర్థిక విషయాలపై అవగాహన ఉన్నవారి సలహాలు తీసుకోవచ్చు. వీరికి పెట్టుబడులు ఎక్కడ పెట్టాలి, దేనికి ఎంత ఖర్చు చేయాలి, ఏ సమయంలో ఎలాంటి వస్తువులు తీసుకోవడం అవసరం వంటి విషయాలపై అవగాహనతో పాటు అనుభవం ఉండే అవకాశం ఉంటుంది. ఒక రకంగా వీరు ఆర్థిక సలహాదారులుగా సహాయపడుతుంటారు.

అనుభవ పాఠాలతో..

కొంతమంది ఏ సబ్జెక్టులోనూ నిష్ణాతులు కానప్పటికీ.. వారి అనుభవ పాఠాలు మాత్రం ఇతరులకు ఉపయోగపడుతుంటాయి. అయితే సాధారణంగా ఇలాంటి వారు వయసులో పెద్దవారు కాబట్టి ఇప్పటి తరానికి అనుగుణంగా ఆలోచించలేరని భావించేవారూ ఉంటారు. కానీ, కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు వీరి అనుభవాలు ఎంతో ఉపయోగపడుతుంటాయి. కొన్ని సందర్భాల్లో వారి అనుభవసారం సమస్యల పరిష్కారానికి దారి చూపుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్