Published : 30/08/2021 17:26 IST

అమ్మ గురించి ఆ బిడ్డకు తెలియాలని..!

(Photo: Instagram)

లాస్‌ ఏంజెలిస్‌కు చెందిన జేమ్స్‌కు తన భార్య యెసెనియా అంటే ఎంతో ప్రేమ. తమ ఆలుమగల బంధానికి ప్రతీకగా ఓ చిన్నారిని తమ జీవితంలోకి ఆహ్వానించేందుకు కూడా రడీ అయ్యారు. పుట్టబోయే బుజ్జి పాపాయిని ఊహించుకుంటూ ఎంతో ఉత్సాహంగా మెటర్నిటీ ఫొటోషూట్‌ తీయించుకున్నారు. ఇలా భార్యా పిల్లలతో తన జీవితాన్ని ఎంతో అందంగా ఊహించుకున్న జేమ్స్‌ జీవితం ఓ యాక్సిడెంట్‌తో పూర్తిగా తలకిందులైంది. కారు ప్రమాదంలో యెసెనియా కన్నుమూసింది. అయితే అదృష్టవశాత్తూ కడుపులోని బిడ్డ మాత్రం ప్రాణాలతో బయటపడింది.

అందుకే మళ్లీ ఆ ఫొటోషూట్!

ఇది జరిగి ఏడాది దాటిపోయింది. బిడ్డ అడలిన్ మొదటి పుట్టిన రోజు రానే వచ్చింది. తన కూతురు బర్త్‌డేను వేడుకగా సెలబ్రేట్‌ చేయాలనుకున్నాడు జేమ్స్‌. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే... ఇదే రోజు తన భార్య ఈ లోకాన్ని విడిచిపెట్టిపోవడం. అందుకే తన భార్య జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటూ తన చిన్నారి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించాడు. ఇందులో భాగంగా తన భార్య తీయించుకున్న మెటర్నిటీ ఫొటోషూట్‌ను తన చిన్నారితో కలిసి రీక్రియేట్‌ చేశాడు.

ఇందుకోసం తన సతీమణి లాగానే అడలిన్ను కూడా పింక్‌ కలర్‌ దుస్తుల్లో ఎంతో అందంగా ముస్తాబు చేశాడు జేమ్స్‌. అనంతరం మెటర్నిటీ ఫొటోషూట్‌ తీయించుకున్న లొకేషన్లకు వెళ్లారు. భార్యాభర్తలిద్దరూ ఫొటోలు దిగిన చోటే తండ్రీకూతుళ్లు కలిసి వివిధ పోజుల్లో ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా తన భార్య చిత్ర పటాన్ని కూడా పక్కనే ఉంచాడు జేమ్స్. ప్రస్తుతం ఈ ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.

ఆ క్షణం మా కలలన్నీ కూలిపోయాయి!

‘యెసెనియాను మొదటిసారిగా 2017లో కలుసుకున్నాను. ఆ తర్వాత ఒకరికొకరు బాగా దగ్గరయ్యాం. రెండేళ్లు ప్రేమలోనే గడిపాం. ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చడంతో మా బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనుకున్నాం. 2019 ఆగస్టు 27న మేమిద్దరం పెళ్లిపీటలెక్కాం. పెళ్లి తర్వాత మా బంధం మరింత దృఢంగా మారింది. ఇద్దరం కలిసి ప్రపంచంలోని అందమైన, అద్భుతమైన ప్రదేశాలను చుట్టేశాం. ఎన్నో అడ్వెంచర్‌ యాత్రలకు కూడా వెళ్లాం. ఇక మా ప్రేమ బంధానికి ప్రతీకగా ఓ చిన్నారి మా జీవితంలోకి రానుందని తెలుసుకుని ఎంతో సంబరపడ్డాం. అమ్మానాన్నలుగా మారేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురుచూశాం. కానీ 2020 ఆగస్టు 11 న నా జీవితంలో మరిచిపోలేని విషాదం చోటుచేసుకుంది. ఆరోజు మేమిద్దరం కబుర్లు చెప్పుకుంటూ రోడ్డు పక్కన నడుచుకుంటూ వస్తున్నాం. ఆ సమయంలో ఓ ఎస్‌వీయూ కారు పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ వేగంగా మా వైపు దూసుకు వచ్చింది. అందులోని డ్రైవర్‌ బాగా మత్తులో ఉన్నాడు. కళ్లుమూసి తెరిచేలోపు ఆ వాహనం మా ఆవిడను ఢీకొట్టి వెళ్లిపోయింది. ఆ క్షణం మేం కన్న కలలన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతోన్న నా భార్యను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాను. అప్పటికే ఆలస్యమైందని డాక్టర్లు తేల్చేశారు. అయితే తాను పోతూ పోతూ అడలిన్ రూపంలో ఓ అందమైన బహుమతిని నాకు ప్రసాదించింది.’

ఫైటర్‌లా కనిపించింది!

‘నా బిడ్డ ఈ లోకంలోకి రాగానే సరిగ్గా ఊపిరి తీసుకోలేకపోయింది. శ్వాస సంబంధిత సమస్యలు ఎదురుకావడంతో వెంటిలేటర్‌ అమర్చాల్చి వచ్చింది. ఇది నన్ను మరింత కుంగదీసింది. జీవితంపై విరక్తి ఏర్పడింది. అయితే క్రమంగా నా బిడ్డ ఆరోగ్యం మెరుగుపడింది. వెంటిలేటర్‌ అవసరం లేకుండా పోయింది. ఆ సమయంలో తనొక ఫైటర్‌లా కనిపించింది. నిరాశానిస్పృహలతో నిండిపోయిన నా జీవితంలో ఓ సరికొత్త వెలుగు వచ్చినట్లయింది.’

నా భార్య గురించి కూడా తెలియాలి !

‘ఇక ఈ ఫొటోషూట్‌ విషయానికొస్తే...ఇప్పుడు నా బిడ్డే నాకు ప్రపంచం. తన కోసమే ఈ లోకంలో ఉన్నాననిపిస్తుంది. అయితే నా కూతురు గురించి తెలిసిన ఈ ప్రపంచానికి వాళ్ల అమ్మ గురించి కూడా తెలియాలి. ఎందుకంటే తనకు ప్రాణం పోసింది తనే. నాకింతటి అద్భుతమైన వరాన్ని ప్రసాదించిన ఆమె రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. అందుకే ఇలా తనకు ఓ చిన్న కృతజ్ఞతగా ఈ ఫొటోషూట్‌ ఏర్పాటుచేశాను. ఇప్పుడు నేను చేస్తున్నదంతా నా బిడ్డకు అర్థం కాకపోవచ్చు. కానీ ఏదో ఒకరోజు ఈ ఫొటోలు తనకు చూపిస్తాను. వాళ్ల అమ్మ ఎలా ఉండేదో, ఆమెకు నా జీవితంలో ఎలాంటి స్థానం ఉందో అప్పుడైనా తను అర్థం చేసుకుంటుంది’ అని చెప్పుకొచ్చాడు జేమ్స్.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని