తినే విధానం నేర్పారా?
పిల్లలకు అన్నం తినిపించడం అమ్మలకు పెద్ద ప్రహసనం. టీవీ, మొబైల్ చూపించి పెట్టడం ఇప్పుడు సర్వసాధారణమైంది. మరి భవిష్యత్ గురించి ఆలోచించారా? రేపది వాళ్లకు ఇబ్బందిగా మారొచ్చు. కాబట్టి, చిన్నతనం నుంచే అలవాట్లను మార్చండి.
పిల్లలకు అన్నం తినిపించడం అమ్మలకు పెద్ద ప్రహసనం. టీవీ, మొబైల్ చూపించి పెట్టడం ఇప్పుడు సర్వసాధారణమైంది. మరి భవిష్యత్ గురించి ఆలోచించారా? రేపది వాళ్లకు ఇబ్బందిగా మారొచ్చు. కాబట్టి, చిన్నతనం నుంచే అలవాట్లను మార్చండి.
తినే ముందు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోమనాలి. దీన్ని ముందు మీరు పాటిస్తే మిమ్మల్ని చూసి పిల్లలూ నేర్చుకుంటారు. చేతులపై సూక్ష్మక్రిములు ఉంటాయి. సబ్బుతో రుద్ది కడిగితేనే అవి చనిపోతాయని వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలి. భోజనాల బల్ల దగ్గర గిన్నెల్లో చేయి పెడుతోంటే వారించండి. అందరూ తినే వాటిని అలా పట్టుకోకూడదని చెప్పండి. గబగబా నాలుగు మెతుకులు తినేసి ఎప్పుడు బయటకు వెళ్లిపోదామా అని చూస్తుంటారు కొందరు గడుగ్గాయిలు. దాంతో ఆదరాబాదరగా తినేస్తుంటారు. అలా తినడం వల్ల వచ్చే సమస్యలను నెమ్మదిగా చెప్పండి. నిదానంగా ఆహారం నమలి తినమని నేర్పాలి. అలాగే కుటుంబమంతా కలిసి కబుర్లు చెబుతూ తింటే వాళ్లూ ఇష్టపడతారు.
* కొందరు ఏదైనా కావాలంటే ఏడ్చిమరీ గోల చేస్తుంటారు. పెద్దవాళ్లూ సర్లేమ్మని తమ దగ్గరివి ఇచ్చేస్తుంటారు. ఈ తీరు మంచిది కాదు. పెట్టింది తినేలా అలవాటు చేయాలి. అయిపోతే సర్దుకోమనాలి. ఇంకా.. కావాల్సి వస్తే ఏడుపుతో కాకుండా మర్యాదగా అడగమని చెప్పాలి. కొన్ని పదార్థాలు వాళ్లకు నచ్చనివి అయ్యుండొచ్చు. దీంతో అవి అస్సలు బాగోవనీ, అందుకే తిననని తెగేసి చెబుతుంటారు. అదీ సరైన పద్ధతి కాదు. నచ్చని వాటిని పక్కన పెట్టాలే తప్ప వాటి గురించి వ్యతిరేకంగా మాట్లాడొద్దని వారించండి. పొరబాటున ఎవరి ఇంటికైనా వెళ్లినప్పుడు ఇదే పరిస్థితి ఎదురైతే అవతలి వాళ్లు ఇబ్బంది పడతారు. మీకూ చిన్నతనమే.
* ఆహారం తీసుకునే సమయంలో ఫోన్, టీవీ పెట్టకండి. బొమ్మలతోనూ ఆడుకోనివ్వొద్దు. రుచి, ఎంత తింటున్నారన్న దానిపై అవగాహన ఉండదు. మీరూ ఈ సమయంలో ఆ గ్యాడ్జెట్ జోలికి వెళ్లొద్దు. అప్పుడే తిన్నదీ ఒంటపడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.