Updated : 16/02/2022 02:55 IST

బంధంలో దశలు తెలుసా?

ఎన్నో ఆశలు, కలలతో కొత్త బంధంలోకి అడుగుపెడుతుంది ఏ జంటైనా! కొద్దిరోజులకు పరిస్థితితే మార్పు వస్తుంది. చిన్నచిన్న గొడవలైతే సరే.. పరిధి దాటితేనే ప్రమాదం. ఏ బంధమైనా ఇదంతా మామూలే అంటున్నారు నిపుణులు. ఆ దశలపై అవగాహన తెచ్చుకుంటే.. సర్దుకుపోవచ్చు అంటున్నారు.

* హనీమూన్‌... ఎదుటి వ్యక్తికి నచ్చేలా ప్రవర్తించడం, మంచి గుణాలనే చూపించే ప్రయత్నం చేయడం, దేనికైనా సర్దుకుపోవడం లాంటివన్న మాట.
* అలవాటు పడే క్రమం.. ఏదైనా కొన్నిరోజులకు అలవాటుగా మారిపోతుంది. బంధమూ అంతే! ఒకరి గురించి మరొకరికి పూర్తిగా తెలిశాక ఆకర్షించాల్సిన పనిలేదు అనిపిస్తుంది. సొంత పనులకు ఎక్కువ సమయం కేటాయిస్తుంటారు. దీంతో అవతలి వారికి తమను నిర్లక్ష్యం చేస్తున్న భావన కలుగుతుంది. ఇక అప్పట్నుంచీ సమస్యలు మొదలవుతాయి. కాబట్టి, మొదట్నుంచే ఇష్టాయిష్టాలు, పని, భాగస్వామితో గడిపే సమయం.. అన్నింటిపైనా స్పష్టతనివ్వండి.
* నాదే పై చేయి.. ఎవరికివారు పోటీతత్వాన్ని ప్రదర్శించడమన్నమాట. అప్పటిదాకా ఉన్న అసంతృప్తులు, అయిష్టాలు ఒక్కసారిగా బయటపడిపోతాయి. దీంతో ఏకరువు పెట్టేస్తుంటారు. గొడవలకీ దారితీస్తాయి. విడాకుల వరకూ వెళ్లేది ఈ దశలోనే. వివాహమనేది ఆట కాదు.. గెలుపోటములు ఉండటానికి. కలిసి నడవడం. అందుకే ముందు నుంచే అన్ని విషయాల్నీ పంచుకోవాలి. ఇద్దరూ సర్దుకుపోవాలి. అది ప్రారంభం నుంచే అలవాటవ్వాలి.
* అవగాహన సమయం.. పెళ్లి చేసుకున్నప్పటికీ, ఇప్పటికీ ఎదుటివారిలో వచ్చిన మార్పులు తెలుస్తాయి. అంటే.. మీకు నచ్చనివాటి విషయంలో అవతలి వ్యక్తి తీరు, సర్దుకుపోవడం, లేదా విధానాలు మార్చుకోవడం గమనిస్తారు. అది తిరిగి సాన్నిహిత్యం ఏర్పడేలా.. అన్నీ మళ్లీ పంచుకునేలా చేస్తుంది. ఒకరితో జీవితాంతం నడవాలని బలంగా కోరుకున్నప్పుడే ఇది సాధ్యమయ్యేది. అలాగే ఆ ప్రయత్నం రెండు వైపులా ఉండాలి. అప్పుడు ఒకరి గురించి మరొకరికి అర్థమవడానికి మాటే అవసరం ఉండదు. మూడోవ్యక్తి జోక్యానికీ ఆస్కారముండదు. అయితే ఇదంతా ఏళ్ల సమయం తీసుకునే ప్రక్రియ. ఓపిగ్గా ముందుకు సాగాలంతే!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని