నువ్వు చేయగలవు నాన్నా!

పిల్లలు ఫలానా పని చేయాలనుకుంటున్నామని చెప్పగానే నీవల్లకాదు, చాలా కష్టం అనకూడదంటున్నారు నిపుణులు. చేయగలిగే సామర్థ్యం నీకు ఉందని చెప్పాలట. పెద్దవాళ్లు అలా ప్రోత్సహించడంతో ఆ పని పూర్తి చేయగలననే నమ్మకం చిన్నారుల్లో మొదలవుతుందంటున్నారు.

Published : 28 Aug 2022 08:37 IST

పిల్లలు ఫలానా పని చేయాలనుకుంటున్నామని చెప్పగానే నీవల్లకాదు, చాలా కష్టం అనకూడదంటున్నారు నిపుణులు. చేయగలిగే సామర్థ్యం నీకు ఉందని చెప్పాలట. పెద్దవాళ్లు అలా ప్రోత్సహించడంతో ఆ పని పూర్తి చేయగలననే నమ్మకం చిన్నారుల్లో మొదలవుతుందంటున్నారు.

చిన్నారుల ఆలోచనావిధానాన్ని సరైన మార్గంలో నడిపించడమనే అతి పెద్ద బాధ్యత తల్లిదండ్రులదే. డాక్టరో, కలెక్టరో లేదా మరొకటో అవుతానని చెప్పగానే... దానికి చాలా కష్టపడాలి, నువ్వు చేయగలవా అని నిరుత్సాహపరచకూడదు. దానికన్నా, నీ ఆశయాన్ని చేరగలవు. కచ్చితంగా అనుకున్నది సాధించగలవు, ఏదైనా చేయగల సామర్థ్యం నీకుంది అని చెప్పి చూడండి. వారిపై వారికి నమ్మకం పెరుగుతుంది. అదే.. వారి లక్ష్యాన్ని సాధించడానికి తొలి మెట్టు అవుతుంది.


గాయాలైనా..

సైకిల్‌ నేర్చుకుంటానన్నప్పుడు వద్దు, దెబ్బలు తగులుతాయి అని భయపెట్టకూడదు. వారి వయసుకు తగిన సైకిల్‌ను అందించడానికి ప్రయత్నించాలి. నేర్చుకొనేటప్పుడు కిందపడితే.. అందుకే వద్దన్నాను అని నిష్టూరమాడవద్దు. పడితే దెబ్బలు తగలడం సహజమే. వాటి నుంచి కొత్తపాఠాలు నేర్చుకుంటారని అనుకోవాలి. చిన్నచిన్న గాయాలకు కంగారు పడకుండా, ధైర్యం చెప్పాలి. కింద పడినా.. తిరిగి వాళ్లే లేస్తారు. ఈ అనుభవాలన్నీ సైకిల్‌ తొక్కడంలో శిక్షణగా ఉపయోగపడతాయి. భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలు, అనుకోని అవాంతరాలను ఎలా దాటాలో ఇవే పాఠాలు చెబుతాయి.


వైఫల్యాలు..

దువు, కళలు, క్రీడలు వంటి వాటిలో పోటీకి తలపడేలా ఉత్సాహపరచాలి. వైఫల్యాలెదురైనా ధైర్యం చెప్పి మరో పోటీకి హాజరయ్యేలా చేయాలి. ఒకసారి ఓటమికే పిల్లలను ఆపేయకూడదు. తిరిగి పోరాడేలా చేస్తేనే, కొత్తపాఠాలు నేర్చుకుంటారు. ఓటమి వల్ల కలిగే భయం వారి నుంచి క్రమేపీ దూరమవుతుంది. విజేతలుగా తిరిగొస్తారు. అలాగే కొంచెం రిస్క్‌తో కూడిన ఆటల్లో చేర్పించాలి. సాహసక్రీడలు, పర్వతారోహణ వంటి వాటిలో ఉత్సాహపరచాలి. వాటి నుంచి స్వీయరక్షణ అనే బాధ్యత తెలుసుకుంటారు. పిల్లలకు వచ్చే కొత్త ఆలోచనలను ప్రోత్సహించి ముందుకు నడిపించాలి తప్ప, ఇదేదో కొత్తమార్గం, విజయం దక్కుతుందో లేదో అనే అనుమానాన్ని పిల్లల వద్ద వ్యక్తీకరించకూడదు. ఆ ఆలోచన ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో సొంత అనుభవంతో తెలుసుకుంటారు. అది వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని