యూట్యూబ్‌ ఛానెల్‌ పేరునే బాబుకి పెట్టా!

జీవితం సాఫీగా సాగిపోవాలకుంటారుకొందరు. వైవిధ్యంగా ఉండాలని తపన పడతారుమరికొందరు. రెండో కోవకి చెందుతారు సంధ్య. ప్రయాణాలు, వివిధ ప్రాంతాల ఆహారంపై ఇష్టంతో భర్తతో కలిసి ప్రపంచ దేశాలను చుట్టేస్తున్నారు. ఆ విశేషాలను ‘సంయాన కథలు’ పేరుతో యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా అందరికీ చూపిస్తున్నారు. వారి పర్యటనల విశేషాలను లండన్‌ నుంచి వసుంధరతో పంచుకున్నారిలా...

Updated : 13 Sep 2021 06:15 IST

జీవితం సాఫీగా సాగిపోవాలకుంటారు కొందరు. వైవిధ్యంగా ఉండాలని తపన పడతారు మరికొందరు. రెండో కోవకి చెందుతారు సంధ్య. ప్రయాణాలు, వివిధ ప్రాంతాల ఆహారంపై ఇష్టంతో భర్తతో కలిసి ప్రపంచ దేశాలను చుట్టేస్తున్నారు. ఆ విశేషాలను ‘సంయాన కథలు’ పేరుతో యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా అందరికీ చూపిస్తున్నారు. వారి పర్యటనల విశేషాలను లండన్‌ నుంచి వసుంధరతో పంచుకున్నారిలా...

సక్తి, అభిరుచి, ప్రణాళిక ఉంటే... ఎంత కష్టమైన లక్ష్యాన్నైనా సాధించవచ్చు. దానికి తగ్గట్లుగానే ఇప్పటి వరకూ నా ప్రయాణం సాగింది. చిన్నప్పటి నుంచీ ఆహార ప్రియురాల్ని. ప్రయాణాలన్నా ఎంతో ఆసక్తి. టీఎల్‌సీ, డిస్కవరీ, ఫుడ్‌ ఛానెల్స్‌ని విపరీతంగా చూసేదాన్ని. అందుకేనేమో ఎదిగే కొద్దీ విదేశాల్లో చదువుకోవాలనే కోరికా బలపడింది. అది పెళ్లితో నెరవేరింది. మాది రాజమహేంద్రవరం. సంప్రదాయ మధ్యతరగతి కుటుంబం. కట్టుబాట్లు కాస్త ఎక్కువే. బీటెక్‌ అయ్యాక పెళ్లి చేశారు. మా వారు చైతన్యది తుని. ఆయన డిస్నీలో పైథాన్‌ డెవలపర్‌. పెళ్లయ్యాక లండన్‌ వచ్చేశాం. ఇక్కడే ఎమ్మెస్‌ చేసి, ఉద్యోగంలో చేరా. కొన్నాళ్లకి జీవితం రొటీన్‌గా మారిపోతున్నట్టు అనిపించింది. కాస్త విశ్రాంతినీ, ఉపశమనాన్ని ఇచ్చే ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాం. మా ఇద్దరి ఇష్టాయిష్టాలూ ప్రయాణాలు, ఆహారమే. ఇంకేముంది ప్రపంచమంతా చుట్టేయాలనుకున్నాం. వారాంతాలు, సెలవుల్లో వివిధ ప్రాంతాలకు వెళ్లి రావడం మొదలు పెట్టాం. అప్పటికి యూట్యూబ్‌ ఛానెల్‌ క్రియేట్‌ చేసినా వీడియోలు తీయాలనుకోలేదు. కానీ ఇండియాలో ఉన్న బంధువులు, స్నేహితులతో పంచుకున్నట్లు ఉంటుంది, మరికొంత మందిని గైడ్‌ చేసినట్లూ ఉంటుందని ‘సంయాన కథలు’ పేరుతో వీడియోలు చేయడం ప్రారంభించాం. తర్వాత పుట్టిన మా బాబుకీ ఆ పేరే పెట్టుకున్నాం!

తెలియని ప్రాంతాల్ని చూపించాలని...

పర్యటన అంటే... ఏదో లెక్కకు చూశాం అన్నట్లు కాకుండా కొన్నాళ్లు అక్కడే ఉండి చరిత్ర, సంస్కృతి, ఆహారం వంటి విషయాలన్నీ కూలంకషంగా తెలుసు కోవాలనుకున్నాం. అందరికీ తెలిసినవి కాకుండా... కొత్తవి, చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రదేశాలను, విశేషాలనూ చూపించాలనుకున్నాం మన దేశం నుంచి వచ్చే విద్యార్థులు, పర్యటకులకు పనికొచ్చే ఎన్నో విషయాలనూ చెబుతున్నాం. ఇవన్నీ తెలుగులోనే చెబుతాం. ఎందుకంటే ఇప్పటికీ మన చుట్టుపక్కల కనీసం పక్క జిల్లా కూడా చూడని ఎందరో ఉంటారు. అలాంటి వారందరినీ మా వీడియోలు సంతోష పెట్టాలి. పిల్లలకు దూరంగా ఉండే అమ్మానాన్నలకు కాస్త ఆటవిడుపులా అనిపించాలి... ఈ లక్ష్యాలతో సామాన్య భాషలో చెబుతున్నాం. అందుకే చాలా మంది తమ పిల్లల్ని మాలో చూసుకుంటున్నారు. ఇది మేం చెప్పడం కాదు... చాలా మంది అలా మెసేజ్‌ చేస్తూ ఉంటారు. ఆ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో లండన్‌లో బ్రహ్మోత్సవాలు చేస్తున్నారని వెళ్లాం. అక్కడ మమ్మల్ని ఎంతో మంది గుర్తు పట్టి పలకరించారు. సెల్ఫీలు, ఫొటోలు తీసుకున్నారు. ఇవన్నీ చాలా సంతోషంగా అనిపిస్తాయి. 2016లో ఛానెల్‌ని ప్రారంభించాం. కానీ అప్పుడు పెద్దగా అప్‌లోడ్‌ చేయలేదు. ఇప్పటి వరకూ ఇంగ్లండ్‌లోని ఇంటీరియర్‌ ప్రాంతాలతో పాటు టర్కీ, నార్వే, ఆస్ట్రియా, ఇటలీ, ఫ్రాన్స్‌, యూరప్‌ వంటి దేశాలు తిరిగాం. యూట్యూబ్‌ ద్వారా వచ్చేది వీడియో ఎక్విప్‌మెంటూ, పర్యటనల కోసమే ఖర్చు పెడతాం.

రెండేళ్ల బాబుతో....

కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీని పంటింగ్‌లో ప్రయాణిస్తూ చూపించడం ఓ కొత్త ఆలోచన. ఎంతో మంది మా వీడియోని చూసి అలా వెళ్లారని అక్కడి నిర్వాహకుడు పని కట్టుకుని ఫోన్‌ చేసి చెబితే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఈ ప్రయాణాల్లో అనుకోనివి ఎన్నో సంఘటనలు జరుగుతాయి. మరెన్నో ఇబ్బందులూ ఎదురవుతాయి. దేనికైనా సిద్ధంగా ఉండాలి. ఓ సారి నార్వేలోని ఓ మారుమూల ప్రాంతానికి వెళ్లాం. అక్కడికి చేరుకునే సరికి అర్ధరాత్రి అయ్యింది. ముందుగానే హోటల్‌ బుక్‌ చేసుకున్నాం. కానీ... అక్కడ రాత్రి 9కే అన్నీ క్లోజ్‌ అన్న విషయం తెలియదు. దాంతో వణికించే చలిలో రాత్రంతా కార్లోనే ఉన్నాం. మేం ఇప్పటి వరకూ రెండేళ్ల మా బాబుని తీసుకుని ప్రయాణించాం. ఒక్కోసారి ఎత్తైన కొండలు ఎక్కి దిగాల్సి రావొచ్చు. స్ట్రోలర్‌ కూడా పనిచేయదు. యూరప్‌లో మా బాబుని ఎత్తుకుని ట్రెక్కింగ్‌ చేయడం కాస్త కష్టంగానే అనిపించింది. మా అనుభవాలన్నీ చెబుతుంటే అందరికీ ఆసక్తిగా అనిపిస్తాయి. అక్కడికి వెళ్లే వారు ముందే జాగ్రత్త పడతారు. నార్వేలో క్రూయిజ్‌లో, టర్కీలో హాటెయిర్‌ బెలూన్‌ ప్రయాణం వంటివి అద్భుత అనుభవాలు. నిజానికి ప్రయాణాలు అంత సులువేమీ కాదు... డైట్‌ ప్రాపర్‌గా ఉండాలి. ఫిట్‌గా ఉండాలి. అందుకే మేం అన్నీ ప్లాన్డ్‌గా చూసుకుంటాం. ప్రస్తుతం మా ఛానెల్‌కి 1.28 లక్షల మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. యూట్యూబ్‌ వీడియోల ఎడిటింగ్‌ అంతా నేనూ, మా వారూ కలిసే చేసుకుంటాం. ట్రావెల్‌ డాక్యుమెంటరీల్లా చేయాలనేది మా తపన.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్